అనగనగ ఒక అడవిలో ఓ కోతి పిల్ల ఉండేది. అడవిలో చెంగుచెంగున గెంతే లేడికూనను, పురివిప్పి ఆడు నెమలిని, రెమ్మల మీద పల్టీలు వేసే రామచిలుకను, పువ్వుల మీద ఎగిరే సీతాకోక చిలుకను చూసినప్పుడు ఆ కోతి పిల్ల సిగ్గుతో బిక్కచచ్చిపొయేది. వాటి అందం ముందు తానెంతో అని బెంగ పడిపోయేది. ఓ రోజున దానికి ఓ అందమైన దేవకన్య కనిపించింది. ఆమె అడవిలో కనిపించిన అందమైన పువ్వులను కోసుకుంటోంది. ఆమె తల మీద చిన్న రత్న కిరీటం జిగేలున మెరిసిపోతోంది. అలాంటి కిరీటం క్తనకుంటే అందమంతా తనదే కదా అనుకుంది కోతిపిల్ల. ఆమె దగ్గరకు వెళ్ళి అక్క ఆ కిరీటం నాకిస్తావా అని ప్రాధేయపడింది. డానికి ఆమె సరే ఇస్తాను కాని కిరిటానికి బదులుగా నీ తోక నాకిస్తావా అని అడిగింది. దానకి కోతి సరే అని ఒప్పుకుంది. దేవకన్య కిరీటం కోతికిచ్చింది. అలాగే కోతి తోకను లాగి తన పూల సజ్జతో పెట్టుకుంది. కోతి రత్న కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని అడవిలో పరుగులుతిసింది. ఆ కిరిటాన్ని చూడటానికి అడవిలోని జంతువులన్నీ వచ్చాయి. వాటిని చూసి కోతి ఇప్పుడెలా వున్నాను? అంటూ కోతి గర్వంగా తల ఎగరేసింది. అది సరే నీ తోక ఎమైపోయింది? అని అడిగాయి జంతువులు, పక్షులు. కిరీటం కోసం తోకను ఇచ్చేశా అంది కోతి. నీ తెలివి తెల్లారినట్టే. రోజుకో కిరీటం పెట్టుకున్నా ని తోకకు సాటి వస్తుందా? అని ఈసడించుకుంటు అవన్నీ వెళ్ళిపోయాయి. అలా జంతువులన్నీ వెళ్ళిపోయేసరికి ఎలాగైన తన తోక తిరిగి సంపాదించాలని దేవకన్య వెతికి పట్టుకుంది. అక్క నీ కిరీటం నీవు తీసుకో నాతోక నాకిచ్చేయి! అని బతి మాలింది. దేవకన్య వెంటనే దాని తోకను ఇచ్చేసింది. పైకెత్తి నిలుపుకున్న తోకతో పరుగులు తీస్తున్న కోతి పిల్లను దారిలో సీతాకోకచిలుక, రామ చిలుక, నెమలి లేడికూన పలకరిచాయి. రత్న కిరీటం లేకపోతేనేం? నువ్వు ఇప్పుడెంత ముద్దోస్తూన్నావో తెలుసా? అన్నాయి. ఆ మాటలు విని కోతి పిల్ల సంబరపడిపోయింది. ఇప్పుడు దానికి ఏ బెంగాలేదు. ఆధారం: జి. సురేశ్