కనువిప్పు అనగనగా ఓ రాజు. ఆ రాజు పేరు విశ్వవర్మ. ఎవరి మాట వినకపోవటం -ఆయనకున్న చెడ్డ లక్షణం. దీంతో ఆ రాజ్యంలోని ప్రజలంతా భయపడిపోతుంటారు. ఎందుకంటే ఈయన ఏది అడిగితే అది ఇవ్వాలిసిందే, తేవాల్సిందే! అలా కాదంటే వారికి మరణశిక్ష విధిస్తుంటాడు. ఒక రోజున ప్రజలంతా తమ ఇళ్లనుంచి బయటకు వచ్చి ‘ఇంద్రధనుస్సు’ను చూసి కేరింతలు కొడుతూ ఆనందంలో ఉండటం-రాజు తన అంతఃపురం నుంచి చూశారు. వెంటనే మంత్రి రత్నాకరుడుని పిలిచి, ‘‘రేపటి ఉదయానికల్లా ఆ ఇంద్రధనుస్సునుతీసుకురావాలనీ, లేకపోతే మరణశిక్షను విధిస్తాను’’ అని ఆదేశించాడు. రాజుగారి కోర్కె తీర్చడం అసాధ్యమనీ తెలిసినప్పటికీ, చెప్పలేని నిస్సహాయస్థితి మంత్రిది. ఎప్పుడూ నవ్వుతూ ఇంటికి వచ్చే మంత్రి విచారంగా, ముభావంగా రావడంతో మంత్రి భార్య సునంద గమనించి ఏమి జరిగిందో అడిగింది. జరిగిన విషయాన్ని విన్న సునంద ‘ఓస్ అంతే కదా! రాజు గారు అడిగిన కోర్కెను రేపు ఉదయానికల్లా నేను తీరుస్తాననీ, హాయిగా నిద్రపోండి’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది. తరువాత రోజు తెల్లవారుజామునే సునంద పాతబట్టల మూటను తీసుకుని రాజు గారి అంతఃపురం వద్ద వున్న బావి దగ్గరకు వెళ్లి ఉతకడం ప్రారంభించింది. ఉతుకుతున్న శబ్దానికి రాజు ఉలిక్కిపడి లేవడం, వెంటనే భటులతో ఆమెను పిలిపించారు. ఒక మంత్రి భార్యవైన నువ్వు ఇక్కడ ఇలా చేయటం ఏమిటనీ రాజు అడగగా.. సునంద ‘నిన్న రాత్రి నా భర్త పండంటి మగబిడ్డను ప్రసవించారు. ఆ పురిటి బట్టలను అంతఃపురంలొనే ఉతికితే మన రాజు గారికి, రాజ్యానికి ఎంతో మంచిది అన్నారని’ ఆమె చెప్పింది. వెంటనే రాజు ‘నీకు ఏమైనా మతి వుందా! లేదా! మీ ఆయన ప్రసవించడమేమిటి?!. ఇది విడ్డూరంగా, లోకవిరుద్ధంగా ఉందే, నాతోనే పరిహాసం ఆడతావా?’ అని గద్దించాడు. వెంటనే సునంద ‘రాజా, ఎక్కడైతే ఎండతో పాటు వర్షం కూడా ఒకే ప్రాంతాన పడినప్పుడు ఏర్పడేదే ఇంద్రధనుస్సు. దాన్ని మీరు తీసుకురమ్మనడం అన్నది కూడా విడ్డూరం - లోకవిరుద్ధమే కదా! ఒకసారి ఆలోచించండనీ’ చెప్పింది. వెంటనే రాజు తన అజ్ఞానాన్నీ తెలుసుకొని, తను కోరిన ఇంద్రధనుస్సు అసాధ్యమని భావించి, తన కోర్కెను ఉపసంహరించుకున్నానని ప్రకటించాడు. మంత్రి భార్య సునంద తన చదువు-తెలివితేటల తో రాజుకు ‘కనువిప్పు’ కలిగించి, తన భర్తను కాపాడుకుంది. ఆధారం: మన బడి మాస పత్రిక