భారతదేశంలో కార్పొరల్ పనిష్మెంట్, పిల్లల హక్కులు పాఠశాల అనేది పిల్లలు సురక్షితంగా, ఆనందంగా, ఆసక్తిగా విద్యా బుదు లు నేర్చుకునే చోటు. బడి ప్రేమ, ఆదరణ, అర్థం చేసుకునే ప్రదేశంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పు చేశారని వారిని కొట్టడం, గట్టిగా అరవడం, అందరి ముందు అవమానించడం వంటివి చేస్తుంటారు. దీనినే కార్పొరల్ పనిష్మెంట్ (శారీరకంగా దండించడం) అంటారు. కార్పొరల్ పనిష్మెంట్ అంటే వారిని శారీరకంగా కొట్టడం మాత్రమే కాదు. పిల్లల మనసుకు నొప్పి కలిగించే మాటలు, భయపెట్టే చర్యలు కూడా ఇందులో భాగమే. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. విద్యార్థి దశలోనే భయం, బాధ పెరిగి, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కార్పొరల్ పనిష్మెంట్ (శారీరక దండన) అంటే ఏమిటి? పిల్లలు తప్పు చేశారని భావించి వారిని శారీరకంగా లేదా మానసికంగా బాధపెట్టే విధానాన్ని కార్పొరల్ పనిష్మెంట్ (శారీరక దందన) అంటారు. పాఠశాలలో ఉదాహరణలు : చేతిపై కొట్టడం, ఎండలో ఎక్కువసేపు నిలబెట్టడం, తోటి విద్యార్థుల ముందు అవమానించడం, గట్టిగా అరవడం. " నువ్వు పనికిరావు" వంటి మాటలు చెప్పడం ఇంట్లో ఉదాహరణలు : చదవలేదని కొట్టడం, ఇతర పిల్లలతో పోల్చి అవమానించడం, మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడం, మాట్లాడకుండా శిక్షించడం వంటి చర్యలు పిల్లల మనసును చాలా బాధపెడతాయి. పిల్లలపై ప్రభావం భావోద్వేగ ప్రభావం: కార్పొరల్ పనిష్మెంట్ వల్ల పిల్లలు భయపడతారు. బాధపడతారు, ఒంటరితనానికి లోనవుతారు. ఆత్మవిశ్వాసం 2 తగ్గుతుంది. "నేను మంచివాడిని కాదు" అనే భావన కలగవచ్చు.మానసిక ప్రభావం: ఎప్పుడూ భయంతో ఉండే పిల్లలు ప్రశ్నలు అడగడానికి వెనుకాడతారు. తప్పు చేస్తానేమో అని ఆందోళన పడతారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి తగ్గుతుంది. కొన్నిసార్లు ఒత్తిడి, నిరాశ కూడా కలుగుతుంది.చదువుపై ప్రభావం: దండించడం వల్ల పాఠశాలకు వెళ్లాలని అనిపించదు. చదువుపై ఆసక్తి తగ్గుతుంది. మార్కులు రావు. టీచర్లతో మాట్లాడటానికి కూడా భయపడతారు. భారతదేశంలో చట్టపరమైన స్థితి భారతదేశంలో పాఠశాలలు, విద్యాసంస్థల్లో కార్పొరల్ పనిష్మెంట్ చట్టరీత్యా నిషేధించబడింది. పిల్లల హక్కులు, వారి మానసిక ఆరోగ్యం, గౌరవం కాపాడడం కోసం ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. ముఖ్యమైన చట్టాలు ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (RTE), 2009: ఈ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సెక్షన్ 17(1): పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసిక వేధింపులకు గురిచేయడం నిషేధం. సెక్షన్ 17(2): ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. జువెనైల్ జస్టిస్ చట్టం, 2015: సెక్షన్ 75,82: పిల్లలను రక్షించడానికి రూపొందించబడ్డాయి. పిల్లలను బాధపెట్టినా, నిర్లక్ష్యం చేసినా కఠినమైన చర్యలు తీసుకునేలా ఇది చెబుతుంది. పిల్లల సంరక్షణ సంస్థల్లో శారీరక శిక్షలు ఇవ్వడం కూడా తప్పే. భారత రాజ్యాంగం: ఆర్టికల్ 21: ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవన హక్కును ఇస్తుంది. ఆర్టికల్ 39(4): పిల్లలు ఆరోగ్యకరమైన. గౌరవప్రదమైన వాతావరణంలో ఎదగాలని చెబుతుంది. అంటే పిల్లలు భయం లేకుండా నేర్చుకునే హక్కు ఉంది. ఎందుకు ఇది హానికరం? కొంతమంది పెద్దలు "వీడికి రెండు పడితే కాని దారిలో పడేలా లేడు", "దండిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు" అని అనుకుంటారు. కానీ నిజానికి భయం వల్ల పిల్లలు నేర్చుకోరు.. వారు భయపడతారు. పిల్లలను కొడితేనో లేదా అందరిముందు అవమానిస్తే ఇలవాట్లు రావు, వారు. బాధడపడతారు. మౌనంగా ఉండిపోతారు లేదా ఒంటరి తనానికి లోనవుతారు. నోరు విప్పడానికే సంకోచిస్తున్నారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు.పిల్లల్లో కోపం, భయం, దూరం పెరుగుతాయి. పిల్లలు తప్పులు చేస్తారు.. అది ఎదుగుదలలో భాగం. తప్పు చేసినప్పుడు అర్థం చేసుకునేలా చెప్పాలి. కౌన్సెలింగ్ ఇవ్వాలి. అంతేకాని భయపెట్టకూడదు. సానుకూల క్రమశిక్షణ పద్ధతులు శిక్షకు బదులుగా సానుకూల క్రమశిక్షణ చాలా మంచిది. ప్రవర్తనా ప్రతిబింబం: పిల్లలు తమ తప్పు గురించి తాము ఆలోచించే అవకాశం ఇవ్వాలి. "ఇలా చేయడం సరైందా?" అని ఆలోచించాలి. సమయాన్ని తగ్గించండి: కొంతసేపు ఆడుకునే సమయాన్ని తగ్గించడం వంటి చిన్న మార్పులు ఉపయోగపడవచ్చు. కౌన్సెలింగ్: ఎంత పెద్ద విషయమైనా పిల్లలను చాలా సున్నితంగా డీల్ చేస్తూ, కౌన్సెలింగ్ ఇవ్వాలి. ప్రోత్సాహం: "బాగా చేశావు!" అనే చిన్న మాట. కూడా పిల్లలకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. మంచి ప్రవర్తనను గుర్తించి అభినందించాలి. సహనం: కొందరు త్వరగా నేర్చుకుంటారు. కొందరికి కొంత సమయం పడుతుంది. ఓర్చు చాలా ముఖ్యం. మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ కౌన్సిలర్లు మానసిక ఆరోగ్యం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో EDCII ఆధ్యర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 535 మంది కౌన్సిలర్లు విద్యార్థుల మానసిక శ్రేయస్సు కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి కౌన్సిలర్ మండలంలోని అన్ని పాఠశాలలకి వెళ్తారు. పిల్లలూ... మీకు ఏమైనా ఇబ్బందులు. మానసిక ఒత్తిడి, భయం వంటివి ఉంటే మీ పాఠశాలకు వచ్చిన కౌన్సిలర్ కు చెప్పండి. నిర్భయంగా ఉండండి.. బాల్యాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపండి. ఆధారం: మన బడి మాస పత్రిక