ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన పనులు పండ్ల తోటలు అరటి : నాటిన తర్వాత చనిపోయిన పిలకల స్థానంలో ఆరోగ్యవంతమైన పిలకలను నాటాలి. పచ్చిరొట్ట ఎరువును వేసి భూమిలో కలియదున్నాలి. తెల్లచక్కెరకేళి రకానికైతే 35 రోజులకు, పెద్దపచ్చ, పొట్టిపచ్చ అరటి రకాలకు 40 రోజులకు, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంత రకాలకు 45 రోజులకు, 110 గ్రా. యూరియా, 80 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చెట్టుకు రెండు వైపులా 30-40 సెం.మీ. దూరంలో 10 సెం.మీ. లోతు గుంతలలో వేసి మట్టితో కప్పి తేలిక పాటి తడి ఇవ్వాలి. నిమ్మ : గజ్జితెగులు నివారణకుగాను బైటాక్స్ 30 గ్రా స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చెట్ల కాండానికి బోర్డోపేస్టును పూయాలి. దీనితో బంకకారు తెగుళ్ళను, కాండం పగుళ్ళను నివారించవచ్చు. లేత తోటలలో పచ్చిరొట్ట పైర్లను వేసి, పూత దశలో భూమిలో కలియ దున్నాలి. బొప్పాయి : ఆకుముడత తెగుళ్ళ లక్షణాలు ఉన్న మొక్కలను గమనించినచో పీకి కాల్చివేయాలి. కాండం మొదలు వేరుకుళ్ళు ఆశించినపుడు, మొదలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశించినచో నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి. బోర్డోమిశ్రమం 1% లేదా అలియేట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాలి లేదా 10 గ్రా. ట్రైకోడెర్మా పొడిని ఒక లీటరు నీటిలో కలిపి బొప్పాయి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేటట్లుగా పోయాలి లేదా ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రము + 90 కిలోల పశువుల ఎరువు + 10 కిలోల వేపపిండి 1 కిలో బెల్లం నీటిని 10 రోజులు మాగనిచ్చి చెట్ల పాదుల్లో వేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటరు నీటికి 2 గ్రా. రిడోమిల్ ఎమ్-జడ్ కలిపి చెట్ల మొదళ్ళలో కాండాన్ని తడుపుతూ మందును పోయాలి. కూరగాయల పంటలు క్యాబేజి, కాలీఫ్లవర్ : (స్వల్పకాలిక రకాలు) నారును ఎత్తైన నారుమళ్ళపై పెంచాలి. కంద : 50 శాతం మొలక వచ్చిన తరువాత నుంచి 40 రోజులకు 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ ఎరువులు (72 కిలోల యూరియా, 55 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) మొక్కకు రెండువైపులా గుంటలో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి. చేమగడ్డ : పైరు ప్రాథమిక దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5గ్రా. అన్నభేది. 1 గ్రా. నిమ్మఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పలుచగా మొలిచిన కలుపును తీయించి ఎకరానికి 35 కిలోల యూరియా, 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను మొక్కకు రెండు వైపులా గుంటలలో వేసి మట్టితో కప్పి తేలికపాటి తడి ఇవ్వాలి. ఉల్లి : నారుమడి తయారయితే ప్రధాన పొలాన్ని 2-3 సార్లు దుక్కి చేసి పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నారు కుళ్ళు నివారణకు కాపర్ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./లీటరు నీటికి కలిపి నారుమడి మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. + మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు, 250 కిలోల వేపపిండి, 20 కిలోల నత్రజని, 20-32 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. సుగంధ ద్రవ్య పంటలు పసుపు : విత్తిన పొలములో మొదటి సారి కలుపు తీసి, అంతరకృషి చేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను జులై 15 లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తినట్లయితే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఆశించే ఆకుమచ్చతెగులు నివారణకు 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా మెటలాక్సిల్ లేదా 2 మి.లీ. ప్రొపికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మిరప : ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఎరువును వేసి పెరిగిన పచ్చి రొట్ట పైరును భూమిలో కలియదున్నాలి. సాలు తోటలు వేయదలచిన వారు ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేటు ఎరువును వేసి, జులై రెండవ వారంలో ఎకరానికి 2.5 కిలోల విత్తనం చొప్పున గొర్రుతో ఎదబెట్టాలి. మిరపతోపాటు పొలం చుట్టూ 2-3 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్నను రక్షక పంటగా విత్తుకోవాలి. అవసరాన్ని బట్టి నారుమళ్ళలో విత్తనం వేసుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తిన 9, 15వ రోజున కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా./లీటరు నీటికి) మందు ద్రావణంతో మళ్ళను తడపాలి. అల్లం : కలుపు తీత మట్టి ఎగదోయుట కొనసాగించాలి. ఔషధ, సుగంధ పంటలు కలబంద : వేరు పిలకలు లేదా వేరు కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయాలి. కనీసం 15-20 సెం.మీ. పొడవుతో 4-5 ఆకులను కలిగిన పిలకలను 60-95 సెం.మీ. దూరంలో నాటాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు తీయాలి. పామరోజా : పంటకు ఎకరానికి 20 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. నాట్లు వేసుకోవచ్చును. అశ్వగంధ : ఖరీఫ్ లో ఆలస్యంగా సాగు చేస్తారు. కనీసం 65-70 సెం.మీ. వర్షపాతం అవసరం. పొడి వాతావరణం సాగుకు అనుకూలం. వర్షపాతం తక్కువగా / సరిపోని యెడల 2–3 సార్లు నీటి తడులు ఇవ్వాలి. ఎకరాకు 6-8 కిలోల విత్తనం సరిపోతుంది. వీటిని కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి విత్తుకోవాలి. వరుసలలో నాటటం అంత లాభసాటి కాదు. వెదజల్లడం వలన మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. తద్వారా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నేరుగా విత్తినపుడు 20-25 రోజుల తరువాత మొక్కలను పలుచన చేసి కలుపు తీయాలి. కోలియస్: నాటుటకు ఆఖరు దుక్కిలో ఎకరాకు 5-6 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం 20 కిలోల పొటాష్ వేసుకుని వేరు తొడిగిన కొమ్మ కత్తిరింపులను 45x45 సెం. మీ. దూరంలో నాటుకోవాలి. నిమ్మగడ్డి : పిలకల ద్వారా వరుసల మధ్య 60సెం.మీ. పిలకల మధ్య 45 సెం.మీ. దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవాలి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదళ్లలో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. నాటిన వెంటనే నీరు కట్టి, తర్వాత 2-3 రోజుల కొకసారి క్రమం తప్పకుండా నెల రోజుల వరకు నీరు పెట్టాలి. పిప్పలి : కొమ్మ కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. 5 కణుపులున్న ముక్కలను పాలీధీన్ సంచుల్లో నాటుకొని వేర్లు వచ్చిన తరువాత వీలైనంత వరకు వర్షాకాలంలో నాటుకోవాలి. ఎకరానికి సుమారు 11,000 మొక్కలు (60x60 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి) అవసరం. ఏక పంటగా సాగు చేసే యెడల త్వరగా పెరిగి నీడనిచ్చే చెట్లను 4-5 నెలలు ముందుగా నాటితే మంచి నీడ ఆధారం దొరుకుతుంది. నాటిన తొలి రోజుల్లో వర్షం లేకపోతే వారానికొకసారి నీరు పెట్టాలి. బాగా ఎదిగిన తరువాత 10 రోజులకొకసారి నీరు పెట్టాలి. పూలతోటలు బంతి : నాటుకునేముందు ఎకరాకు 30 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. నారును 60×45 సెం. మీ. దూరంలో నాటుకోవాలి. కనకాంబరం : 45 రోజుల వయసున్న నారు మొక్కలను ప్రధాన పొలంలో 60×45 సెం.మీ. ఎడంలో నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో 20 టన్నుల పశువుల ఎరువును 15 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం 25 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. చామంతి : పిలకలు లేదా కొమ్మ కత్తిరింపులను ప్రధాన పొలంలో 30X30 సెం.మీ. దూరంలో ఎకరానికి 40 వేల మొక్కల సాంద్రత ఉండే విధంగా నాటుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 50 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం 80 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వేయాలి. ఆధారం: పాడి పంటలు రైతు సలహా కేంద్రం, ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి.