సంతాల్ తిరుగుబాటు యోధుడు తిల్కా మాఝీ 1857 తిరుగుబాటు కన్నా 80 సంవత్సరాల ముందుగానే సంతాల్ గిరిజన నాయకడు తిల్కా మాఝీ కేవలం విల్లులు, బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆయన గిరిజన ప్రజలను ఒక సైన్యంగా సంఘటితపరిచి 1784లో ప్రఖ్యాతమైన సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. తన తెగ ప్రజలతో కలిసి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఖజానాపై దాడి చేశాడు. అందుకు ఆయనను ఉరి తీశారు ఆయన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటంలో అసాధారణ సాహసం ప్రదర్శించడమే కాదు... స్వాతంత్య్రం కోసం పోరాడేలా జాతి యావత్తుకు స్పూర్తిని అందించాడు. జననం: ఫిబ్రవరి 11, 1750 మరణం : జనవరి 13, 1785 భారతదేశ గతం, వర్తమానం, భవిష్యత్తు మూడూ గిరిజన తెగలు లేకుండా సంపూర్ణం కావు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రతీ అడుగు, దేశ చరిత్రలో ప్రతీ పుట గిరిజనుల సాహస గాథలతో నిండి ఉన్నాయి. అలాంటి అసమాన యోధుల్లో ఒకరు తిల్కా మాఝీ . బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడాడు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఢంకా మోగించాడు. బ్రిటిషర్లపై తిరుగుబాటు అనే స్వరమే వినిపించని రోజుల్లో ఆయన ఇదంతా చేశాడు. 1857 తిరుగుబాటు కన్నా చాలా ముందుగానే అంటే 1784లో ఆయన నాయకత్వంలోనే "దామిన్ సత్యాగ్రహం" జరిగింది. బ్రిటీషర్లు వీలైన అన్ని మార్గాల్లోనూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ భరతమాతను సంకెళ్లలో చెరబడుతున్న రోజుల్లోనే ఈ తరహా తిరుగుబాటు చోటు చేసుకోవడం విశేషం. 1750 ఫిబ్రవరి 11వ తేదీన బీహార్లోని భాగల్పూర్ జిల్లాకు చెందిన సుల్తాన్గంజ్లో సంతాల్ కుటుంబంలో జన్మించిన తిల్కా మాఝీ బ్రిటిష్ పాలకులకు అనేక ఇబ్బందులు కల్పించడమే కాదు.. వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. మాఝీ అసలు పేరు జబ్రా సహాడియా, బ్రిటిషర్లే ఆయనకు "తిల్కా" అని నామకరణం చేశారని చెబుతూ ఉంటారు. ఒక సందర్భంలో బ్రిటిష్ అధికారి ఒకరు ఎర్రగా. అత్యంత రౌద్రంగా ఉన్న మాఝీ కళ్లు చూశాడట. పహాడియా భాషలో "తిల్కా" అంటే ఎర్రని కళ్లతో, కోపంగా కనిపించే వ్యక్తి అని అర్థం. ఆ రకంగా అభియోగపత్రాల్లో ఇదే ఆయన గుర్తింపుగా మారింది. తదుపరి దశలో "తిల్కా" పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. బ్రిటిషర్ల పాలనకు వ్యతిరేకంగా తిరుగులేని సుదీర్ఘ పోరాటం సాగించిన తిల్కా మాఝీ ఎన్నడూ వారికి లొంగిపోలేదు. ఎన్నడూ వారికి తల వంచడం గాని, భయపడడం గాని చేయలేదు. ఆయన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు పిలుపు ఇవ్వడమే కాదు వడ్డీ వ్యాపారులు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహించారు. 1778లో పహాడియాలతో కలిసి ఆయన రామ్ఢ్ శిబిరాన్ని బ్రిటిషర్ల చెర నుంచి విముక్తం చేశారు. 1784లో రాజ్మహల్ మెజిస్ట్రేట్ క్లెన్లాండ్ను హత్య చేశారు. అప్పటి నుంచి బ్రిటిషర్లు ఆయన కోసం నిరంతరాయంగా వేటాడి చిట్టచివరికి అరెస్టు చేయగలిగారు. అరెస్టు అనంతరం ఒక గుర్రానికి కట్టి ఆయనను భాగల్పూర్ వరకు ఈడ్చుకు వెళ్లారు. 1785 జనవరి 13వ తేదీన భాగల్పూర్ నగరంలోని ఒక పెద్ద కూడలిలో మర్రిచెట్టుకి వేలాడదీసి ఉరి వేశారు. ఈ కారణంగానే తిల్కా మాఝీ ని కూడా స్వాతంత్య్ర యోధుడుగా గుర్తించారు. ఆయనకు గుర్తుగానే భాగల్పూర్ విశ్వవిద్యాలయానికి తిల్కా మాఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత్రి మహాశ్వేతా దేవి ఆయన జీవితం, తిరుగుబాటు ఆధారంగా "షల్దిరెర్ డకే" పేరిట ఒక నవల రాశారు. ఆ తర్వాత దాని హిందీ అనువాదం "షల్లిరా కీ పుకార్ పర్" పేరిట ప్రచురితమయింది. భారతదేశానికి ఎందరో గిరిజన యోధుల వారసత్వం ఉన్నది. ఈ భారత భూభాగం నుంచే తిల్కా మాఝీ వంటి వారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటానికి ఎలుగెత్తి పిలుపు ఇచ్చారు. ఆధారం: న్యూ ఇండియా సమాచార్