పిట్ట కొంచెం కూత ఘనం అడవిలో జోరుగా వర్షం కురవడం మొదలైంది. జంతువులన్నీ చెల్లా చెదురుగ పారిపోసాగాయి. ఒక లేడిపిల్ల గుహలోకి వెళ్ళి దాక్కుంది. చలికి వణుకుతూ అటూ ఇటూ దిక్కులు చూస్తోంది. ఇంతలో ఎవరక్కడ అంటూ భీకర స్వరం వినబడింది. దానితో లేడి పిల్ల గుండెలో రాయి పడ్డట్టు అయింది. ఆపదలో ఉన్నప్పుడు గుండె దిటవు చేసుకోవాలని తల్లి చెప్పిన సంగతి గుర్తుకు తెచ్చుకుంది. భయాన్ని విడిచిపెట్టి గంభీర స్వరముతో నేను అడవికి రారాజును, జంతువులను వేటాడి వస్తుండగా ఈ వర్షం కారణంగా ఇక్కడికి వచ్చానని చెప్పింది.. లోపల నుండి అడవికి రాజు మృగరాజు కదా మరి నీవు రారాజు అంటావేమి అనే ప్రశ్న వినబడింది. వెంటనే లోపల ఉన్నది ఖచ్చితముగా సింహం అని తలచిన లేడి, అడవికి మాత్రమే నువ్వు రాజువి .మొత్తం అడవికి నేను రారాజును అన్నది. నిరంతరం జంతువులను పట్టి చంపి తింటున్న ఆ రాజు సంగతి ఈరోజు తేల్చుదామని ఈ అడవిలోకి వచ్చాను అని మరింత గంభీర స్వరముతో అన్నది. లోపల ఉన్న మృగరాజు ఇదేదో నాకంటే బలమైన జంతువు అని తోకముడిచి వెనుక నుండి తప్పించుకుని పోయింది. దాంతో బతుకు జీవుడా అంటూ లేడి అక్కడే ఉండి వర్షం తగ్గిన వెంటనే తన దారిన తాను వెళ్లిపోయింది. ఆధారం: మన బడి మాస పత్రిక