జయ జయ జయహో! అనగనగా ఒక ద్వికోటి అనే ద్వీపకల్పం ఉండేది. మూడు పక్కలా నీళ్ళు, ఒక పక్క ఎర్ర నేల ఉన్న ఆ ద్వీపకల్పం రాజుకు ఒక చిన్న కోరిక కలిగింది. అందమైన ఈ ద్వీపకల్పంలో అనేక అందమైన పక్షులు, జంతువులు ఉన్నాయి. లేనిదల్లా ఏనుగు మాత్రమే. ఒక్క ఎనుగునైనా పెంచుకుంటే బాగుంటుందని ఆశపడ్డాడు. అతడి మనసులోని ఆలోచనను రాణి పసిగట్టింది."మీరు ఎందుకంత బాధపడుతారు. వంద మైళ్ళ దూరంలో త్రికోటి ద్వీపకల్పం ఉంది కదా. ఆ రాజు కూడా మీకు మిత్రుడే కదా. అ ద్వీపకల్పంలో అడవులకు, ఏనుగులకు కొదవ లేదు. అడిగి చూడండి. ఒక ఏనుగును ఖచ్చితంగా పంపిస్తారు" అని సలహా ఇచ్చింది. వెంటనే రాజు త్రికోటి ద్వీపకల్పం రాజుకు వర్తమానం పంపాడు. అదెంత భాగ్యం?' అంటూ సంతోషంగా అంగీకరించాడు త్రికోటి రాజు. అయితే ఎనుగును సముద్రం గుండా పంపడానికి ఏకైన మార్గం పెద్ద పడవలే ఏకైక మార్గం అని సూచించాడు మంత్రి. ఏసుగు ఏనుగును బంధించడం అంటే సామాన్యమా... పడవలో ఎక్కించిన ఏనుగు కదలకుండా ఉంటుందా... ప్రయాణంలో పొరపాటుగా పడితే దానికదే లేవాలి కానీ, దాన్ని ఎవరు లేపగలరు అది అంత సులభంగా అయ్యే పని కాదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిదని సైనికాధిపతి విన్నవించుకున్నాడు.'ఏమి చేయాలా' అని మంత్రి ఆలోచనల్లో పడ్డాడు. ఎవరైనా ఈ సాహసాన్ని చేయగలరా అని ఏనుగులను మేపే మాపాటులను పిలిచి అడిగాడు. చాలా కష్టమని, జరగరానిది జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి వారు ముందుకు రాలేదు. వెంటనే మంత్రి ఊరంతా దండోరా వేయించాడు. రెండు రోజుల తర్వాత కార్తి అనే పన్నెండేళ్ళ పిల్లవాడు రాజసభకు వచ్చాడు. తను చెప్పినట్లు చేస్తే పడవలో ఏనుగు కదలకుండా ఉంటుందని చెప్పాడు. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. "పడవలో ఏనుగు కదలకుండా ఎలా చేయగలవు?" అని రాజు అడిగాడు. "మొన్న పిల్లలందరం కలిసి చెరువు దగ్గర ఆడుకుంటూ ఉంటే నాలుగు ఏనుగులు నీళ్ళకోసం వచ్చాయి. అవి నీళ్ళు తాగి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఏనుగు చుట్టూ కోడి పిల్లలు చేరాయి. అడుగు వేస్తే అవి చితికి చస్తాయని అర్ధం చేసుకుంది ఆ ఏనుగు. మూడు గంటలపాటు ఆ కోడి పిల్లలు కదలలేదు. ఏనుగు కాళ్ళను అవి చెట్లని భావించాయేమో... ఏనుగు చుట్టూ చేరి అవి ఆడుకోసాగాయి.కదిలితే తే కష్టమని ఏనుగు తన మేధస్సుతో గుర్తించింది. అందుకని మూడు గంటలపాటు కదలకుండా విగ్రహంలా ఉండిపోయింది. అందుకే చెబుతున్నాను. దయ గల జంతువు ఏనుగు. మీరు పడవలో దాని చుట్టూ చిన్న చిన్న కోడిపిల్లలను పెట్టి చూడండి. అది కదలనుగాక కదలదు" అన్నాడు కార్తి. అంతా ఆసక్తిగా విన్న రాజు "బలంలో ఏనుగు సాటిలేని జంతువు. అంతేకాక భావోద్వేగాలు గల జంతువు కూడా. ఈ చిన్న నోట ఇంత పెద్ద మాట వచ్చింది. ధైర్యం చేద్దాం. జాగ్రత్తలు తీసుకుని ఒక ఏనుగును పంపండి" అన్నాడు రాజు. సైనిక బృందం కార్తీ చెప్పినట్లే చేసి జాగ్రత్తగా ఏనుగును ద్వికోటి ద్వీపకల్పంలో దించి వచ్చారు. ఏనుగును చూసి ద్వికోటి రాజు పరమానంద భరితుడయ్యాడు. మరుసటి రోజు చిట్టి చిట్కా ఇచ్చిన కార్తిని ఏనుగు మీద ఊరేగించి పండుగ చేసుకున్నారు త్రికోటి ద్వీపకల్ప ప్రజలు. కార్తి ఈడు పిల్లలు 'జయ జయ జయహో' అని నినదించారు. ఆధారం: మన బడి మాస పత్రిక