నాణ్యమైన నారు - లాభదాయక సాగు

రైతన్నా.. మిరప, టమాటా పంటల్లో మంచి దిగుబడి సాధించాలంటే, అన్నింటికంటే ముందుగా ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడం చాలా అవసరం. "నారు పంటకు ఆధారం" అన్న సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. బలమైన వేళ్లతో, పచ్చని ఆకులతో మెరిసే నారు మొక్కలు వేగంగా పెరిగి, రోగాలను తట్టుకుని, అధిక దిగుబడి అందిస్తాయి.

నారు మడిలో నారు పెంచే పద్ధతి: నారు మడి పద్ధతి మన పూర్వీకులు పాటించే సాంప్రదాయ మార్గం. ఈ పద్ధతిలో నేలపైనే నారుమళ్లను తయారు చేసుకుని, అందులో విత్తనాలు వేసి నారు పెంచుతారు. సరిగ్గా చేస్తే ఈ పద్ధతి చాలా తక్కువ ఖర్చుతో మంచి నారు అందిస్తుంది.

నారుమడికి సరైన స్థలం ఎలా ఎంచుకోవాలి ?

స్థలం మెరకగా (ఎత్తుగా) ఉండాలి. వర్షానికి నీరు నిలిచిపోకూడదు.పొలంలో తూర్పు లేదా ఉత్తరం వైపు ఎంచుకుంటే పొద్దున వెలుతురు బాగా పడుతుంది.గాలి, వెలుతురు అన్ని వైపుల నుండి సమంగా తగలాలి అప్పుడు నారు బలంగా పెరుగుతుంది.నీటి వసతికి దగ్గరగా ఉండాలి. రోజూ తడపడానికి వీలుగా ఉంటుంది.నీటి పారుదల వసతి ఉండాలి. నీరు నిలిచిపోకుండా బయటకు పోవాలి.తేలిక నేలలు (ఇసుక నేలలు) అనుకూలం నారు వేళ్ళు సులభంగా పెరుగుతాయి.

నారుమళ్లు తయారు చేసుకోవడం ఎలా?

స్థలం ఎంచుకున్న తర్వాత సరిగ్గా నారుమళ్లు తయారు చేయడం ముఖ్యం.పొలాన్ని ట్రాక్టరుతో లేదా గురప నాగలితో 2-3 సార్లు లోతుగా దున్నాలి.వ్యర్థాలు తీసి పొలాన్ని మెత్తగా, చదునుగా చేయాలి.ఎత్తు నారుమళ్లు తయారు చేయాలి. తగినంత పొడవు × 1 మీటరు వెడల్పు × 15 సెం.మీ. ఎత్తు.రెండు మళ్ల మధ్య 40-45సెం.మీ. దారి వదలాలి నీళ్లు పెట్టడానికి, కలుపు తీయడానికి వీలుగా ఉంటుంది.ఒక సెంటు (40 చ.మీ.) నారుమడిలో పెరిగే నారు ఒక ఎకరం పొలంలో నాటడానికి సరిపోతుంది.

నారుమడికి ఎరువులు వేసే విధానం

నారుమడి దశలో పోషకాలు సక్రమంగా అందితేనే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది.సెంటు నారుమడికి 40-50 కిలోల బాగా కుళ్లిన పశువుల ఎరువు వేయాలి.ఆ ఎరువులో ట్రైకోడెర్మా విరిడి శీలీంద్రాల్ని కలపాలి. ఇది నారుకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లను అరికడుతుంది.వేపపిండి కూడా 2-3 కిలోలు కలపాలి భూమిలో పురుగులు రాకుండా చేస్తుంది.సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రోనిల్ గుళికలు నేలలో చల్లాలి. తెల్ల పురుగు, చీమలను నివారిస్తుంది.

విత్తనం వేసే పద్ధతి

విత్తనం వేయడంలో పొరపాటు పడకండి. ఈ దశే పంటకు బీజం.విత్తనశుద్ధి చేయడం తప్పనిసరి. ట్రైకోడెర్మా విరిడి 4 గ్రా. లేదా థైరామ్ 2 గ్రా. కిలో విత్తనానికి కలిపి పట్టించాలి.విత్తనాలను పలుచగా వేయాలి.విత్తనం వేసిన తర్వాత వర్మి కంపోస్టు పలుచగా చల్లి, రోలరు లేదా కర్రతో చదును చేయాలి.

నారుమడికి నీరు పెట్టే పద్ధతి

రోజ్ క్యాన్‌తో రోజూ ఉదయం నీరు పెట్టాలి. నేల ఎప్పుడూ తేమగా ఉండాలి. కానీ నీరు నిలిచిపోకూడదు.అధిక నీరు నిల్వ ఉంటే నారుకుళ్ళు తెగులు వస్తుంది.నీరు పెట్టే ముందు నారుమళ్లను చూసి కలుపు మొక్కలను తీయాలి.

పోషక యాజమాన్యం

నారు చక్కగా పెరగాలంటే సరైన పోషకాలు అందించాలి.ప్రతి 15 రోజులకు ఒకసారి నీటిలో కరిగే ఎరువులు పిచికారీ చేయాలి.19-19-19 లేదా 13-0-45, 3 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.సాయంత్రం పిచికారీ చేస్తే ఎరువు మొక్కకు బాగా అందుతుంది.మరీ ఎక్కువ నత్రజని ఎరువులు (యూరియా) వేయకూడదు నారు ఏపుగా, మెత్తగా మారి పురుగులను ఆహ్వానిస్తుంది.

పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం

తామర పురుగులు : ఫిప్రోనిల్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ : థయామిథాక్సామ్ 0.4 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేస్తుంది ఇది చాలా ప్రమాదకరం.

నారుకుళ్ళు తెగులు (డ్యాంపింగ్ ఆఫ్): వర్షాకాలంలో మేఘావృత వాతావరణంలో ఈ తెగులు వేగంగా వ్యాప్తిస్తుంది. ముందు జాగ్రత్తగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 9వ రోజు, 15వ రోజు కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణంతో నారుమడి తడపాలి. బాక్టీరియా ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంటే అదే మందు వాడవచ్చు.

నారు పీకడం, నాటే ముందు చేయవలసిన పనులు

ఆరు వారాల వయసు నారు నాటడానికి అత్యంత అనుకూలం. ఈ దశలో నారు బలంగా, దృఢంగా ఉంటుంది.నారు పీకే ముందు నారుమడిని బాగా తడపాలి. వేళ్ళు తెగకుండా చూసుకోవాలి.ముదురు నారు నాటవలసి వస్తే నాటే ఒక వారం ముందు నారు తలలు త్రుంచాలి. తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయాలి.పీకిన నారును ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10-15 నిమిషాలు వేళ్ళు మునిగేలా వుంచాలి.ఈ చర్య వల్ల ప్రధాన పొలంలో రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గిపోతుంది.

ఆధారం : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ