ఉడుత సాయం (కథ) అనగనగా ఓ గుట్ట. దానిపక్కనే మరో గుట్ట. భగ్గుమనే ఎండలకు పక్కనున్న గుట్టలో అగ్గి మంటలు చెలరేగాయి. గుట్టలోని ఓ పిచ్చుక 'అయ్యో... గుట్ట అంతా మాడి మసి అయ్యేట్లుగా ఉందే... అక్కడున్న చెట్టూ చేమా, పక్షులు, జంతువులు ఏమై పోతాయో' అని బాధపడింది. 'నావంతు సహాయంగా ఏదో ఒకటి చేయాలి, మంటల్ని ఆపాలి' అనుకుంది. అనుకున్నదే తడవుగా పక్కనున్న నీటి కొలను దగ్గరికి వెళ్ళింది. నోటిలోకి నీళ్ళు లాక్కుంది. ఆకాశంలోకి ఎగిరింది. మంటలున్న చోటికి వెళ్ళి నీళ్ళు పోస్తూ ఉంది. పక్కనున్న పక్షులు "నీకు పిచ్చి పట్టింది. అందుకే ఇలాంటి పని చేస్తున్నావు. నీ నోరు చాలా చిన్నదని తెలుసుకో. దానిలో పట్టేది గుక్కెడు నీళ్ళు మాత్రమే. అలా కొంచెం కొంచెం నీళ్ళు పోస్తే ఆ మంటలు ఎప్పటికి ఆరేది" అని నవ్వాయి. వెంటనే పిచ్చుక "మీరు రామాయణం కథ వినలేదా? లంకలో ఉన్న సీతకోసం రాముడు సముద్రంపైన వారధి కట్టేటప్పుడు ఉడుత చేసిన సాయం ఇప్పటికీ అందరూ కథలుకథలుగా చెప్పుకుంటారు కదా. అలాగే నేను చేసేది కూడా"అని బదులిచ్చింది. 'రామాయణం కథ తెలిసినదానివి, 'ఉడుతకేల ఊర్లో పెత్తనం', 'ఉడుత ఊపులకు చింతకాయలు రాలవు' అనే సామెతలు వినలేదా?" అని మిగిలిన పక్షులు ఎదురు ప్రశ్న వేశాయి. ఏమోనమ్మా.... నా ప్రయత్నం నేను చేస్తాను, ప్రయత్నమే చేయకుంటే ఫలితాలు రావు కదా! జరిగేది జరుగుతుంది!" అని ఆ పిచ్చుక తన పని తను చేసుకు పోసాగింది. మంటలు మరింత వ్యాపించి పెద్దపెద్ద గాలులు వీచసాగాయి. చిన్నగా పక్షులున్న గుట్టలోని చెట్లకు కూడా సెగ తగలసాగింది. పక్షులలో ప్రాణ భయం మొదలయ్యింది. గుట్ట కింద కున్న గ్రామస్తులు అగ్గిమంటలను చూశారు. పరుగులు తీస్తూ వచ్చారు. తలా ఒక చేయి వేశారు. మంటలను ఆర్పారు. మరుసటిరోజు ఉదయం పక్షులన్నీ చేరి పిచ్చుకను సన్మానం చేశాయి."మా ప్రాణాల్ని కాపాడావు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదని తెలుసుకున్నాము. ఇకపై మేము ఎదురైన ఆపదల్ని చూస్తూ ఊరుకోము, ఏదో ఒక ప్రయత్నం చేస్తాము" అని ప్రమాణం చేశాయి.ఆనందంతో పిచ్చుక ఉడుత లాగా ఊగింది. మిగిలిన పక్షులన్నీ పిచ్చుకతో చేరి నాట్యం చేశాయి. ఆధారం: మన బడి మాస పత్రిక