ప్రకృతి వ్యవసాయ విధానంలో కొబ్బరి సాగు సహజ సాగు పద్ధతులను ఆచరించి కొబ్బరిలో సుస్థిర దిగుబడులు పొందవచ్చును. ప్రకృతి వ్యవసాయ విధానంలో తోటలో లభ్యమయ్యే వ్యర్థ వనరులను (కొబ్బరి డొక్కలు, ఎండుటాకులు, డోలకలను) విరివిగా వినియోగించడం ద్వారా నేల సారాన్ని కాపాడడంతోపాటు నేలలో జీవవైవిధ్యాన్ని, సేంద్రియ కర్బనాన్ని, పోషకాలను, తోటలోని సూక్ష్మ వాతావరణాన్ని పెంపొందించుకోవడం ద్వారా సుస్థిరమైన దిగుబడులను పొంద వచ్చును.గుంత ను నింపే మట్టిలో పశువుల ఎరువు 25 కిలోలు, వర్మీకంపోస్ట్ 5 కిలోలు, వేపచెక్క 1 కిలో, జీవామృతం 2 లీటర్లు కలపాలి. నేల జీవ వైవిధ్యం పెంపునకు ఏడాది పొడవునా మొక్కల సాగు జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు కొబ్బరి తోటలో అంతర పంటలు, బహుళ పంటల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. లేత తోటలలో (అయిదేళ్ల లోపు) ఏక వార్షికాలైన పసుపు, అల్లం, కంద, చేమ, క్యాబేజి, కాలీఫ్లవర్, మిరప, వంగ, బెండ, అపరాలు మొదలైన పంటలు పండించుకోవచ్చు. పాత తోటలలో (20 ఏళ్లు పైబడిన) మిరియాలు, బొప్పాయి, అరటి, కోకో, అనాస, హెలికోనియా వంటి పూల మొక్కలు పండించుకోవచ్చు. PMDS (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్): రుతుపవనాలు ప్రారంభానికి ముందుగానే 20-30 రకాల పంటల విత్తనాలను కలిపి తోటలో వెదజల్లాలి. ఇందులో కంది, పెసర, మినుము, అలసంద, సజ్జ, సామ, కొర్ర, రాగి, నువ్వులు, ఆవాలు, వేరుశనగ, పాలకూర, తోటకూర, కూరగాయలు, పచ్చిరొట్ట విత్తనాలు ఉండేలా చూసుకోవాలి. రుతుపవనాలకు ముందు కురిసే వేసవి జల్లులు, మరియు ఇతర వనరుల నుంచి లభించే తేమను ఉపయోగించుకొని పెంచవచ్చు. అలా వేసిన విత్తనాలు మొలకెత్తి ఎదిగిన తరువాత, వాటి ఆకులతో భూమిని కప్పి ఉంచడం ద్వారా నేల సూర్యరశ్మికి గురికాకుండా కాపాడడంతో పాటు నేలకు సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. విత్తన గుళిక ఈ విత్తనాలను ముందుగా ప్రకృతి సాగు పద్ధతిలో శుద్ధి చేసుకుంటే, మొలక శాతం పెరుగుతుంది. తక్కువ నీటి వనరులను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకొని పెరగడం గమనించవచ్చు. విత్తన గుళికల తయారీ ఈ విధంగా చేసుకోవాలి, బంక మట్టి/పుట్టమట్టి, ఘనజీవామృతం, జల్లించిన మెత్తటి బూడిదను తీసుకొని, 5 లీటర్ల బీజామృతంతో కలిపి, అవసరాన్ని బట్టి మరికొంత నీరు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసికోవాలి. దీనితో 25-30 కిలోల విత్తన గుళికలు తయారు చేసికొని నీడలో ఆరబెట్టాలి. ఎండిన గుళికలను వర్షానికి ముందుగా లేదా తేలికపాటి తేమ ఉన్న నేలలో వెదజల్లితే, విత్తనాలు తీవ్ర సూర్యరశ్మి నుంచి తట్టుకొని, మంచి మొలక శాతం, మొక్కలు పెరుగుదల మెరుగుపడుతుంది. కొబ్బరి తోటలో సంవత్సరానికి రెండు సార్లు PMDS విత్తనాలు జల్లుకోవాలి. మార్చి-ఏప్రిల్ నెలలో (31 రకాలు), నవంబర్-డిసెంబర్ నెలల్లో (13-18 రకాలు) ఎకరానికి 20 కిలోల చొప్పున వేసి, 45-60 రోజులలో పూతదశలో నేలలో కలియదున్నాలి. పశువుల అనుసంధానం: కొబ్బరి తోటలో గొర్రెలు, ఆవులు, ఇతర పశువులను మేపడం వల్ల పశువులను కూడా అనుసంధానించవచ్చు. పశువుల సంచారం వల్ల నేల గట్టితనం తగ్గి సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుంది. అవులను పెంచితే ఆవు పేడ, మూత్రం సులభంగా లభిస్తాయి. తత్ఫలితంగా నేలకు సేంద్రియ పదార్థం జోడించండి కొబ్బరి చెట్లు ఆరోగ్యంగా పెరిగి, దీర్ఘకాలిక దిగుబడి, తోట స్థిరత్వం మెరుగుపడుతుంది. కొబ్బరి తోటల్లో తేనెటీగల పెంపకంతో ఫలదీకరణ మెరుగవుతుంది. గో-ఆధారిత జీవన ఎరువులు: ప్రకృతి వ్యవసాయంలో కొబ్బరి మొక్కలకు పోషకాలు సమర్థవంతంగా అందించడానికి, వ్యాధులను నివారించడానికి దేశీ ఆవు ఆధారిత బీజామృతం, ద్రవ జీవామృతం, ఘన జీవామృతంవంటి జీవన ఎరువులను వాడాలి. బీజామృతం బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వలన విత్తనాల మొలక శాతం పెరుగుతుంది. నేల, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్ళను అరికట్టవచ్చు. బీజామృతం తయారీకి కావలసిన పదార్థాలు ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీ, సున్నం 50గ్రా, పుట్ట మట్టి ఒక గుప్పెడు (100 గ్రా), నీరు 20 లీటర్లు.కొబ్బరి మొక్కలు నాటే ముందు కాయలను బీజామృతంలో మునిగే విధంగా అలాగే ఇతర పంటల (వరి, ఉల్లి, టమోటా వంటి) నారు వేర్లను 15 నిమిషాలపాటు బీజామృతంలో ఉంచి నాటుకోవాలి. తయారైన బీజామృతాన్ని 24 గంటలలోపు ఉపయోగించాలి, నిల్వ చేయకూడదు. ఘన జీవామృతం కావలసిన పదార్థాలు : ఆవుపేడ10 కిలోలు, ఆవుమూత్రం 2-5 లీ. బెల్లం 2 కిలోలు, పప్పుపిండి 2 కిలోలు, పుట్టమట్టి ఒక గుప్పెడు (100 గ్రా)ఉపయోగించే విధానం: ఒక సంవత్సరానికి రెండు సార్లు చెట్టుకు 10 కిలోల చొప్పున అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ద్రవ జీవామృతం ఇది నేల సారాన్ని పెంచడానికి, మరియు మొక్కలకు పోషకాలను అందించడానికి సహాయ పడుతుంది. కావలసిన పదార్థాలు : ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కిలోలు, పప్పు పిండి 2 కిలోలు, పుట్టమట్టి ఒక గుప్పెడు (100 గ్రా). నీరు 200 లీటర్లుతయారీ విధానం : ఒక డ్రమ్ములో 100 లీటర్ల నీరు తీసుకుని, ఆవు పేడ, బెల్లం, శనగపిండి, మట్టిని వేర్వేరుగా నీటిలో కరిగించి, ఆ ద్రావణాలను ఒకదాని తరువాత ఒకటి డ్రమ్ములో పోయాలి. చివరిగా ఆవు మూత్రాన్ని పోస్తూ, అన్నీ బాగా కలిసేలా కర్రతో సవ్య దిశలో 5-10 నిమిషాలు కలపాలి. గోనె పట్టాతో గాని, నూలు వస్త్రంతో గాని డ్రమ్మును కట్టి, నీడలో ఉంచాలి. 7-8 రోజుల పాటు, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కర్రతో సవ్య దిశలో తిప్పాలి. మాగిన పండు వాసన వస్తే ద్రవ జీవామృతం తయారైనట్లే.ఉపయోగించే విధానం: 3-4 సంవత్సరాలు, ఆపై వయస్సు గల తోటలకు 10 లీటర్ల ద్రవ జీవామృతాన్ని రింగ్ బేసిన్ లో అందించాలి. నేలలో తేమ ఉన్నప్పుడు అందించాలి. 1–3 సంవత్సరాల చిన్న తోటలకు 5 లీటర్ల ద్రవ జీవామృతం అందించాలి. ఆధారం: పాడిపంటలు మాసపత్రిక ఎ. కిరీటి, శాస్త్రవేత్త (ఉద్యానశాస్త్రం) ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట, కోనసీమ జిల్లా