పిల్లల పట్ల పెద్దల ప్రవర్తన ‘నేటి బాలలే రేపటి పౌరులు’ రేపటి పౌరులే మన దేశం భవిష్యత్తు. భారతావని భవిష్యత్ అయిన బాలలను మనం, అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలా తీర్చిదిద్దాలి? ఈ సందర్భంగా కొన్ని విషయాలు పిల్లలు ఏదైనా మనకు చెప్పాలనుకున్నపుడు మనము చాలా ఓపిగ్గా వినాలి. ఏ పిల్లవాడు కూడా అశక్తుడు కాడు., సామర్థ్యము లేనివాడు కాదు. తల్లిదండ్రి తప్పకుండా చిన్న వయసులో (దాదాపు ఒక 12 సంవత్సరాలు వచ్చేవరకూ... అనగా టీనేజ్ దాటేవరకూ) ప్రతిరోజూ వారితో కొంత సేపైనా గడపాలి. పిల్లలను యంత్రాలుగా చేసి, మా పిల్లల గొప్పతనం చూడమని, ఇంటికి వచ్చిన వారితోనూ, బంధువులతోనూ వారు నేర్చుకున్న విషయాలను ప్రదర్శింపజేయడం తప్పు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకూ చాలా సహనం కావాలి. తమ పిల్లలను ఏ తల్లిదండ్రీ ఇతర పిల్లలతో పోల్చరాదు. ఉపాధ్యాయుడు కూడా ఒక పిల్లవాడి సామర్థ్యాన్ని ఇతర పిల్లలతో పోల్చి తప్పు పట్టరాదు. పిల్లలు తెలియక తప్పు చేస్తే అది వారికి సున్నితంగా తెలియజేయాలే కానీ శిక్షించడం చేయరాదు. పిల్లలకు మాట్లాడడంలోనూ, పనులు చేయడంలోనూ అవసరమైన స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లలు పుట్టక ముందు నుంచే, అనగా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే వారి భవిష్యత్తు గురించి కలలు కనడం మానాలి. పుట్టిన తరువాత కూడా పిల్లల ఆసక్తికి అనుగుణంగా వారి భవిష్యత్తుకు బాటలను వారే సొంతంగా వేసుకునేలా సహకరించాలి. అందుకు ఒక మార్గదర్శిగా మాత్రమే ఉండాలి. పిల్లల మనసును చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ, ప్రతి చిన్న విషయానికీ కోప్పడరాదు. సాధ్యమైనంతవరకూ అర్థం పిల్లల కన్నా డబ్బు ముఖ్యం కాదనే విషయం ప్రతి తల్లి, తండ్రీ గ్రహించాలి. ఫీజులు ఎక్కువగా కట్టించుకునే పాఠశాలలు, గ్రౌండు పెద్దగా ఉన్నవీ, బాగా ప్రకటనలలో నానుతుండేవీ, ఎప్పుడూ హెూమ్ వర్క్ ఇచ్చేవీ, ఇంటి దగ్గర క్షణం కూడా తీరిక లేకుండా చేసే పాఠశాలలన్నీ మంచివని అనుకోవడం చాలా తప్పు. పిల్లలకు తగినంత ఎండ, గాలి తగిలే విధంగా బయటి ఆటలు ఆడడం చాలా అవసరం అని గ్రహించాలి. ఎప్పుడూ నాలుగు గోడల మధ్యలో ఉంచరాదు. తోటి వారితో కూడా స్వతంత్రంగా ఆడనివ్వాలి. పిల్లల విజ్ఞానానికి మార్కులు కొలమానం కాదు. విజ్ఞానానికి మార్కులు, గ్రేడులతో సంబంధం ఏమాత్రం లేదనే విషయం తెలుసుకోవాలి. పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలనేది ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత తప్పనిసరైతే తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ పిల్లలు చదువుకునే పాఠశాలలను పదే పదే మార్చరాదు. పిల్లలు చేసే తప్పులకు, పొరపాట్లకు కారణాలు తప్పకుండా ఉంటాయి. వారిని కొట్టకుండా, కోప్పడకుండా ఆ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని నివారించి, పునరావృతం కాకుండా చూడాలి. పిల్లలు మనం ఆశించినట్లుగా ఉండాలని కోరుకోరాదు. వారి ఆలోచనలను, సామర్థ్యాలను కనుక్కుని అందుకు అనుగుణంగా సలహాలిస్తూ, బాటలు వేయాలి. చిన్న పిల్లల మనసులను వీలైనంతవరకూ గాయపడకుండా చూడాల్సిన బాధ్యత పెద్దలదైన మనదే. చిన్న పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలి. తీర్చడమా? లేదా? అన్నది తర్వాత విషయం. అవసరమైనవి వాటి ఉపయోగాలను వివరించాలి. అనవసరమైన వాటి వల్ల నష్టాలు పిల్లలకు నెమ్మదిగా తెలియజెప్పాలి పిల్లలకు, పద్యాలు, కథల వలన చాలా చాలా ఉపయోగం ఉందన్న విషయం తెలుసుకోవాలి. కథల్లో నిగూఢంగా దాగి ఉన్న కారణాలను, అంతరార్థాలను తెలుసుకుని వివరించాలి. విన్న కథల పట్ల ప్రశ్నించడం, విశ్లేషించడం నేర్పించాలి. అమ్మాయిల పట్ల, ఆడవారి పట్ల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పొరుగువారు, బంధువుల పట్ల, మరీ ముఖ్యంగా గర్భం దాల్చిన ఆడవారి పట్ల (పిల్లల వయసుకు తగిన రీతిలో) ఎలా ప్రవర్తించాలో? పెద్దలందరూ చెప్పాల్సిన విషయం. పిల్లలకు ఆసక్తి లేని విషయాలను బలవంతంగా వారిపై రుద్ద కూడదు. పిల్లలు చేసే ప్రతి పనీ చెడ్డదిగా భావించరాదు. ఆ పనిని తెలుసుకొని, చెడ్డదైతే తెలియజెప్పి మాన్పించాలి. మంచివైతే ప్రోత్సహించాలి. మన పిల్లల తప్పులను ప్రచారం చేయరాదు. తప్పు ఎందుకో? వివరించి అర్థం చేసుకునేలా ఓపికగా చెప్పాలి. ఆధారం : మన బడి మాస పత్రిక