నాణ్యమైన విత్తనం - దేశ ఆహార భద్రతకు భరోసా వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. రైతు కష్టపడి సాగు చేసిన పంట మంచి దిగుబడి ఇవ్వాలంటే అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. భూమి సారం, నీటి లభ్యత, ఎరువుల వినియోగం, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలతో పాటు అత్యంత కీలకమైనది విత్తన నాణ్యత. రైతు చేతిలోని చిన్న విత్తనం భవిష్యత్తులో పెద్ద దిగుబడిగా మారుతుంది. అందుకే "మంచి విత్తనం మంచి పంటకు పునాది". ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, కొత్త వ్యాధులు, పురుగుల సమస్యల నేపథ్యంలో నాణ్యమైన విత్తనాల ప్రాముఖ్యత మరింత పెరిగింది. సరైన విత్తనం ఎంపిక రైతు విజయాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశంగా మారింది. విత్తన నాణ్యత అంటే ఏమిటి? మంచి మొలక శాతం కలిగి, కల్తీలు లేకుండా, ఆరోగ్యకరంగా ఉండి, నిర్దిష్ట రకానికి చెందిన లక్షణాలు స్పష్టంగా కలిగి ఉన్న విత్తనాలను నాణ్యమైన విత్తనాలు అంటారు. సాధారణంగా విత్తన నాణ్యతను ఈ కింది అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు: అధిక మొలక శాతం జన్యు స్వచ్ఛత భౌతిక స్వచ్ఛత వ్యాధులు, పురుగుల రహిత స్థితి తగిన తేమ శాతం సమాన పరిమాణం నాణ్యమైన విత్తనం రైతుకు ఎందుకు అవసరం? సమానమైన మొలకలు : మంచి నాణ్యత కలిగిన విత్తనం వేగంగా, సమానంగా మొలకెత్తుతుంది. ఒకే సమయంలో మొలకలు రావడం వల్ల పొలంలో మొక్కల పెరుగుదల సమానంగా ఉంటుంది. దీనివల్ల ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, కలుపు నియంత్రణ సులభమవుతుంది. తక్కువ నాణ్యత గల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోవడంతో పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. ఫలితంగా దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అధిక దిగుబడి : విత్తనం నాణ్యంగా ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, మంచి నాణ్యత గల విత్తనం వాడటం ద్వారా దిగుబడిలో గణనీయమైన పెరుగుదల సాధ్యమవుతుంది. అదే నేల, అదే నీరు, అదే ఎరువులు ఉపయోగించినప్పటికీ నాణ్యమైన విత్తనం వాడిన రైతులు మెరుగైన దిగుబడిని పొందగలరు. అందువల్ల విత్తనం వ్యవసాయంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తారు. వ్యాధులు, పురుగులను తట్టుకునే శక్తి : చాలా సందర్భాల్లో పంట వ్యాధులు విత్తనాల ద్వారానే వ్యాపిస్తాయి. నాసిరకం విత్తనాలు ఉపయోగిస్తే వ్యాధుల ప్రబలింపు ఎక్కువగా ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు సాధారణంగా ఆరోగ్యంగా ఉండి కొన్ని ముఖ్యమైన వ్యాధులు, పురుగులను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్ల మందుల ఖర్చు తగ్గుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, పంట ఆరోగ్యంగా ఉంటుంది. రైతు ఖర్చుల నియంత్రణ : తక్కువ మొలకలు వచ్చినప్పుడు రైతు మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. ఇది అదనపు ఖర్చుతో పాటు సమయ నష్టాన్ని కూడా కలిగిస్తుంది. మంచి నాణ్యత గల విత్తనాలు ఉపయోగిస్తే పునఃవిత్తనం అవసరం తగ్గుతుంది. అలాగే ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది, నీటి వృధా తగ్గుతుంది, కార్మిక ఖర్చులు తగ్గుతాయి, దీనివల్ల సాగు వ్యయం తగ్గి రైతు ఆదాయం పెరుగుతుంది. వాతావరణ మార్పుల కాలంలో విత్తన నాణ్యత ప్రాధాన్యం : ప్రస్తుతం రైతులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వర్షపాతం అస్థిరత, అధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, కొత్త తెగుళ్లు వంటి సమస్యలు వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటిని తట్టుకునే, అధిక ఉష్ణోగ్రతలకు అనుకూలమైన, వ్యాధి నిరోధకత కలిగిన, స్థిరమైన దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాల అవసరం మరింత పెరిగింది. భవిష్యత్ వ్యవసాయం విత్తన నాణ్యతపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు : ధృవీకరించిన విత్తనాల ఎంపిక : ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలు లేదా గుర్తింపు పొందిన సంస్థల నుంచి ధృవీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తనపు సంచిపై వివరాల పరిశీలన : విత్తనపు సంచిపై ఈ వివరాలను తప్పనిసరిగా చూడాలి - రకం పేరు, మొలక శాతం, గడువు తేదీ, స్వచ్ఛత శాతం, ఉత్పత్తి సంస్థ పేరు. స్థానిక పరిస్థితులకు అనుకూల రకాల ఎంపిక : తమ ప్రాంత వాతావరణం, నేల పరిస్థితులకు అనుకూలమైన రకాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన నిల్వలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మంచి విత్తనం కొనుగోలు చేయడం ఎంత ముఖ్యమో, దానిని సరైన విధంగా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. తేమ లేని ప్రదేశాల్లో నిల్వ చేయాలి, పురుగులు చేరకుండా జాగ్రత్త పడాలి, నేరుగా నేలపై సంచులు పెట్టకూడదు, గాలి సరిగా వెళ్లే గదుల్లో నిల్వ చేయాలి, తప్పు నిల్వ పద్ధతుల వల్ల మొలక శాతం తగ్గిపోతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తల పాత్ర : వ్యవసాయ పరిశోధనా సంస్థలు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త రకాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. అధిక దిగుబడి, వాతావరణ అనుకూలత, వ్యాధి నిరోధకత వంటి లక్షణాలతో నూతన రకాలను రూపొందించడం ద్వారా రైతులకు సహాయపడుతున్నారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలు రైతు పొలాలకు చేరడం ద్వారా వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుంది. నాణ్యమైన విత్తనం - ఆహార భద్రతకు ఆధారం : పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తి చేయాలంటే నాణ్యమైన విత్తనాల వినియోగం తప్పనిసరి. తక్కువ భూమిలో అధిక దిగుబడి సాధించడానికి విత్తన నాణ్యత కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయాభివృద్ధి, రైతు ఆదాయం, దేశ ఆహార భద్రత - ఈ మూడు అంశాలకు నాణ్యమైన విత్తనం ప్రధాన ఆధారం. వ్యవసాయంలో రైతు విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలలో విత్తనం ఒకటి. నాణ్యమైన విత్తనం రైతుకు అధిక దిగుబడి మాత్రమే కాదు, స్థిరమైన ఆదాయం, భరోసాను కూడా అందిస్తుంది. మంచి విత్తనం ఎంపిక ద్వారా రైతులు తమ శ్రమకు తగిన ఫలితం పొందగలరు. ప్రస్తుతం వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలంటే నాణ్యమైన విత్తనాల వినియోగం అత్యంత అవసరం. రైతులు శాస్త్రీయ అవగాహనతో ధృవీకరించిన విత్తనాలను ఉపయోగించి సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయం మరింత లాభదాయకంగా మారుతుంది. ఆధారం :జి.నీలిమ, ఎ.సరిత, డి.శ్వేత, ఎ.రమాదేవి, సి.హెచ్. పల్లవి, జె.సంతోష్ కుమార్. వ్యవసాయ పరిశోధనా స్థానం, తోర్నాల, సిద్దిపేట మరిన్ని వివరాలకు :తెలంగాణ వ్యవసాయ శాఖ వ్యవసాయ పాడి పంటలు మాస పత్రిక