ఏకాగ్ర త - బాలల కథ బాలయ్య ఊరగాయలు వ్యాపారం చేసేవాడు. అతనికి శర్వాణి కూతురు, సుజయ్ కొడుకు ఉన్నారు. శర్వాణి ఇంజనీరింగ్ చదువుతోంది. చదువులో ముందంజలో ఉంటుంది. సుజయ్ చురుకైన పిల్లాడు. ప్రయివేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కాని చదువులో వెనుకబడి పోయాడు. సుజయ్ చదువులో వెనుక పడడటంతో తండ్రి బాలయ్య మథనపడి పోయేవాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడుతో చాలాసార్లుమాట్లాడాడు, సుజయ్ పై శ్రద్ధ చూపమని. ప్రతిరోజు క్రమం తప్పకుండా సుజయ్ పాఠశాలకు వెళ్ళేవాడు. అయినా ఎందుకో చదువుపై ఏకాగ్రత పెట్టేవాడు కాదు. కొన్నిరోజులు సుజయ్ మానసిక పరిస్థితిని గమనించి ఓ నిర్ణయానికి వచ్చాడు బాలయ్య. తను చదివే ప్రయివేట్ పాఠశాల ఇరుకు గదుల్లో కిక్కిరిసి ఉండటం, ఆడుకోడానికి విశాలమైన ఆటస్థలం లేకపోవడం, పాఠశాల పనిగంటలు మొత్తం చదువు పేరుతో మానసికంగా యంత్రంలా తయారై శారీరక వ్యాయామం లేకపోవడం అని గ్రహించి ప్రభుత్వ పాఠశాలల్లో సుజయ్ ని చేర్పించాడు. అక్కడ విశాలమైన తరగతి గదులు, ఆడుకోవడానికి ఆటస్థలం, వ్యక్తిగత శ్రధ్ధ చూపే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆరు నెలల్లో సుజయ్ లో మార్పువచ్చింది. పాటలతో చదువుతూ ఉల్లాసంగా తన చదువును కొనసాగించి మంచి మార్కులు తెచ్చుకోవడం ప్రారంభించాడు. పదో తరగతిలో పాఠశాలకు ప్రథమ స్థాయిలో నిలిచి, ఆటల పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. పిల్లలని నిత్యం చదువు పేరుతో బంధించి, మానసిక ఉల్లాసాన్ని సృజనాత్మకతను ఇవ్వకపోతే దేనిపైనా ఏకాగ్రతను ఉంచలేరని బాలయ్యగ్రహించాడు. సుజయ్ చదువుపై ఏకాగ్రత పెట్టి గాడిలో పడినందుకు తండ్రి బాలయ్య ఊపిరి పీల్చుకున్నాడు. ఆధారం: మన బడి మాస పత్రిక