నిజమైన స్నేహం ఒక ఊరిలో అరుణ అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అంతర్ముఖి. తను ఎప్పుడూ ఎవరితో మాట్లాడేది కాదు. ఒంటరిగా ఉండేది. తనకు ఒక స్నేహితురాలు ఉండాలని కోరుకునేది. ఒక రోజు తరగతిలోకి చిన్ని అనే కొత్త విద్యార్థి వచ్చింది. చిన్ని అందరితో కలివిడిగా ఉండేది. అలానే అరుణతో కూడా వెంటనే కలిసిపోయింది. వారి మధ్య మొదలైన పరిచయం కొద్ది రోజుల్లోనే మంచి స్నేహంగా మారింది.తన స్నేహితురాలు అరుణలోని అంతర్ముఖి లక్షణాలను చిన్ని గమనించింది. ఆమెలోని బిడియాన్ని గౌరవిస్తూనే తన స్నేహితురాలిని మార్చాలని చిన్ని అనుకుంది. ఒక రోజు పాఠశాలలో ' మన నాయకత్వం ' అనే అంశం మీద జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించారు. ఈ అంశం మీద అరుణ ఒక మంచి వ్యాసం రాసింది. అది చూసిన చిన్ని చాలా సంతోషపడి చాలా బాగా రాశావు పోటీలో నువ్వు ఎప్పుడు పాల్గొంటున్నావు అని అడిగింది. " అమ్మో నేను రాయగలను కానీ, అందరిలో మాట్లాడలేను, స్టేజి మీదకు వెళితే కాళ్ళు వణుకుతాయి, గొంతు మూగబోతుంది.. నేను పోటీల్లో పాల్గొనను " అని చెబుతుంది. కానీ చిన్ని ఇలా అంటుంది "నువ్వు బాగా రాశావు. నువ్వు చాలా బాగా మాట్లాడగలవు కూడా. ఆ విషయం నేను ఎప్పుడో గమనించాను. నువ్వు అంతర్ముఖివే. నీలోనూ ధైర్యం ఉంటుంది. మన ధైర్యం మనలోనే ఉంటుంది. దాన్నిబయటికి తీయాలి. నువ్వు ఆలోచించకుండా పోటీల్లో పేరు ఇవ్వు " అని ప్రోత్సహిస్తుంది. చిన్ని చెప్పడంతో అరుణ పోటీకి తన పేరు ఇస్తుంది.పోటీ రోజు రానే వచ్చింది. ఆరోజు అరుణలో చాలా భయం వేసింది. నావల్ల కాదు చిన్ని అని చెప్పింది. చిన్ని మాత్రం " అరుణా.. నీ వెనుక నేను ఉంటాను. భయపడకు సరేనా " అని స్టేజి మీదకి పంపించింది. అరుణలో కొంచెం భయమేసింది. కానీ చిన్ని చెప్పిన మాటలు తన మనసులో పెట్టుకుంది. కళ్ళు మూసుకుని స్పీచ్ ప్రారంభించింది. అలవోకగా ఎంతో ధైర్యంతో స్పీచ్ ని పూర్తి చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. అరుణ వేగంగా స్టేజి దిగి చిన్నిని గట్టిగా హత్తుకుంది. ఈ పోటీలో అరుణకు రెండో బహుమతి వచ్చింది. అరుణ చిన్ని దగ్గరికి వచ్చి.. " చిన్నీ.. నువ్వు ఇచ్చిన ధైర్యం కారణంగానే ఈ బహుమతి. ఇది నీది " అని చిన్ని చేతిలో పెట్టింది. చిన్ని కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి. " అరుణా.. ఇది నీ బహుమతి. నువ్వు ధైర్యంగా చెప్పావు.. ఇది నీదే" అని చెప్పి అరుణకి ఇస్తుంది. నిజమైన స్నేహం మన నుండి ఏదీ ఆశించదు. అరుణలోని అంతర్ముఖి లక్షణాలను చిన్ని పోగొట్టలేదు. కానీ ఆమెలోని భయాన్ని పోగొట్టింది. ఆ తర్వాత వారి స్నేహం మరింత బలపడింది. ఆధారం: మన బడి మాస పత్రిక