గొప్పగుణం ఒక పెద్ద మర్రిచెట్టుపై ఒక కాకి జంట, చిలుకజంట నివసించేవి. ఆ చిలుక జంటలో ఆడచిలుక పేరు పంచ వన్నెల.దానికి తాను మహా అందగత్తెననే గర్వంతో మిడిసిపడేది. రంగురంగుల రెక్కలతో అందంలో తనను మించినవారెవరు లేరని, తన పలుకులు ఎంత చూడ ముచ్చటగా ఉంటాయో అని తన గొప్పలు చెప్పడమే కాదు, ఆ చెట్టుపై నివసిస్తున్నఆ కాకిజంటలో ఆడకాకి "సుమనస్విని” చూసి " నల్లగా నువ్వెంత అందవికారం గా ఉంటావో, పైగా కావు,కావు అంటూ అరిచే నీ అరుపు ఎంత కర్ణకఠోరంగా ఉంటుందో" అని గేలి చేసేది. అయినప్పటికి పాపం సుమనస్విని పంచవన్నెల ఏమన్నా దానితో ఏ విధమైన గొడవ పెట్టుకోకుండా, ఒకే చెట్టుపై నివసిస్తున్న పక్షులం మనమంతా కలిసిమెలిసి జీవించాలి అనే భావంతో సంయమనం పాటిస్తూ మిన్నకుండేది. అలా ఒకనాడు పంచవన్నెల తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఏమరుపాటుగా ఉండటంతో ఒక వేటగాడు దానిపై వల పన్ని వలలో దానిని బంధించి తనతో పాటు తీసుకుపోతుండటంతో ఆ పంచవన్నెల చిలుక భయంతో తనను "రక్షించండి. రక్షించండి" అని వేడుకుంది. కానీ దాని మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. పంచవన్నెల జంట మగ చిలుక కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఆ వేటగాడు వెనుకే వెళ్ళింది. ఆ వేటగాడు ఆ చిలుకని ఒకతనికి అమ్మేసాడు. అతను ఆ పంచవన్నెల చిలుకను పంజరంలో ఉంచి తన ఇంటి వీధి అరుగు పైన ఉన్న ఒక కొక్కానికి తగిలించి పెంచుకోసాగాడు. ఆ సమయంలో సుమనస్విని కూడా ఆహరం కోసం బయటకు వెళ్ళడంతో తనకి పంచవన్నెలని ఎత్తుకునిపోయినట్లు తెలిసింది కాదు. ఈ లోపు పంచవన్నెల జంటలో మగ చిలుక తిరిగి మర్రిచెట్టు చేరి తన భార్యపై బెంగతో ఏడుస్తూ కూర్చుంది. అలా ఎందుకేడుస్తుందో ఆరా తీసింది సుమనస్విని. జరిగినదంతా ఏడుస్తూ చెప్పింది మగచిలుక. దానికి సుమనస్విని నువ్వేం దిగులుపెట్టుకోకు, నేనూ, నా భర్త కలిసి వెళ్ళి నీ భార్యను క్షేమంగా తీసుకొస్తాం. సరేకానీ నీ భార్య పంజరంలో బందీ అయిన చోటు చూపిద్దువూ గానీ,మాతో రా" అని చెప్పింది. ఆ రాత్రికే ఆ కాకి జంట, మగ చిలుకతో కలిసి పంజరంలో బందీ అయిన పంచవన్నెల చిలుక ఉన్న చోటుకి వెళ్ళాయి. సుమనస్విని ఆ పంజరం పై వాలి పంచవన్నెలతో" నువ్వేం కంగారుపడకు, నిన్ను రక్షించడానికొచ్చాం, కాసేపు ఓపికపట్టు" అని ఓదార్చి సుమనస్విని దగ్గరలో గట్టిగా ఉన్న ఒక కర్రపుల్లని వెతికి నోట కరచుకుని తెచ్చి దాన్నిఒక పక్క తను నోట కరచుకుని జాగ్రత్తగా ఇంకో పక్కనుంచి పంజరానికి ఉన్న రింగులోకి దూర్చి ఆ పక్కను తన భర్త నోట కరచుకోమని చెప్పి జాగ్రత్తగా ఆ కొక్కెం నుంచి పంచవన్నెల చిలుకతో ఉన్న పంజరాన్ని తప్పించి కర్రకు రెండు వైపులా కాకిజంట నోట కరచుకుని ఎగురుకుంటూ మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాయి. వెనుకే ఆనందంగా మగచిలుక అనుసరించింది. అదే చెట్టు తొర్రలో నివసిస్తున్న వడ్రంగిపిట్ట సాయాన్ని తీసుకుని ఆ పంజరానికున్న తాళాన్ని పగులగొట్టించింది. వెంటనే పంజరంనుంచి పంచవన్నెల స్వేచ్చగా ఊపిరి పీల్చుకోవడమే కాకుండా "అందంగా ఉండటం, తళుకుబెళుకులు చూసి మురిసిపోవడం, చిలుకపలుకులు పలకడం అనేవి గొప్ప గుణాలు కాదు, ఇతరులకు సాయం చేయడం కు మించిన గొప్పగుణం ఈ లోకాన లేదని తెలుసుకుని, సుమనస్వినితో తనని క్షమించమని వేడుకుంది". అప్పటినుంచి ఆ కాకి జంట, చిలుక జంట ఎంతో స్నేహంగా ఉంటూ ఒకరికొకరు సాయపడుతూ హాయిగా జీవించసాగాయి. ఆధారం: మన బడి మాస పత్రిక