విద్య , ఆట, పాటలు ముద్దు .. డ్రగ్స్ వద్దు.. మొదట సరదాగా ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుందిలే అనుకుని మొదలుపెడతారు. కానీ మత్తు పదార్థం లక్షణమే అది కాబట్టి మళ్లీ మళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. దాంతో తీసుకునే సందర్భాలు పెరుగుతాయి. కొన్నాళ్లకి ఆమోతాదు అలవాటైపోయి, తృప్తి కలగక ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అప్పటికి అది వ్యసనం స్థాయికి వెళ్లిపోతుంది. జన్యుపరమైన కారణాలు కూడా ఈ వ్యసనానికి దారితీస్తాయి. డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) లాంటి మానసిక సమస్యలు ఉన్నవారిలోనూ వ్యసనాల రిస్క్ ఎక్కువ. పిల్లల్లో డ్రగ్స్ వ్యసనం ఇలా గుర్తించవచ్చు డ్రగ్ తీసుకున్నాక వేరే ఏ ఆలోచనా రాదు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. ఒకలాంటి మత్తులో ఉండిపోతారు. తిండి సరిగా తినరు, తింటే వాంతులవుతాయి. బరువు తగ్గిపోతారు. తమ మీద శ్రద్ధ ఉండదు. శుభ్రంగా తయారవ్వరు. అన్నిటిలోనూ విపరీతమైన నిర్లక్ష్యం కన్పిస్తూ ఉంటుంది. అతిగా నిద్రపోతారు. కళ్లు ఎర్రబడతాయి. కొన్ని రకాల డ్రగ్స్ కి నోరు పొడిబారుతుంది. చీటికీ మాటికీ చిరాకు పడుతుంటారు. ఎవరితోనూ మాట్లాడరు. తమ గదిలోకి ఎవరినీ రానివ్వరు.. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. స్కూలుకి, కాలేజీకి వెళ్లరు. బాధ్యతారహితంగా కనిపిస్తారు. మాటకీ చేతకీ మధ్య సమన్వయం ఉండదు. దేనికీ త్వరగా స్పందించరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. కొన్నిటివల్ల అతి చురుకుదనం, దుందుడుకుతనం వస్తాయి. కళ్లు విప్పార్చి చూస్తుంటారు. నిద్ర పోరు. ఎక్కువగా మాట్లాడతారు. వీటిల్లో ఏ కొన్ని లక్షణాలు కన్పించినా వైద్యుల్ని సంప్రదించాలి. పెద్దలకు కౌన్సెలింగ్ డ్రగ్ ఎడిక్షన్ అనేది ఒక జబ్బు. డ్రగ్స్ కి అలవాటుపడినవారిని రోగిలా చూడాలి కానీ నేరస్తుల్లా కాదు. ఆ జబ్బు నయమవ్వాలంటే కుటుంబసభ్యుల తోడ్పాటుతో పాటు చికిత్స తప్పనిసరి. అందుకే వైద్యులు ముందు కుటుంబ సభ్యులందరికీ కౌన్సెలింగ్ ఇస్తారు. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెబుతారు. ప్రభావం – ప్రమాదం డ్రగ్స్ ప్రభావం నేరుగా మెదడు మీద పడుతుంది. చిన్నవయసులో డ్రగ్స్ తీసుకుంటే ఆ ప్రభావం ఎదిగే మెదడు మీద తీవ్రంగా ఉంటుంది. కొకైన్ లాంటివీ, పొగరూపంలోనూ ఇంజెక్షన్ రూపంలోనూ తీసుకునేవీ వేగంగా వ్యసనానికి దారితీస్తాయి.మతి చలించినట్లు, బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లు ప్రవర్తించడానికి దారితీస్తాయి. ఫిట్స్ వస్తాయి. అధిక మోతాదులో తీసుకుంటే మరణం కూడా సంభవించవచ్చు. జీహెచ్‌బీ లాంటి రిక్రియేషనల్ డ్రగ్స్ వల్ల జ్ఞాపకశక్తి పోతుంది. ఆల్కహాల్‌తో పాటు తీసుకుంటే ఫిట్స్ ఎక్కువై కోమాలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. హెరాయిన్ కి అలవాటుపడితే గుండె, ఊపిరితిత్తులూ.. దెబ్బతింటాయి. మరికొన్నిటి వల్ల మూత్రపిండాలూ కాలేయమూ చెడిపోతాయి. ఇంజెక్షన్ల వల్ల హెచ్ఐవీ లాంటి అంటు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. మత్తు ప్రభావంలో ప్రమాదాలకు గురవుతారు. ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. మత్తు వ్యసనంతో నేరాలకు పాల్పడతారు. పిల్లల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వ్యసనాన్ని నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని మాట్లాడే వాతావరణం ఉండాలి. పిల్లలకు అవగాహన కల్పించి, వారితో స్నేహంగా ఉండాలి. పిల్లలు మీతో సులువుగా మాట్లాడగలిగేలా తల్లిదండ్రులు అనునయంగా ప్రవర్తించాలి డ్రగ్స్ ముప్పు గురించి, పర్యవసానాల గురించి నీతి కథలు, వాస్తవ సంఘటనలను వారికి అర్థమయ్యేలా చెప్పండి. తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు క్రమం తప్పకుండా ఆసక్తిగా ఉండేలా చూసుకోవాలి పిల్లల రోజువారీ కార్యకలాపాలపై నిఘా ఉంచండి. దినచర్యలో ఏదైనా మార్పు గమనిస్తే, పరిశీలిస్తూ ఉండండి రోజువారీ పనులు, అకడమిక్, అదనపు పాఠ్య కార్యకలాపాలు, ఆహారం, ఆటలు, నిద్ర సమయాల కోసం షెడ్యూల్ అలవాటు చేయండి పిల్లలను పర్యవేక్షించడం ముఖ్యం ఆరోగ్యకరమైన కార్యకలాపాలు, అభిరుచులను ప్రోత్సహించండి.. చిన్న చిన్న పనులు చేయించి అభినందించండి. చిరుబహుమతులు ఇవ్వండి పిల్లలను ఆటపాటల్లో క్రియాశీలకంగా పాల్గొనేలా ప్రోత్సహించండి ప్రవర్తనలో మార్పులను ముందుగానే గుర్తించండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. తల్లిదండ్రుల పోట్లాటలు, నిత్యం ఇంట్లో గొడవలు ఉంటే పిల్లలు మత్తుపదార్థాల వైపు వెళ్లే ప్రమాదం ఎక్కువ. తల్లిదండ్రులు సమయానుకూలంగా తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయడం, ఇంట్లో మద్యపానానికి దూరంగా ఉండటం, రోజువారీ కుటుంబంతో గడపడం ఆరోగ్యకరమైన ప్రవర్తన వల్ల పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. ఒకవేళ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తిస్తే. పిల్లలను తిట్టకుండా, కొట్టకుండా ఉండటం మంచిది. మంచిగా మాట్లాడుతూ మానసిక వైద్యుని నుండి కౌన్సిలింగ్ సలహాలు తీసుకోవాలి మీ పిల్లల్ని బాల్యంలోనే చిదిమేస్తున్న డ్రగ్స్ కి నో చెప్పండి SAY NO TO DRUGS ఆధారం: మన బడి మాస పత్రిక