సుస్థిర వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల వినియోగం ప్రస్తుత వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక, ఇతర మందులు విరివిగా వాడటం వలన భూసారం దెబ్బతినటం, వాతావరణ కాలుష్యం, పంటల దిగుబడులు తగ్గడం, సారవంతమైన భూములు సమస్యాత్మక భూములుగా మారడం వంటి పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఇలాంటి సమయంలో భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థాలను పెంపొందించి భూసారం కాపాడుతూ పంటల ఉత్పాదకత పెంపొందించడానికి పచ్చిరొట్ట పంటలు ఉపయోగపడతాయి.పప్పు జాతికి చెందిన క్షేత్ర స్థాయి పంటలను పెంచి 50 % పూత (45-60 రోజుల వయస్సు) దశలో భూమిలో కలియదున్నితే వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటారు. ఉదా: జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, పెసర, అలసంద. అలాగే పొలం గట్లపైన లేక రోడ్లకు ఇరువైపులా పెరిగే కొన్ని రకాల పప్పు జాతి లేదా ఇతర చెట్ల ఆకులు లేక కొమ్మలను కోసి పంటలు వేయవలసిన పొలంలో వేసి కలియదున్నితే వాటిని హరిత ఆకు ఎరువులు అంటారు ఉదా: వేప, తంగేడు, కానుగ, గ్లైరిసిడియా, జిల్లేడు. సాధారణంగా అందుబాటులో ఉండే, వాడదగిన పచ్చిరొట్ట పంటలు జీలుగ : క్షార గుణం గల భూములు అనగా చౌడు భూముల్లో, వరి పండించే భూముల్లో వేస్తారు. ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. దీనిని 50% పూత దశలో కలియ దున్నడం వలన ఎకరానికి 6 నుండి 8 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. ఈ మొక్కల్లో 3.5% నత్రజని, 0.6% భాస్వరం, 1.2% పొటాష్ ఉంటాయి. జనుము : అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా, పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుండి 14 కిలోల విత్తనం చల్లుకోవాలి. ఈ పైరు ఎకరానికి 5.2 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట నిస్తుంది. 2.3% నత్రజని, 0.5% భాస్వరం, 1.8% పొటాష్ ఇందులో ఉంటాయి. పెసర : ఈ పైరును తేలిక, బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. దీనిని అపరాల పంటగా, పచ్చిరొట్ట ఎరువుగా, పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. చౌడు భూముల్లో సాగుకు పనికి రాదు. ఎకరానికి 12 కిలోల విత్తనం అవసరం. ఈ మొక్కల్లో 0.72% నత్రజని, 0.18% భాస్వరం, 0.53% పొటాష్ ఉంటాయి. సాధారణంగా అందుబాటులో ఉండే, వాడదగిన హరిత ఆకు ఎరువుల వివరాలు వేప : వేప లేత కొమ్మలను, ఆకులను తీసుకొచ్చి పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. లభ్యం కాని పోషకాలు లభ్య రూపంలోకిరావడమే కాకుండా చీడపీడల ఉధృతి తగ్గిస్తుంది. 2.83% నత్రజని, 0.28% భాస్వరం, 0.35% పొటాష్ ఇందులో ఉంటాయి. గ్లైరిసిడియా : పొడవైన కొమ్మలు గట్ల మీద, బావుల దగ్గర నాటాలి లేదాకొమ్మలను, ఆకులను బయట నుండి తీసుకొచ్చి పొలంలో కలియదున్ని మురగనివ్వాలి. ఒక్కొక్క చెట్టు ఏడాదికి 100 - 125 కిలోల పచ్చిరొట్ట నిస్తుంది. 2.76% నత్రజని, 0.28% భాస్వరం, 4.60% పొటాష్ ఇందులో ఉంటాయి. అదే విధంగా కానుగ, జిల్లేడు, నేల తంగేడు మొదలైన వాటిని పచ్చి ఆకు ఎరువులుగా వాడవచ్చు. పచ్చిరొట్ట పైర్ల సాగులో మెలకువలు తేమ చాలని ప్రాంతాలలో వేసవిలో దుక్కి దున్ని తొలికరి వర్షాలు పడగానే వెదజల్లాలి. నీటి వసతిగల ప్రాంతాలలో, వరి సాగు చేసే ప్రధాన పొలంలో పచ్చిరొట్ట ఎరువులను వేయడం లాభదాయకం. పసుపు, కంది, చెరకు వంటి దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటలలో పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పైర్లను వేసి 50-60 రోజుల వయస్సులో నేలలో కలియదున్నాలి. సాధారణంగా పచ్చిరొట్ట పైర్లు చల్లుకునేటప్పుడు అధిక మోతాదు విత్తనం ఉపయోగించిన మొక్కలు తక్కువ ఎత్తు పెరిగి రసవంతంగా ఉంటాయి. లేకపోతే జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువుల మొక్క ఎత్తు పెరిగి కాండంలో పీచు ఏర్పడి కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పచ్చిరొట్ట పైర్ల వాడకం వల్ల ప్రయోజనాలు వీటిలో సేంద్రియ పదార్థముంటుంది కావున సూక్ష్మజీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారి, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పప్పు జాతికి హరిత పంటల వలన రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని వేళ్ళ బొడిపెలతో ఎకరానికి 25-50 నత్రజనిని స్థిరీకరిస్తుంది. తద్వారా ఎకరానికి 10-15 కిలోల నత్రజని ఆదా అవుతుంది. నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. సూక్ష్మపోషకాల లోపాలు రాకుండా ఉంటాయి. సమస్యత్మాక నేలు అయినటువంటి తెల్లచౌడు, నల్లచౌడు నేలలను పునరుద్ధరిస్తాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. ఈ జాతి పైర్లకు వేళ్ళు లోతుగా ఉండి భూమిలో అడుగున తయారయ్యే గట్టి పొరలను చీలుస్తాయి తద్వారా భూమిలో నీరు ఇంకే గుణం పెరుగుతుంది. భూమిలో నులిపురుగుల ఉధృతిని తగ్గిస్తుంది. జనుము, పిల్లిపెసర పైర్లు ఎరువుగానే కాకుండా పశువులకు మేతగా కూడా ఉపయోగపడతాయి. ఆధారం : తెలంగాణ వ్యవసాయ శాఖ