విజయనగరం సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న రోజులవి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని మంచి పరిపాలన అందించడానికి మారు వేషంలో మహామంత్రి తిమ్మరుసుతో కలిసి రాయలు దేశ సంచారం చేసేవారు. ఒకసారి ఆంధ్ర ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తోందనీ, రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వేగుల ద్వారా సమాచారం అందింది. రాయలు తన మంత్రి తిమ్మరుసు గారితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకోవాలని చెరొక గుర్రంపై బయలుదేరారు. పచ్చని చెట్లనీడలో గుర్రాలు దౌడుతీస్తుంటే సూరీడు నిప్పులు చెరుగుతున్నా చల్లగానే ఉంది. దారిలో అనేక పల్లెలు పచ్చని పైర్లతో కళకళలాడుతూ మనస్సును సేద దీరుస్తున్నాయి. చెట్లనే పండిన మామిడి పండ్లు తింటూ దిగుడుబావుల్లోని నీరు త్రాగుతూ ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్నమయింది. తాము చేరుకున్న పరిసరాలు పల్లెలు రాయలవారికి కొంత భిన్నంగా కనిపించాయి. నీరులేక ఎండిన పైర్లు, కీటకాలు, తెగుళ్ళ బారిన పడిన పత్తిచేలు, ఎక్కడా ఒక్క చెట్టుకూడా కనిపించకుండా, చదునుగా ఉన్న పొలాలతో ఆ పల్లెలు ఎడారిని గుర్తుచేస్తున్నాయి. రాయలవారు తిమ్మరుసుతో మహామంత్రీ మిగతా పల్లెలన్నీ పచ్చగా కళకళలాడుతూ, ప్రజలంతా సంతోషంగా ఉంటే ఈ ప్రాంతవాసులు ఇలా ఎందుకున్నారు ? అడిగాడు. దానికి తిమ్మరుసు మహారాజు 5,6 ఏళ్ళ క్రితం వరకు ఈ పల్లెప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉండేవారు. తాము సంపాదించిన ధనంతో ఆడంబరాలు పెంచుకొన్నారు. చేపలు, రొయ్యల గుంటలకోసం భూగర్భజలాలను తోడేశారు. బావులన్నీ ఎండిపోయాయి. చేతిలో ధనం బాగా ఉండటంత చేను చదరంగా ఉండాలని ప్రతిరైతూ తన పొలంలోని చెట్టన్నీ కొట్టేసాడు. దీంతో కాకులు, గద్దలు, కొంగలు లాంటి పిల్లలు వాలడానికి ఒక చెట్టు గానీ కొమ్మగానీ మిగల్లేదు అన్నాడు. పిట్టలు వాలకపోతే ఏమిటి నష్టం అన్నారు రాయలవారు. దానికి మంత్రి “మహారాజా ప్రకృతిలో చెట్లు వాటిని ఆశ్రయించి వుండే పక్షులు, కీటకాలు సహజ సిద్దమైన యంత్రాంగం. పంట మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను పక్షులు తమ ఆహారంగా భుజిస్తాయి. పంటలకు మేలు చేస్తాయి”. ఈ పక్షులు వాలడానికి చెట్లు లేకపోవడంతో ఈ ప్రాంతంలోని పంటలన్నీ తెగుళ్ళ బారిన పడ్డాయి. తెగుళ్ళ నుండి రక్షణకు విపరీతంగా పురుగు మందులు వాడారు. దీంతో విషాహారం తిని పిచ్చుకలు రాబందులు, పావురాలు, కలివికోడి, బట్టమేకలాంటి పక్షిజాతులెన్నో అంతరించిపోయాయి. పంటలు బెబ్బతిని పల్లెవాసుల ఆదాయం పడిపోయింది. అలవాటైన విలాస జీవితం వదులుకోలేక దాని కోసం అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోనేదశకు చేరారు. పచ్చని చెట్లు లేకపోవడంతో వర్షం కురవక కరువు తాండవమాడుతోంది.” అన్నాడు. “మహామంత్రీ ఈ పరిస్థితులు చక్కదిద్దడానికి మనం ఏంచేయాలి ?” అన్నాడు రాజు. ఈ ప్రాంత రైతులు తప్పని సరిగా చెట్లను ఎక్కువ సంఖ్యలో పెంచాలి. చేపల చెరువుల సాగు తగ్గించుకోవాలి. వర్షపునీటి నిల్వ చేసుకొని వ్యవసాయ అవసరాలకు వాడుకోవాలి. అన్నాడు మహామంత్రి. “కరువు నివారణకు అవసరమైన తాత్కాలిక చర్యలతో బాటు, శాశ్వత నివారణకు ఆ ప్రాంతంలో చెట్లను పెంచాల్సిందిగా, రాజోద్యోగులను ఆజ్ఞాపించండి.” అన్నారు రాయలవారు. రచన: ఎం. హరిప్రసాద్, నెల్లూరు.