అనగనగా ఒక వూరిలో పిచ్చయ్య, పుల్లమ్మ అనే పిసినారి దంపతులు ఉండేవారు. వారు ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎవరికీ ఏమి పెట్టేవారు కాదు. తింటే ఖర్చవుతుందని కడుపునిండా తినేవారూ కాదు. ఒకానొక రోజు పిచ్చయ్యకు పొరుగూరు వెళ్ళాల్సిన పని వచ్చింది. బస్సులో వెళితే ఖర్చవుతుందని నడిచి వెళ్ళాలనుకున్నాడు. పగలు వెళితే అందరూ చూస్తారని, బస్సులో వెళ్ళొచ్చు గదా! అంటారని మన పిచ్చయ్య చీకటి పడ్డాక నడిచి బయలుదేరాడు. ఇంటిలో భార్య పుల్లమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరీ బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళిన పిచ్చయ్యకు చిన్న అనుమానం వచ్చింది. అరె ! నేను అన్ని జాగ్రత్తలు చెప్పాను కానీ దీపాన్ని ఎక్కువ సేపు వుంచకుండా, అన్నం తినగానే ఆర్పివేయమని చెప్పలేదుగదా! అయ్యో! తెల్లవార్లూ దీపం వెలిగితే ఎంత కిరోసిన్ వృధాగా ఖర్చవుతుంది అని అనుమానం వచ్చింది పుల్లయ్యకు. వెంటనే వెళ్ళి తన భార్యకు హెచ్చరిక చేయాలనుకొన్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వెనుకకు మళ్ళాడు పిచ్చయ్య. ఇంటికి వేగంగా వచ్చిన పిచ్చయ్య ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుండి “ఎవరు?” అని కేకేసింది పుల్లమ్మ, “ఏమేవ్! నీకో ముఖ్య విషయం చెప్పాలి. తలుపు తియ్యి” అన్నాడు. అదేందో అక్కడి నుంచే చెప్పు తలుపులు తీయడం, వేయడం, వల్ల బందులు అరగిపోతాయి కదా! అంది పుల్లమ్మ. పిచ్చయ్య తన భార్య పొదుపును చాలా సంతోషించాడు. “బాగానే ఉంది కాని నువ్వు భోజనం చేయగానే దీపాన్ని ఆర్పివెయ్యి లేక పోతే ఎంతో కిరోసిన్ ఖర్చవుతుంది” అన్నాడు. “బాగుంది సంబడం నేను అసలు దీపం ముట్టించలేదు. పొద్దుండగానే అన్నం తిని పడుకొన్నాను గదా” అంది పుల్లమ్మ “అయినా నువ్వు చేసిన పనేమిటి?” అంది పుల్లమ్మ పిచ్చయ్యతో “ఏం చేశాను?” అన్నాడు పిచ్చయ్య. “నువ్వు ఎంతో దూరం నడిచివెళ్ళావుగదా! నీ చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయి. నీకసలు ఆదాచేయడం చేతగాదు” అని ఎగతాళి చేసింది పుల్లమ్మ. “భలే దానివి నేనంత తెలివి తక్కువ వాడిని అనుకున్నావా? నేను చెప్పులు కాళ్ళకేసుకోకుండా చంకన పెట్టుకొని వచ్చాను కదా. ఇంకెక్కడ అరిగి పోతాయి.” అన్నాడు. పిసినారి పిచ్చయ్య “సరే వెళ్ళిరా” అంది పుల్లమ్మ ఎలా వెళ్ళను? కాలులో ముల్లు విరిగింది. అంటూ కూలబడ్డాడు. అలా కాలులో విరిగిన ముల్లు చీము పట్టి గాయమైంది. పుల్లయ్య పనిలేకుండా నెలరోజులు కూర్చోవడమే కాకుండా, ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయలైంది. అవసరాలకు ఖర్చు చేసుకోవడం పొదుపు. పుల్లమ్మ, పిచ్చయ్యల్లా అవసరమైనా ఖర్చు చేయక పోవడం పిసినారి తనం. పిసినారి పిచ్చయ్యకు తగిన శాస్తి జరిగింది కదూ! రచన: ఒ. దత్తాత్రేయులు, మట్టిగుంట, ప్రకాశం