ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు. ఆ తండ్రికి చాలా చెడు అలవాట్లు వుండేవి. అతను జూదం ఆడుతూ, సిగరెట్స్, మద్యం తాగుతూ వుండేవాడు. అతను మద్యం సేవించి దుర్భాషలాడుతూ తన భార్యను, పిల్లలను కొడుతూ వుండేవాడు. 20 సంవత్సరముల తరువాత ఆ ఇద్దరు పిల్లలూ పెరిగి పెద్దవారయ్యారు. అందులో పెద్దవాడు జూదం ఆడుతూ, సిగరెట్సు తాగుతూ తన భార్యను, పిల్లలను కొట్టేవాడు. చిన్న కొడుకు మాత్రం అన్నీ మంచి అలవాట్లతో సంఘంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా అందరి మన్ననలను అందుకుంటూ నివసిస్తూ వుండేవాడు. ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబం ఒకే వాతావరణం నుంచి వచ్చినా ఎంత తేడాతో ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని ఒక జర్నలిస్ట్ వారిద్దరిని ఇంటర్వూ చేయాలనుకుంటాడు. మొదటగా పెద్దవాడిని మీరు ఇలా తాగుతూ, జూదం, ఆడటానికి కారణం ఏమిటని అడగగా, దానికి మా తండ్రిగారే బాధ్యుడు. మా తండ్రి రోజూ తాగి వచ్చి మా అమ్మను, నన్ను నా తమ్ముడిని కొడుతూ వుండేవారు. ఆయన సంరక్షణలో పెరిగిన నాకు ఆయన అలవాట్లే వచ్చాయి అని చెప్పాడు. తరువాత చిన్నవాడి దగ్గరకు వెళ్ళి మీరు సంఘంలో ఇంత పేరు ప్రతిష్టలతో, ఆనందంగా ఎలా జీవిస్తున్నారు అని అడగ్గా, దీనికి ఒక విధంగా మా తండ్రిగారే బాధ్యుడు అని బదులిస్తాడు. ఆ జర్నలిస్టు ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు. “చిన్నతనంలో మా తండ్రిగారు అన్ని రకాల దుర్వ్యసనాలతో గడుపుతూ తాగివచ్చి మా అమ్మను, మా అన్నయ్యను, నన్ను కొట్టేవాడు” అపుడే నేను ఒక ధృడమైన నిశ్చయానికి వచ్చాను. “నేను మాత్రం మా నాన్నలాగా జీవించకూడదు” చూశారా! అతను తీసుకున్న ఆ నిర్ణయమే అతనిని సంఘంలో పేరు, ప్రతిష్టలు వున్నవాడుగా తయారవటానికి దోహదం అయింది. మనము దీని నుంచి నేర్చుకోవసినది ఏమిటంటే ప్రతి మనిషిలోను, ప్రతి సంఘటనలో కొన్ని +ve అంశాలు, కొన్ని-ve అంశాలు వుంటాయి. అయితే మనము దానినుంచి ఏమి గ్రహిస్తున్నాము అనేది ముఖ్యము. మనము +ve అంశాలను మాత్రమే గ్రహించాలి. ఒక మనిషికి అతని స్నేహితుడు ఒక గుర్రమును బహుమానంగా ఇచ్చాడు. ఇస్తూ ఆ గుర్రమునకు వున్న ప్రత్యేకతను కూడా వివరించాడు. దాని ప్రత్యేకత ఏమిటంటే, మిగతా గుర్రాల వలె కళ్ళెము పట్టుకుంటే ఆగటం మరియు కొడితే పరిగెట్టడం చేయదు. ఇది “Oh my God” అంటే పరుగెత్తుతుంది. “Thank you God” అంటే ఆగిపోతుంది. ఆ మనిషి దానిపైన కూర్చుని “Oh my God” అంటాడు. అది పరుగు తీయటం ప్రారంభించింది. మరలా “Oh my God” అనగా దాని వేగం ఇంకా పెరిగింది. ఇలా తను “Oh my God” అన్న ప్రతిసారి దాని వేగం పెరుగుతూ వుంది. ఈ ఆనందంలో ఆ గుర్రం ఎటు వెళుతుందో కూడా గమనించలేని స్థితిలో వుంటాడు. ఈ గుర్రం విపరీతమైన వేగంతో ఒక కొండ మీదకు పరుగెత్తుతూ వుంది. కొద్ది సేపటితకి అతను గమనించే సరికి కొండ చివరి భాగమునకు చేరుకుంది. అపుడు భయంతో దానిని ఆపుదామని కళ్ళాలు పట్టుకొని లాగాడు. అది ఆగకుండా అలాగే పరిగెత్తుతూ వుంది. ఈ భయంలో అతనికి “Thank you God” అన్న పదం గుర్తుకు రావటం లేదు. కొండ చిట్ట చివరికి వెళ్ళే సమయానికి ఆ పదం గుర్తుకు వచ్చి గట్టిగా “Thank you God” అని అరుస్తాడు. అది sudden break వేసినట్లుగా ఆగిపోతుంది. అపుడు అతను కొంచెం ముందుకి వంగి చూస్తే పెద్ద లోయ కనిపిస్తుంది. ఆ లోయను చూచి భయంతో “Oh my God” అంటాడు. ఆ తరువాత ఏమి జరిగి వుంటుందో మీరు ఊహించుకోవచ్చు... రచన: దొడ్డిగర్ల వరప్రసాద్, తండ్రి బాలశౌరి, వైరా.