మొక్కజొన్నలో చీడ పురుగుల యాజమాన్యం మొక్కజొన్నను మనం ఆహారంగానే గాక, దాణా, పశు వులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా, పేలాలు, తీపి కండె, కాయగూరగా ఉపయోగిస్తున్నాం. ఈ పంటను అనేక రకాల పురుగులు ఆశించి దిగుబడిని తగ్గిస్తున్నాయి. వీటి నివారణకు సమయానుకూల సస్యరక్షణ చర్యలు చేపట్టి రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చు. కాండం తొలుచు పురుగు ఇవి పైరు మొలకెత్తిన 10-20 రోజుల నుంచి అశిస్తాయి. తల్లి పురుగు 2-3 వరుసల్లో ఆకు మొదలు, కాండం మధ్యభాగంలో ముత్యాల వంటి గుడ్లను 7-20 రోజులలో పెడు తుంది. వారం రోజుల్లో గుడ్లు పగిలి పిల్ల పురుగులు మొదట ఆకుల పైన పత్ర హరితాన్ని గోకి తింటాయి తర్వాత కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి అంకురాన్ని తింటాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది మాదిరి రంధ్రాలు లేదా అగ్గిపుల్ల మందం పొడవాటి చిల్లులను వరుసల్లో గమనించవచ్చు. కాండం లోపల “S” ఆకారంలో సొరంగాలు ఏర్పడతాయి. మొవ్వును ఆశించి అంకురాన్ని తినడం వల్ల మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. దీనినే డెడ్ హార్ట్ లేదా మొవ్వు కుళ్లు అని అంటారు. ఈ పురుగు పూతను, కండెను ఆశించడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. సమగ్ర సస్యరక్షణ పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. ఎర పంటగా జొన్న పైరును 3-4 వరుసల్లో మొక్కజొన్న చుట్టూ విత్తుకుంటే పురుగు జొన్నకు ఆకర్షింపబడుతుంది. అంతర పంటలుగా అపరాలు (కంది, సోయాబీన్, బొబ్బర్లు) సాగు చేసి సహజ శత్రువుల సంఖ్యను పెంపొందించాలి. ఈ పురుగు గుడ్లపై పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులను ఎకరాకు 2-3 చొప్పున రెండు విడతలుగా 12, 22 రోజుల పైరు దశలలో విడుదల చేయాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సమపాళ్ళలో పంటకు అందించాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే పురుగు ఉధృతిని బట్టి 25-30 రోజుల మధ్య కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. కత్తెర పురుగు గుర్తింపు చిహ్నాలు: గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన "Y" ఆకారంలో తెల్లని చారను, ఉదర భాగంలో ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో (::) ఉంటాయి. మొదటి దశ గొంగళి పురుగు ఆకులపైపత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. గొంగళి పురుగు పెరిగేకొద్దీ ఆకుల చివరల నుంచి తింటూ ఆకులను కత్తిరించి నట్లుగా కనిపిస్తూ ఆకుల ను పూర్తిగా తినివేయడం గమనించవచ్చు. ఆకు సుడులు, కాండాన్ని కూడా తొలిచి రంధ్రాలను చేసి పంటను నష్ట పరుస్తుంది. మొక్కజొన్న కంకి, లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. సమగ్ర సస్యరక్షణ పంట చుట్టూ నాలుగు వరుసల నేపియర్ గడ్డిని ఎర పంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరి నాశనం చేయాలి. గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి లీటరు వేప నూనెను పిచికారీ చేయాలి. తొలి దశ గొంగళి పురుగులను నివారించడానికి ఎకరానికి 500 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 400మి.లీ. క్వినాల్ ఫాస్ పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగులు ఎక్కువగా ఉంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రా. లేదా స్పైనోసాడ్ 60 మి.లీ. ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10కిలోల తౌడు + 2 కిలోల బెల్లం+2 లీటర్ల నీరు కలిపి 24 గంటల పాటు పులియబెట్టి, ఆ మిశ్రమానికి 100 గ్రా. థయోడికార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు/మొవ్వులో వేయాలి. పేనుబంక పంట బెట్టకు గురయినప్పుడు పేనుబంక ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూల వాతావరణంలో జీవిత కాలం వారం రోజుల్లో పూర్తవుతుంది. ఇవి ఎక్కువగా 30-60 రోజుల వయసున్న పైరును ఆశిస్తాయి. తల్లి, పిల్ల పురుగులు ఆకులు, లేత కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వాడి, పసుపు రంగుకు మారి ముడుచుకు పోతాయి. మొక్కజొన్న చిన్న దశలో పేనుబంక ఆశిస్తే ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు తేనె లాంటి జిగురు విసర్జించడం వల్ల శిలీంద్రాలు సోకి తెగులు ఆశించడం వల్ల కిరణజన్య సంయోగ పదార్థాన్ని మని క్రియకు అంత రాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. తేనె వంటి పదార్థం కోసం తిరిగే చీమలను బట్టి ఈ పురుగు ఆశించినట్లు తెలుసు కోవచ్చు. నివారణ : ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లేదా థయోమిథాక్సం 0.2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పేనుబంకను సహజంగా అక్షింతల పురుగులు, సిర్ఫిడ్లు వంటి పరాన్న భుక్కులు, పరాన్న జీవులు అదుపులో ఉంచుతాయి. ఆధారం : పాడిపంటలు మాస పత్రిక డా. కె.రేవతి శాస్త్రవేత్త, (సస్యరక్షణ విభాగం) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా