సహజ వ్యవసాయం - నేలకు జీవం, పంటకు బలం, రైతుకు లాభం పరిచయం ప్రకృతితో సమన్వయంగా వ్యవసాయం చేయడం మన పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప సంప్రదాయం. అధిక రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు నేల ఆరోగ్యం, పర్యావరణం, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో, స్థానిక వనరులను ఉపయోగించుకుని, నేల జీవసారాన్ని పెంచుతూ నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే సహజ వ్యవసాయం రైతులకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. సహజ వ్యవసాయం అంటే కేవలం రసాయన ఎరువులను వాడకపోవడం మాత్రమే కాదు. నేలలోని సూక్ష్మజీవులు, పంటలు, పశువులు, నీరు, గాలి, ప్రకృతి వనరుల మధ్య సహజ సమతుల్యతను కాపాడుతూ వ్యవసాయం చేయడం దీని ప్రధాన లక్ష్యం. సహజ వ్యవసాయం ముఖ్య సూత్రాలు నేల ఆరోగ్య పరిరక్షణ : నేల వ్యవసాయానికి ప్రాణాధారం. నేలలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల సంఖ్య, జీవసారం పెరిగేలా చర్యలు చేపట్టాలి. పంట అవశేషాలను కాల్చకుండా పొలంలోనే ఉంచడం, సేంద్రియ పదార్థాలను వినియోగించడం ద్వారా నేల నిర్మాణం మెరుగుపడుతుంది. స్థానిక వనరుల వినియోగం : రైతు వద్ద అందుబాటులో ఉన్న ఆవు పేడ, ఆవు మూత్రం, పంట అవశేషాలు, ఆకులు, వేప, స్థానిక మొక్కలు వంటి వనరులను వ్యవసాయంలో ఉపయోగించడం నహజ వ్యవసాయంలో ముఖ్యమైన అంశం. దీనివల్ల బయట నుంచి కొనుగోలు చేసే ఇన్పుట్లపై ఆధారపడటం తగ్గుతుంది. విత్తన శుద్ధి : ఆరోగ్యకరమైన విత్తనం మంచి పంటకు పునాది. విత్తనాలను విత్తే ముందు స్థానికంగా తయారు చేసుకునే బీజామృతం వంటి సహజ ద్రావణాలతో శుద్ధి చేయడం ద్వారా విత్తనాలకు రక్షణ కల్పించవచ్చు. జీవామృతం వినియోగం : సహజ వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించే ముఖ్యమైన ద్రావణాలలో జీవామృతం ఒకటి. ఇది నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఆవు పేడ, ఆవు మూత్రం, పప్పుధాన్య పిండి, బెల్లం, నేల మట్టిని ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేయవచ్చు. మల్చింగ్ : నేలపై పంట అవశేషాలు, ఎండిన ఆకులు, గడ్డి వంటి పదార్థాలను పరచడాన్ని మల్చింగ్ అంటారు. ఇది నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పంట అవశేషాలు క్రమంగా కుళ్లి నేలకు సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. నీటి వినియోగంలో పొదుపు : సహజ వ్యవసాయంలో తక్కువ నీటితో పంటను సాగు చేయడం ముఖ్యమైన లక్ష్యం. నేలలో తేమను నిలుపుకోవడానికి మల్చింగ్ చేయాలి. అవసరానికి అనుగుణంగా నీటిని అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు. పంట వైవిధ్యం, అంతర పంటలు : ఒకే పంటను సాగు చేయడం కంటే పంట వైవిధ్యాన్ని పెంచడం మంచిది. ప్రధాన పంటతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు లేదా కూరగాయలను అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం లభించడంతో పాటు తెగుళ్ల ఒత్తిడి తగ్గుతుంది. సహజ పద్ధతుల్లో పురుగు నివారణ : పంటను నష్టపరిచే పురుగులను పూర్తిగా నిర్మూలించడం కంటే వాటి సంఖ్యను ఆర్థిక నష్ట స్థాయి కంటే తక్కువగా ఉంచడం ముఖ్యం. వేప ఆధారిత కషాయాలు, మొక్కల ఆధారిత ద్రావణాలు, పసుపు/నీలం జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, జీవ నియంత్రణ పద్ధతులు వంటి వాటిని సమగ్రంగా ఉపయోగించాలి. సహజ వ్యవసాయంలో ఉపయోగించే ముఖ్యమైన తయారీలు బీజామృతం తయారీ అవసరమైన పదార్థాలు : దేశీ ఆవు పేడ - సుమారు 5 కిలోలు, ఆవు మూత్రం - సుమారు 5 లీటర్లు, సున్నం సుమారు 50 గ్రాములు, పొలంలోని సారవంతమైన మట్టి – ఒక పిడికెడు, నీరు - సుమారు 20 లీటర్లుతయారీ విధానం : ఆవు పేడను నీటిలో బాగా కలిపి, ఆవు మూత్రం, మట్టిని కలపాలి. సున్నాన్ని విడిగా నీటిలో కలిపి ఈ మిశ్రమంలో జోడించాలి. బాగా కలిపి కొంత సమయం ఉంచిన తరువాత విత్తన శుద్ధికి ఉపయోగించవచ్చు.ఉపయోగం: విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు. జీవామృతం తయారీ అవసరమైన పదార్థాలు : దేశీ ఆవు పేడ - 10 కిలోలు, ఆవు మూత్రం - 5-10 లీటర్లు, బెల్లం - 1-2 కిలోలు, 1-2 కిలోలు, పొలంలోని పప్పుధాన్య పిండి సారవంతమైన మట్టి - ఒక పిడికెడు, నీరు సుమారు 200 లీటర్లు -తయారీ విధానం: ముందుగా డ్రమ్‌లో నీటిని తీసుకుని అందులో ఆవు పేడను బాగా కలపాలి. తరువాత ఆవు మూత్రం, బెల్లం, పప్పుధాన్య పిండి, మట్టిని కలపాలి. ఈ మిశ్రమాన్ని కర్రతో రోజుకు కనీసం ఒకటి లేదా రెండుసార్లు కలుపుతూ సాధారణంగా 2-3 రోజులు నీడలో ఉంచాలి. తయారైన జీవామృతాన్ని నీటితో కలిపి నేలకు లేదా పంటకు అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.గమనిక: తయారీ నిష్పత్తులు, వినియోగ మోతాదులు పంట, నేల రకం, స్థానిక వ్యవసాయ సిఫారసుల ఆధారంగా సర్దుబాటు చేయాలి. సహజ వ్యవసాయంలో కషాయాల తయారీ వేప కషాయం కావలసిన పదార్థాలు : వేప ఆకులు - 5 కిలోలు, నీరు 10 లీటర్లు, ఆవు మూత్రం – 5 లీటర్లు,తయారీ విధానం: వేప ఆకులను బాగా శుభ్రం చేసి మెత్తగా నూరాలి. నూరిన ఆకులను 10 లీటర్ల నీటిలో కలపాలి. ఆవు మూత్రాన్ని కలిపి 24 గంటలు నానబెట్టాలి. అనంతరం మిశ్రమాన్ని మరిగించి చల్లార్చాలి. పలుచని వస్త్రంతో వడకట్టి నిల్వ చేసుకోవాలి. వినియోగం: పంటలో పురుగు ఉధృతి కనిపించినప్పుడు నీటితో తగిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. అగ్ని అస్త్రం కావలసిన పదార్థాలు : వేప ఆకులు పచ్చిమిరపకాయలు 1 కిలో, వెల్లుల్లి -గ్రాములు, ఆవు మూత్రం – 10 లీటర్లు, 5 కిలోలు, -33 500తయారీ విధానం : వేప ఆకులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరాలి. వీటిని ఆవు మూత్రంలో కలపాలి. మిశ్రమాన్ని మరిగించి చల్లార్చాలి. 24-48 గంటలు ఉంచి, తరువాత వడకట్టాలి. వడకట్టిన ద్రావణాన్ని అవసరమైనప్పుడు నీటితో పలుచగా చేసి పిచికారీ చేయాలి.ఉపయోగం: ఆకులు తినే పురుగులు, కాండం/కొమ్మలను దెబ్బతీసే కొన్ని పురుగుల నిర్వహణలో ఉపయోగిస్తారు. బ్రహ్మాస్త్రం కావలసిన పదార్థాలు : వేప ఆకులు 2 5, జిల్లేడు ఆకులు 2 కిలోలు, ఉమ్మెత్త ఆకులు 2 కిలోలు, బంతి/స్థానికంగా లభించే పురుగు నిరోధక మొక్కల ఆకులు – 2 కిలోలు, ఆవు మూత్రం – 10 లీటర్లు,తయారీ విధానం : అన్ని ఆకులను మెత్తగా నూరాలి. ఆవు మూత్రంలో కలిపి మరిగించాలి. చల్లారిన తరువాత 24 గంటలు ఉంచాలి. వస్త్రంతో వడకట్టి ద్రావణాన్ని నిల్వ చేసుకోవాలి. పంట పరిస్థితిని బట్టి నీటితో కలిపి పిచికారీ చేయాలి. దశపర్ణి కషాయం కావలసిన పదార్థాలు : వేప, కానుగ, జిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు, బొప్పాయి, జామ, సీతాఫలం వంటి పది రకాల ఆకులు – మొత్తం సుమారు 10 కిలోలు; ఆవు మూత్రం 10 లీటర్లు; నీరు అవసరమైనంత.తయారీ విధానం : అన్ని ఆకులను చిన్న ముక్కలుగా చేసి నూరాలి. ఆవు మూత్రంలో కలిపి పాత్రలో ఉంచాలి. మిశ్రమాన్ని మరిగించి చల్లార్చాలి. సాధారణంగా కొన్ని రోజులు కిణ్వన ప్రక్రియకు ఉంచాలి. తరువాత వడకట్టి, పంటకు అవసరమైన మోతాదులో నీటితో కలిపి పిచికారీ చేయాలి.ఉపయోగం: వివిధ రకాల పురుగుల సమగ్ర నిర్వహణలో మొక్కల ఆధారిత కషాయంగా ఉపయోగిస్తారు. ముఖ్యమైన జాగ్రత్తలు కషాయాలను వడకట్టిన తరువాతే స్ప్రేయర్లో ఉపయోగించాలి. ముందుగా చిన్న విస్తీర్ణంలో పిచికారీ చేసి పంటపై ప్రతిచర్యను పరిశీలించాలి. పంటకు, పురుగుకు అనుగుణంగా మోతాదును స్థానిక వ్యవసాయ నిపుణుల సిఫారసు మేరకు నిర్ణయించాలి. తీవ్రమైన పురుగు/ తెగులు సమస్యలో కేవలం కషాయాలపై ఆధారపడకుండా సమగ్ర పురుగు యాజమాన్యం పాటించాలి. సహజ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు సాగు ఖర్చు తగ్గుతుంది స్థానికంగా లభించే వనరులను ఉపయోగించడం వల్ల బాహ్య ఇన్పుట్లపై ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరగడం ద్వారా నేల భౌతిక, జీవ లక్షణాలు మెరుగుపడతాయి. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది మల్చింగ్, నేలలో తేమ సంరక్షణ వంటి పద్ధతులతో నీటి అవసరాన్ని తగ్గించవచ్చు. పర్యావరణ పరిరక్షణ రసాయన ఇన్పుట్లపై ఆధారపడటం తగ్గించడం ద్వారా నేల, నీరు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. రైతుకు అదనపు ఆదాయ అవకాశాలు – అంతర పంటలు, మిశ్రమ పంటలు, పంట వైవిధ్యం ద్వారా ఆదాయ వనరులను విస్తరించవచ్చు. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు సహజ వ్యవసాయాన్ని ఒకేసారి మొత్తం పొలంలో అమలు చేయడం కంటే చిన్న విస్తీర్ణంలో మొదట ప్రయోగాత్మకంగా చేపట్టి, ఫలితాలను పరిశీలించి క్రమంగా విస్తరించడం మంచిది. ప్రతి పంటకు ఒకే విధానం పనిచేయకపోవచ్చు. నేల రకం, వాతావరణం, నీటి లభ్యత, పంట రకం, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే, పంటలో పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే అన్ని రకాల రసాయనాలను ఉపయోగించకుండా ముందుగా పంట పరిశీలన, పురుగు గుర్తింపు, ఆర్థిక నష్టస్థాయి, సమగ్ర పురుగు యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముగింపు "నేలను కాపాడితే నేల మనల్ని కాపాడుతుంది" అనేది సహజ వ్యవసాయం సారాంశం. రైతు వద్ద లభించే వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, నేల జీవసారాన్ని పెంచి, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించి, నీటిని పొదుపుగా ఉపయోగించడం ద్వారా సహజ వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేయవచ్చు. సహజ వ్యవసాయం రైతుకు కేవలం సాగు పద్ధతి మాత్రమే కాదు - ఆరోగ్యకరమైన నేల, సురక్షితమైన ఆహారం, సమతుల్యమైన పర్యావరణం, స్థిరమైన రైతు ఆదాయం కోసం ఒక సమగ్ర దృక్పథం. ఆధారం: వ్యవసాయ పాడిపంటలు , డా.టి. భరత్, సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం