స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR (Special Intensive Revision) SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించి, తాజాకరించే ప్రత్యేక ప్రక్రియ. దీని ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను పరిశుభ్రంగా, ఖచ్చితంగా ఉంచడం. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా మరణించిన వారి పేర్లు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి శాశ్వతంగా మారిన వారి వివరాలు, ఇతర లోపాలను గుర్తించి సరిదిద్దడం జరుగుతుంది. ఇలాంటి ప్రత్యేక సవరణలు గతంలో కూడా నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో 16కు పైగా రాష్ట్రాల్లో దశలవారీగా అమలు చేస్తున్నారు. SIR ఎందుకు నిర్వహిస్తున్నారు? భారత ఎన్నికల సంఘం ప్రకారం SIR ప్రధాన లక్ష్యాలు: ఓటర్ల జాబితాను ఖచ్చితంగా, తాజాగా ఉంచడం. మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారిన వారి పేర్లను తొలగించడం. ఒకే వ్యక్తి పేర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉంటే వాటిని గుర్తించి సరిచేయడం. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో ఉండేలా చూడడం. ఫారం నింపకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు, ఒక కుటుంబం SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించకపోతే లేదా సంబంధిత చిరునామాలో నివసించడం లేదని నిర్ధారణ అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అయితే, అర్హులైన వారు సంబంధిత ఫారాల ద్వారా మళ్లీ నమోదు లేదా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణలో SIR ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి గారు తెలిపిన వివరాల ప్రకారం: జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. ఫారం అందనివారికి లేదా మిస్ అయిన వారికి నిర్ణీత ప్రక్రియ ద్వారా మరో అవకాశం కల్పిస్తారు. జులై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఓటర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రస్తుతం ఓటరు జాబితాలో నమోదైన చిరునామాకే ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేకపోతే, నిబంధనల ప్రకారం ఆ పేరు తొలగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా సంబంధిత ఫారాల ద్వారా ఓటరు నమోదు లేదా సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్: విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్న ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఫామ్ నింపొచ్చు. ఓటర్ జాబితాలోని పేరు, ఆధార్ కార్డులోని పేరు సరిపోలిన, సంబందిత ఫోన్ నంబర్ (మ్యాచ్ అయిన) ఓటర్లకు మాత్రమే ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫామ్ పూరించే అవకాశం ఉన్నది. అలా లేనివారు బీఎల్వో సాయంతో ఫిజికల్‌గా పూరించాలి. ఆన్ లైన్ ఎన్యుమరేషన్ ఫామ్ కోసం ఇక్కడ చూడండి. https://voters.eci.gov.in ముఖ్య గమనిక: భారత ఎన్నికల సంఘం ప్రకారం, SIR ప్రధాన ఉద్దేశం అర్హులైన ఓటర్లను తొలగించడం కాదు; ఓటర్ల జాబితాను పరిశుభ్రంగా, ఖచ్చితంగా మరియు తాజాగా ఉంచడం. ఆధారం: భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసిన ప్రెస్ నోట్ ఇసిఐ_ప్రెస్‌నోట్స్.పిడిఎఫ్ మూలం :సీఈఓ తెలంగాణ SIR_2026