జార్జియా యూనివర్సిటీ అధ్యయనం ఈ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మనం వాడుతున్న ప్లాస్టిక్‌లో చాలా వరకు భూమిలో కరిగిపోవడం లేదు. చెత్తగా పారేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయేందుకు కొన్నివేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ విపరీత పరిణామాల కారణంగా భూమి ప్లాస్టిక్ గోళంగా మారిపోతోందని అమెరికాలోని జార్జియా యూనివర్సిటీ ఓ అధ్యయనంలో తేల్చింది. 1950 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ఇందులో 630 కోట్లటన్నుల ప్లాస్టిక్ చెత్త రూపంలో భూమి మీద పేరుకుపోయింది. ప్లాస్టిక్ చెత్తలో 9 శాతాన్ని రిసైక్లింగ్ చేయగా, 12 శాతాన్ని కాల్చివేశారు (incinerated). అంటే వృధాగా ఉన్న ప్లాస్టిక్‌లో 79 శాతం గోతుల్లో (land fills) ను పర్యావరణంలోను పేరుకుపోయి కాలుష్యాన్ని కలిగిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 1200 కోట్ల ప్లాస్టిక్ చెత్త పోగుపడిపోతుందని, ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు, చెత్త యాజమాన్య పద్ధతులను గురించి త్రీవంగా ఆలోచించాలని జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జెన్నా జంబెక్ పేర్కొన్నారు.