విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలి వివిధ రకాల దేశాల స్వభావం వివిధ రకాలుగా ఉంటుంది. ఈ విధంగానే భారత స్వభావం 'ఆధ్యాత్మికత' అందుకనే మన విద్య విలువలతో కూడి ఉంటుంది. ఎంత పెద్ద దేశమైనా సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ విలువలు లోపించినట్లయితే ఆ దేశానికి పతనం తప్పదు. ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన తక్షశిల మన అఖండ భారతంలోనే ఉండేది. ఎన్నో దేశాల నుండి అభ్యసించడానికి విద్యార్థులు వచ్చి ఇక్కడ విలువలతో కూడిన విద్యను అభ్యసించిన సందర్భాలు ఉన్నాయి. మన దేశ గురువులకు ఉన్న ప్రత్యేకత ఇది. నేడు మన సమాజంలోని విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించ లేకపోతే రాబోవు సమాజం అతిపెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొంటుందని నేడు మేధావులు గ్రహిస్తున్నారు. నేడు సమాజంలో అన్ని రంగాలలో విలువలు పతనం అవుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తులలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. ఒక వ్యక్తి నుండి ప్రారంభమయ్యే మార్పు అతని ఆలోచనల నుండే ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన ఆచరణగా మారుతుంది. ఆచరణ అలవాటుగా, అలవాటు స్వభావంగా, ఆ స్వభావమే వ్యక్తిత్వం. ఆ విలువలతో కూడిన వ్యక్తిత్వమును బోధించడానికి గురువులు మార్గదర్శకులుగా ఉంటారు. గురువులు ఈ విలువలను బోధన ద్వారా మాత్రమే నేర్పించగలరు. విద్యా ప్రధాన లక్ష్యం 'విలువలను బోధించడమే' కానీ ఇది అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు గురువుల దగ్గరకు వచ్చి మార్కులు, ర్యాంకులు మాత్రమే అడుగుతున్నారు. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు విలువలు నేర్పించండి సంస్కారం నేర్పించండి అని అడగటం లేదు. 'సంస్కారం అభావేనాసాక్షారోరాక్షసోభవేత్' అంటే సంస్కారం లేని అక్షరాస్యుడు, రాక్షసునితో సమానం.అమెరికా అధ్యక్షుడు అయిన అబ్రహం లింకన్ తన బిడ్డలకు కష్టపడే తత్వం నేర్పించమని గురువులను కోరాడే గాని... మార్కులను కాదు. తల్లిదండ్రులు విద్యార్థులకు కష్టపడే విధానం నేర్పించక నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను పోటీలో నిలబెట్టకుండా తల్లిదండ్రులే పిల్లలను భుజాలపై మోస్తూ పరిగెత్తుతున్నారు. దీనివల్ల పిల్లలు స్వశక్తిపై కాకుండా తల్లిదండ్రులపై ఆధారపడే విధంగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా, సమాజం పతనం చెందకుండా తల్లిదండ్రుల సమావేశాలలో 'విలువల విద్యను' ఉపాధ్యాయులే బోధించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉపాధ్యాయులు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో తల్లిదండ్రులతో పూర్తిస్థాయిలో మమేకమై కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాక పిల్లల గురించి వివరించగలిగారు. రాబోయే రోజులలో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులలో మార్పును ఆశిద్దాం. ఆధారం : మన బడి మాస పత్రిక