షేడ్ నెట్ తో చల్లని సాగు - వేసవిలో నాణ్యమైన పంట,ఆదాయం వేసవిలో షేడ్ నెట్ కింద కూరగాయల సాగు అనేది అధిక ఉష్ణోగ్రతల నుండి పంటలను రక్షించడానికి, నీటి వినియోగాన్ని తగ్గించడానికి, నాణ్యమైన దిగుబడిని పొందడానికి ఒక అద్భుత మైన పద్ధతి. వేసవిలో ఉష్ణోగ్రతలు 40°C దాటినప్పుడు, సూర్యరశ్మి తీవ్రత మొక్కలకు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉం టుంది. షేడ్నెట్లు ఈ తీవ్రతను తగ్గించి, మొక్కల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను 3° నుండి 5°C వరకు తగ్గిస్తాయి. దీనివల్ల ఆకులు మాడిపోవడం, టమాటా వంటి పంటల్లో పూత రాలడం, కాయలు పగిలిపోవడం వంటి సమస్యలను నివారించవచ్చు. షేడ్ నెట్ సాగులో ఉన్న ప్రధాన ప్రయోజనాలు సాధారణ సాగుతో పోలిస్తే షేడ్ నెట్ కింద సాగు చేయడం వల్ల పలు రకాల లాభాలు చేకూరుతాయి. సూక్ష్మ వాతావరణ నియంత్రణ : షేడ్ నెట్ సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాలను ఫిల్టర్ చేస్తాయి. దీనివల్ల మొక్కల చుట్టూ ఉండే ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది.నీటి పొదుపు : వేసవిలో బాష్పీభవనం ఎక్కువగా ఉంటుంది. నెట్ల కింద గాలిలోని తేమ శాతం స్థిరంగా ఉండటం వల్ల భూమిలోని తేమ త్వరగా ఆరిపోదు. దీనివల్ల సుమారు 30% నుండి 40% వరకు నీటిని ఆదా చేయవచ్చు.నాణ్యమైన దిగుబడి : ఎండ తీవ్రత తక్కువగా ఉండటం వల్ల కూరగాయలు మంచి రంగు, ఆకృతి, రుచితో పెరుగుతాయి. ముఖ్యంగా టమాటా, క్యాప్సికమ్ వంటి పంటలలో ఎండ వల్ల కాయలు మచ్చలు పడటం వంటి సమస్య ఉండదు.కీటకాల నుండి రక్షణ : షేడ్ నెట్ లు భౌతిక అడ్డంకులుగా పనిచేయడం వల్ల తెల్లదోమ, పేనుబంక, కొన్ని రకాల రసం పీల్చు పురుగులు పంటపై దాడి చేయకుండా అడ్డుకోవచ్చు. షేడ్ నెట్ శాతాన్ని ఎంచుకోవడం మార్కెట్లో లభించే షేడ్నెట్లు ఎంత శాతం సూర్యరశ్మిని అడ్డుకుంటాయనే దానిపై ఆధారపడి ఉంటాయి. పంట రకాన్ని బట్టి సరైన శాతాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. 35% షేడ్ నెట్ : టమాటా, మిరప, బెల్ పెప్పర్ (క్యాప్సికమ్) వంటి ఎక్కువ ఎండను కోరుకునే కూరగాయలకు ఇది అనువైనది. ఇది సూర్యరశ్మిని మరీ తగ్గించకుండా, మొక్కలకు హాని కలగకుండా రక్షణ ఇస్తుంది. 50% షేడ్ నెట్ : సాధారణంగా అన్ని రకాల కూరగాయల సాగుకు, నారు మడుల పెంపకానికి ఇది ప్రామాణికమైనది. ముఖ్యంగా దోసకాయ పంటకు ఇది బాగా సరిపోతుంది. 50% నుండి 75% షేడ్ నెట్: పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరలకు ఇది అవసరం. ఈ పంటలు వేడిని తట్టుకోలేవు కాబట్టి, ఎక్కువ నీడ ఉంటే ఆకులు తాజాగా పెరిగి నాణ్యమైన పంటను పొందవచ్చు. షేడ్ నెట్ రకాలు, రంగుల ప్రాధాన్యత కేవలం నీడ శాతం మాత్రమే కాకుండా, నెట్ రంగు కూడా పంట పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకుపచ్చ : ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన రంగు. ఇది సహజమైన కాంతిని అందిస్తూ మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుంది. తెలుపు : ఇది సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. అత్యంత వేడి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతను బాగా తగ్గించడానికి ఇది సరైన ఎంపిక. నలుపు : ఇది వేడిని పీల్చుకుంటుంది. తక్కువ ఎండ ఉండే ప్రాంతాల్లో లేదా శీతాకాలంలో ఉష్ణోగ్రతను పెంచడానికి దీనిని వాడతారు. వేసవి సాగుకు ఇది అంతగా సిఫార్సు చేయరు. సిల్వర్ : ఇవి వేడిని వికర్షించి, లోపల చల్లదనాన్ని పెంచుతాయి. ఇవి ఖరీదైనవి అయినప్పటికీ ఫలితాలు చాలా బాగుంటాయి. వేసవిలో సాగుకు అనువైన కూరగాయలు వేసవి కాలం లో షేడ్ నెట్ కింద కొన్ని రకాల కూరగాయలు బహిరంగ ప్రదేశాల కంటే మెరుగైన దిగుబడిని ఇస్తాయి. అనువైన పంటలు : కాయగూరలు టమాటా, వంకాయ, మిరప, క్యాప్సికమ్, దోసకాయ, కర్బూజా, ఆకుకూరలు కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర, ముల్లంగి, క్యారెట్ సాగు యాజమాన్య పద్ధతులు నేల తయారీ : షేడ్ నెట్ లోపల నేలను బాగా దున్ని, ఎకరాకు కనీసం 10-15 టన్నుల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. నేల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి వంటి జీవ శిలీంధ్ర నాశినులను వాడటం మంచిది.బిందు సేద్యం : షేడ్ నెట్ కింద డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయడం వల్ల నీరు నేరుగా వేర్ల వద్దకు అందుతుంది. తేమను నియంత్రించడమే కాకుండా కలుపు మొక్కల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది.మల్చింగ్ : బెడ్ల పైన ప్లాస్టిక్ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల వేసవిలో భూమిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. వేర్ల వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. వేసవిలో కూరగాయల సాగు చేసేటప్పుడు పంట రకాన్ని బట్టి సరైన షేడ్ నెట్ శాతాన్ని ఎంచుకోవడం, క్రమబద్ధమైన నీటి పారుదల ఎరువుల యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడి సాధించడం సాధ్యమవుతుంది. ఆధారం: పాడి పంటలు , ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం,