పోల్యా, ఇవాన్ భార్యాభర్తలు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. వాళ్ళ సంసారం ఎంతో ముచ్చటగా వుండేది. అయితే ఇవాన్ కు భార్య గురించి ఒకే కొరత. ఆమెకు చదువురాదు. కనీసం ఆమె పేరు కూడా ఆమె రాయలేదు. ఇవాన్ ప్రభుత్వ ఆఫీసరు. పల్లెటూర్లో ఉండి, పట్టణానికొచ్చి రేయింబవళ్ళు కష్టపడి, రష్యా విప్లవం పుణ్యమా అని ఆఫీసరుగా ఎదిగినవాడు. తన బార్య కూడా తనలాగా చదువుకోవాలని అతని కోరిక. “పోల్యా నువ్వు చదువుకోవాలి. నీ పేరైనా రాయడం నేర్చుకోవాలి అని ముద్దుగా అనేవాడు. ఇప్పుడు నాకు చదువు దేనికి? వయసు మళ్లుతోంది. చేతులు వణుకుతున్నాయి. రాయడం అయ్యేపనేనా? మన పిల్లలు చక్కగా చదువుకొంటారులెద్దూ” అని పోల్యా తప్పించుకునేది. ఇవాన్ క్షణం తీరికలేని ఉద్యోగి. వెంటబడి భార్యకి చదువు నేర్పే తీరిక ఆయనకు లేదు. అందుకని ఊరుకుండి పొయ్యాడు. కాలం దొర్లిపోతోంది. ఒకరోజు ఇవాన్ ఒక ముచ్చటైన పుస్తకం తెచ్చాడు. “పోల్యా ఇది నీకోసమే తెచ్చాను. దీంతో నీకు నువ్వే చదవడం నేర్చుకోవచ్చు. అంత గొప్పగా కొత్త పద్ధతులతో రాశారు దీన్ని. కొంచెం నా దగ్గర కూర్చో దీంతో ఎలా చదువు నేర్చుకోవచ్చో చెబుతా” అని ఇవాన్ పుస్తకం పోల్యా చేతికిచ్చాడు. “పోల్యా పక పక నవ్వింది. నవ్వుతూ పుస్తకం చేతికి తీసుకుంది. అటూ ఇటూ తిప్పింది. తీసుకెళ్లి షెల్ఫులో పెట్టింది. మన మనవళ్లకి పనికిరావచ్చు అన్నట్టుంది ఆమె వాలకం. పాపం ఇవాన్ ఏంచేస్తాడు, చిన్నబుచ్చుకోవడం తప్ప. ఒకరోజు పోల్యా ఇవాన్ చొక్కా జేబు చినిగిపోతే కుట్టడానికి కూచుంది. జేబుతాకగానే ఆమెకి అందులో ఏదో వున్నట్టనిపించింది. డబ్బులేమన్నా మరిచిపోయ్యాడా? అని తీసి చూసింది. అది ఓ అందమైన కాగితం. అంతకన్నా అందమైన ముత్యాల్లాంటి చేతిరాతతో మంచి సెంటువాసనతో గుభాళిస్తున్న కాగితం. ఆ కాగితం ఓ బ్లూకవర్ లో పెట్టివుంది. దాన్ని చూడగానే పోల్యా ముఖం వాడిపోయింది. ఇవాన్ ఎవరి ప్రేమలోనైనా పడ్డాడా? ఆమె ఈయన ప్రేమ లేఖలు రాసుకొంటున్నారా? చదువురాని నాతో మాటిమాటికీ చదువుకో చదువుకో అంటూ పరాచికాలాడ్డం, ఇలాంటి చదువుకున్న ప్రేయసి వల్లో పడి చేస్తున్న పనేనా? పోల్యాకి అనుమానం పెనుభూతమై పట్టుకుంది. అందులో ఏముందో చదువుదామంటే ఆమెకు చదవడం రాదాయె. మొదటిసారి చదువంటే ఎంత విలువైందో ఆమెకు తెలిసొచ్చింది. తాను చదువుకోనందుకు తల్లడిల్లిపోయింది. పోల్యా మనసు మనసులో లేదు. ఇలా అయితే తనేం కావాలి? తన సంసారం ఏంకావాలి? తన బతుకుంతా చీకట్లు కమ్ముకోవడమేనా? మళ్ళీ తాను పల్లెటూరికెళ్ళి పొలంపని చెయ్యాల్సి వస్తుందా ఏమిటి తలచుకొంటేనే ఆమె వణికిపోతోంది. తన స్థానంలోకి మరొకర్ని ఇవాన్ తెచ్చుకోవడమనే ఆలోచనే ఆమెను నిలువునా దహించేస్తోంది. అవును ఈ మధ్య ఇవాన్ కొంచెం ఫ్యాషన్ గా మారుతున్నాడు. ఇందుకే కాబోలు అనిపించిందామెకు. ఉత్తరాన్ని ఎవరిచేతనైనా చదివించుకుందామంటే పరువుపోతుందని భయమాయె. పోల్యా ఆ ఉత్తరాన్ని దాచిపెట్టింది. చొక్కాకుట్టడం పూర్తి చేసింది. ఇవాన్ సాయంత్రం వచ్చాడు. ఏమీ జరగనట్టే నాకు చదవడం నేర్చుకోవాలని ఉంది ఇవాన్. చదువురాని మొద్దుగా వుండాలంటే సిగ్గుగా వుంది. అని భర్తతో అంది. ఇవాన్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు. తన భార్యకు ఎంత కాలానికి ఇంత మంచి ఆలోచన వచ్చింది. శభాష్ నేనే నీకు చదవడం రాయడం నేర్పుతా సరేనా అంటూండగానే పోల్యా పుస్తకం తీసుకొచ్చింది. రెండు నెలలు గడిచాయి. ఈ రెండు నెలలూ పోల్యా పదాలు చదివింది. అక్షరాలు నేర్పుకుంది. వాక్యాలు కూడబలుకుతోంది. దాచి పెట్టిన ఉత్తరాన్ని తీసి ప్రతి రోజు చదవడానికి ప్రయత్నించేది. అది చేతిరాతగదా అర్థమయ్యేదికాదు. మరో నెల కూడా గడిచింది. ఇవాన్ పని కెళ్ళగానే తలుపేసి పోల్యా ఉత్తరం చదవటానికి తీసింది. ఉత్తరంలోంచి ఇంకా సెంటు వాసన వస్తూనే వుంది. పోల్యా కూడి కూడి మెల్లగా చదువుతోంది. ఈ ఉత్తరం ఇవాన్ కి రాసిందే, ఇదే అందులోని విషయం. ప్రియమిత్రుడా! నేను చెప్పినట్టు ఈ పుస్తకం పంపిస్తున్నాను. రెండు మూడు నెలల్లో నీ భార్య దీంతో చదవడం నేర్చుకొంటుందని నా నమ్మకం. నువ్వు ఆమెకి తప్పకుండా చదువు నేర్పాలి సుమా! కొంచెం ఓపిగ్గా నచ్చచెప్పు. చదువురాకపోవడం ఎంత నష్టమో, ఎంత అవమానకరమో తెలియజెప్పు. రష్యా విప్లవ వార్షికోత్సవం నాటికి మనం సోవియట్ యూనియన్ లోని ప్రజలందరికీ చదువు నేర్పాలని నిర్ణయించాం. అందరికీ నేర్పుతున్నాం గానీ మనకి ఆప్తులైన వారిని మాత్రం మరిచిపోతున్నాం. మిత్రమా! నువ్వలా చెయ్యొద్దు. నీ భార్య తప్పకుండా మూడు నెలల్లో చదువునేర్చుకోవాలి. సరేనా! ప్రేమతో, మేరియా బ్లోకినా. ఒక్కో వాక్యం పూర్తయ్యే కొద్దీ పోల్యా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతున్నాయి. పెదాలు పంటితో వొత్తుకొంటూ కన్నీళ్ళు తుడుచుకొంటూ పోల్యా ఆ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకొంది. గుండెలకి హత్తుకొంది. రష్యన్ మూలం :మిఖైల్ జూస్కెంకో స్వేచ్ఛానువాదం : వి. బాలసుబ్రమణ్యం