బాల్య వివాహాలు వద్దు .. విద్యాభ్యాసమే ముద్దు .. బాల్యవివాహాలు పెనుభూతంలా పెరిగి పోతున్నాయి... అక్షరాస్యత లేక, అవగాహన లేక, ఆర్థిక స్తోమత, ఇలాంటి ఎన్నో కారణాలు బాల్య వివాహాలకు కారణం కావొచ్చు కానీ, అలా చేయడం వల్ల తరాలు నాశనమైపోతున్నాయి. ఆడవారికైనా, మగవారికైనా పెళ్లీడు ఉంటుంది. అది పాటిస్తే అందరికీ మంచిది. చదువుకునే వయస్సులో బాలికలకు పెళ్లిచేసి చేయికడిగేసుకునే రోజులు కావు ఇవి. లింగ సమానత్వాన్ని పాటించి అందరూ సమానమే అని భావించి, బాలికా విద్యను ప్రోత్సహించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలతో గ్రామీణ స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు అవగాహన కల్పిస్తున్నాయి. బాల్య వివాహం నిరోధక చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేయకూడదు, అలా చేస్తే అది చట్టరీత్యా నేరం. UNICEF నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల లో మూడవ వంతు భారతదేశంలో జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నివేదికను UNICEF ప్రస్తావించింది. జాతీయ నేర గణాంకాల శాఖ నివేదిక ప్రకారం బాల్య వివాహ కేసులు 2023లో ఆరింతలు వరకు పెరిగాయి అని 2022 సంవత్సరంతో పోల్చుకుంటే తెలుస్తుంది. బాల్యవివాహాలకు కారణాలు పేదరికం పేదరికం కుటుంబంపై ఒత్తిడిని తెస్తుంది. కూడు, గూడు, గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడమే కష్టంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న బాలిక రజస్వల అవ్వగానే వివాహం చేసి పంపించేద్దాం అని అనుకుంటారు.. అలా చేస్తే కుటుంబంపై ఆధారపడి ఉన్న వ్యక్తుల సంఖ్య తగ్గుతుందని భావిస్తూ బాల్యంలోనే వివాహాలు చేస్తున్నారు. నిరక్షరాస్యత UN Population Fund నివేదిక ప్రకారం చదువు లేని బాలికల్లో 48 శాతం మంది ఉన్నారు. అందులో 18 సంవత్సరాల వయసు నిండకముందే వివాహం చేస్తున్నారు.. అయితే ఉన్నత విద్య పొందిన వారిలో కేవలం 4 శాతం మాత్రమే బాలికలు ఉన్నారు. లింగ అసమానత పితృస్వామ్య వ్యవస్థలో బాలికలు బాలురు కంటే తక్కువ అని, కుటుంబంలో వారి పాత్ర గృహిణులు అనే వాదం వల్ల బాల్యవివాహానికి ఇదొక కారణమైంది. నేడు అది ఎంతగానో తగ్గింది, కానీ అక్షరాస్యత లేని కుటుంబాలు గ్రామీణ స్థాయిలో ఎక్కువ ఉండటంలో ఆ ప్రాంతాల్లో అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అది కూడా రూపుమాపాలి, బాలికా విద్యను పెంపొందించాలి. ఇంట్లో ఒక బాలిక చదువుకుంటే ఆ కుటుంబానికే కాదు ఎంతో మందికి వెలుగునిస్తుంది. బాల్యవివాహాలపై కఠినమైన చట్టాలు స్వాతంత్యానికి ముందే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు చేశారు. 1929లో రూపొందించిన సర్దా చట్టం ప్రకారం ఆడవారికి వివాహ వయస్సు 14 సంవత్సరం గానూ, మగవారికి వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. తరువాత, 2006లో బాల్య వివాహ నిరోధ చట్టం వివాహ వయస్సును ఆడవారికి 18 గానూ, మగవారికి 21 గానూ నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలను నిషేధించడానికి, చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నియమిస్తున్నాయి. బాల్య వివాహాలు అరికట్టడానికి, నిషేధించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విధివిధానాలు, పథకాలు ఎప్పటికప్పుడు రూపొందిస్తూనే ఉన్నాయి. జాతీయ మహిళా కమీషన్, జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమీషన్ ( NCPR) బాల్యవివాహాలు నిరోధించడానికి పనిచేస్తున్నాయి. బాల్య వివాహాలను నిషేధించడానికి 1098 హెల్ప్ లైన్ నంబరు కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రం, రాష్ట్ర పథకాలు కేంద్రం ప్రవేశపెట్టిన బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. ఈ పథకం ద్వారా బాలికల్లో విద్యను పెంపొందించి, బాల్యవివాహాలను రూపుమాపటంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. దేశవ్యాప్తంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాల ద్వారా 18 సంవత్సరాలు దాటిన ఆడవారి పెళ్లికి ఆర్ధిక సహాయం అందజేస్తుంది. బాల్య వివాహాలతో నష్టాలు బాల్యవివాహాల వల్ల తల్లి, బిడ్డల మరణాలు పెరుగుతాయి బాల్యం లోనే పెళ్లి చేస్తే శారీరక సమస్యలు వస్తాయి. తల్లుల్లో రక్తహీనత, పోషకాహార లోపం కలుగుతాయి.చదువు లేకపోవడంతో అవగాహన లోపిస్తుంది ఉపాధి ఉండకపోతే ఆర్థిక అవకాశాలు ఉండవు, చివరకి వంట గదికే పరిమితమైపోతారు. దానికి తోడు, గృహహింస, మానసిక సమస్యలకు లోనవుతారు. ఇలాంటి సమస్యలు రాకూడదు అంటే, లింగ సమానత్వంతో ప్రవర్తించి, అందరూ సమానమే అని భావించి బాలికా విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. చట్టాలను బలోపేతం చేసి సమాజంలో అందరి. సహకారంతో బాల్య వివాహాలు అరికట్టాల్సిన అత్యవసరం ఉంది. బాల్యవివాహాలను అరికట్టడం ద్వారా ఐక్యరాజ్యసమితి SDG 5.3 చేరుకోవడంతో పాటు వికసిత్ భారతావనికి చేరుకోవడానికి ఇది సహకరిస్తుంది. 'బాల్య వివాహ రహిత భారత్' లక్ష్యంగా కేంద్రం సమరశంఖం! నేటి బాలలే రేపటి పౌరులు. కానీ, ఆ బాల్యం అజ్ఞానపు, ఆచారాల కోరల్లో చిక్కుకుని చితికిపోతుంటే చూస్తూ ఊరుకోలేం. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర సంకల్పంతో ముందుకు వచ్చింది. బాల్యవివాహాలను అరికట్టే ఒక సామాజిక చైతన్య ఉద్యమం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాల ఆధారంగా, జాతీయ సగటు కంటే ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మార్పు తీసుకురావాలని కృషి చేస్తుంది. అందరి భాగస్వామ్యంతోనే ఫలితాలు బాల్యవివాహాలు అరికట్టడానికి కేంద్రం చేస్తున్న ఈ కార్యక్రమంలో పోలీసు, న్యాయ వ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ (SLSA & DLSA) బాల్య వివాహాల నిషేధ ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పారా-లీగల్ వాలంటీర్లు, జిల్లా స్థాయి ఆశా (ASHA) కమిటీలు నిరంతరం బాల్య వివాహాలు జరగకుండా నిఘా పెడుతున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు (ANM), ఆశా వర్కర్లతో పాటు, ప్రైమరీ హెల్త్ సెంటర్ల (PHC) లోని మెడికల్ ఆఫీసర్లు, శిశు ఆరోగ్య అధికారులు (RCH) ఈ ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నాయి. బాల్య వివాహాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, అనర్థాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. బాల్య వివాహం జరుగుతుందంటే ఇరు కుటుంబాలతో పాటు అందుకు సహకరిస్తున్న వ్యవస్థలూ కారణమే. అందుకే కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం పెళ్లి జరిపే వారు, బ్యాండ్ పార్టీలు, డెకరేటర్లు, ఫంక్షన్ హాల్ యజమానులు, కేటరింగ్ వాళ్ల నుంచి ప్రభుత్వం లిఖితపూర్వక హామీలను తీసుకుంటోంది.. ఈ హామీ పత్రంలో తాము ఏ పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలకు సహకరించబోమని వారు సంతకాలు చేయాల్సి ఉంటుంది. మత గ్రంథాల సాక్షిగా నైతిక బోధన! మతగురువులు కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ మత గ్రంథాల్లో ఉన్న బాల్య సంరక్షణ, మహిళా గౌరవానికి సంబంధించిన సూక్తులను కోట్ చేస్తూ ప్రసంగాలు చేయాలని సూచించింది. గ్రామీణ స్థాయిలో ఉన్న పంచాయతీల నుండి, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ కౌన్సిలర్ల వరకు ఈ ప్రచారానికి సారథ్యం వహిస్తారు. మీడియా సంస్థలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ (CSOs) కేవలం వార్తలను ప్రసారం చేయడమే కాకుండా, ప్రతిజ్ఞా కార్యక్రమాలను స్వయంగా నిర్వహించే స్టేక్ హోల్డర్లుగా మారాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చెక్ లిస్టులు, రిపోర్టింగ్ ఫార్మాట్లు, లోగోతో కూడిన వస్తువులను పంపిణీ చేస్తోంది. మార్పు మన ఇంటి నుంచే ప్రభుత్వం నిధులు ఇచ్చింది, చట్టాలను పటిష్టం చేసింది. వ్యవస్థలను సమన్వయం చేసింది. కానీ, నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది? ఏ రోజైతే ఈవెంట్ ఆర్గనైజర్ తన వద్దకు వచ్చిన పెళ్లి ఆర్డర్ లో వధువు వయస్సు తక్కువ అని తెలిసి 'నేను చేయను' అని తిరస్కరిస్తాడో.. ఏ రోజైతే పక్క ఇంట్లో బాల్య వివాహం జరుగుతుంటే ఫిర్యాదు చేసి ఆపుతాడో.. అప్పుడే 'బాల్య వివాహ రహిత భారత్' సాధ్యమవుతుంది. బాల్యంలో చదువుకుని ఎదగాలి కానీ, పెళ్లిచేసుకుని వంటగదిలోనో మగ్గిపోకూడదు. మన దేశంలోని ప్రతి బాలిక స్వేచ్ఛగా బడికి వెళ్లే వాతావరణాన్ని కల్పిద్దాం. బాల్యాన్ని కాపాడుకుందాం.. భారత భవిష్యత్తును నిర్మిద్దాం! ఆధారం: మన బడి మాస పత్రిక