చీకటి చెప్పిన నిజం ( కథ ) ఒక పెద్ద ధనవంతుడి ఇంటిలో ఒక అద్దాల అర ఉండేది. అందులో రకరకాల ఖరీదైన వస్తువులు ఉండేవి. వాటన్నిటిలోకి ఒక బంగారు నెమలి విగ్రహం చాలా అందంగా తళతళ మెరుస్తూ ఉండేది. దానికి తన అందం చూసి చాలా గర్వం. ఆ అద్దాల అర ఉండే గదిలోనే ఓ మూలన చిన్న గూడులో ఒక పాత మట్టి ప్రమిద ఉండేది. అది నల్లగా, జిడ్డుగా చూడటానికి ఏమాత్రం ఆకర్షణీయంగా ఉండేది కాదు. రోజు ఆ బంగారు నెమలి మూలన ఉన్న మట్టి ప్రమిదను చూసి వెటకారంగా నవ్వేది. "చూడు నువ్వు ఎంత వికారంగా ఉన్నావో.. ఎవరైనా ఇంటికి వస్తే నన్ను చూసి 'వారేవా!' అంటారు. నిన్ను చూస్తే మాత్రం ముఖం తిప్పుకుంటారు. నా పక్కన ఉండడానికి కూడా నువ్వు అనర్హురాలివి" అని ఎగతాళి చేసేది. మట్టి ప్రమీద మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేది. ఒకరోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. ఈదురు గాలులకు కరెంటు తీగలు తెగిపోయాయి. ఒక్కసారిగా ఇళ్లంతా చీకటి అలముకుంది. ఆ ఆడంబరమైన ఇంట్లో కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కనిపించనంత కటిక చీకటి. ఆ చీకట్లో ఆ బంగారు నెమలి అందం ఎవరికీ కనిపించలేదు. దాని తళుకు బెళుకులు ఆ చీకటిని ఏమాత్రం పోగొట్టలేకపోయాయి. ఆ నెమలి భయంతో వణికిపోయింది. "నా అందం ఇప్పుడు ఎందుకు పనికి రావడం లేదు.." అని మదనపడింది. అప్పుడు ఆ ఇంటి యజమాని తడుముకుంటూ హాల్లోకి వచ్చాడు. లక్షల విలువ చేసే ఆ బంగార నెమలి పక్కనే ఉన్నా దాన్ని పట్టించుకోలేదు. చేత్తో తడుముతూ మూలన ఉన్న పాత మట్టి ప్రమాదను వెతికి పట్టుకున్నాడు. వెంటనే అందులో నూనె పోసి ఒత్తి వెలిగించాడు. అంతే ఆ చిన్న మట్టి ప్రమిద నుంచి వచ్చిన వెలుగు ఆ గదిలోని చీకటిని పారద్రోలింది. ఆ వెలుగులో ఇల్లంతా ప్రశాంతంగా మారింది. ఆ ప్రమిద వెలుగు పడడం వల్లే ఇప్పుడు ఆ బంగారు నెమలి మళ్ళీ మెరవడం మొదలుపెట్టింది. ఆ క్షణం నెమలికి జ్ఞానోదయం అయింది. “నా అందం కనిపించాలన్నా.. నీ వెలుగే ఆధారం. పదిమందికి దారి చూపించే నీ గుణం ముందు షోకేస్ లో బందీగా ఉండే నా అందం చాలా చిన్నది.." అనుకొని మనసులో ప్రమిదకు క్షమాపణ చెప్పుకుంది. ఆధారం: మన బడి మాస పత్రిక