కుండకుంభమండ్రు కొండ పర్వతమండ్రు ఉప్పులవణమండ్రు ఒకటిగాదె భాషలింతెవేరు పరతత్వమొక్కటే విశ్వదాభిరామ! వినుర వేమ! తెలుగులో 'కుండ' అనే దానిని సంస్కృతంలో ‘కుంభం' అని, తెలుగులో 'కొండ' అనే దానిని సంస్కృతంలో 'పర్వతం' అని, తెలుగులో ఉప్పు అనే దానిని సంస్కృతంలో 'లవణం' అని అంటున్నారు. భాషలే వేరుగాని, వాటి అర్థం ఒక్కటే. కులాల మధ్య మతాల మధ్య ఎక్కువ తక్కువలు చూసే వాళ్ల దృష్టి భాషల మీదికి పోయింది. భాషలలో కూడా ఎక్కువ తక్కువలు చూడడం మీద వేమన విమర్శ పెట్టాడు. ప్రాచీన కాలంలో సంస్కృతం మిగతా భాషల మీద పెత్తనం చేస్తూ ఉండేది. సంస్కృత సాహిత్యానికి చక్రవర్తులు, రాజులు పెద్ద పీట వేశారు. గౌతమబుద్దుడు మాత్రం ప్రాస్వతానికి ప్రాధాన్యమిచ్చాడు. ప్రాచీన తెలుగు కవులు సంస్కృత సాహిత్యాన్ని అనువాదం చేసిన వాళ్లే ఎక్కువ. వేమన అనువాద కవి కాదు. సంస్కృత భాష మీద ఉన్న వ్యామోహం ఎక్కడి దాకా పోయిందంటే, సంస్కృతం అన్ని భాషలకు తల్లి అనేంతవరకు పోయింది. సంస్కృతం ఏ భాషకూ తల్లికాదు. అయితే రాజగౌరవం పొందడం వల్ల సంస్కృతం ఆధిపత్య స్థానంలో నిలిచింది. వేమన తన కాలంలో తెలుగు భాష పట్ల పండితవర్గంలో చులకన భావం ఉండటం గమనించి ఈ పద్యం రాశాడు. 'కూడు' అంటే నవ్వుతారు. 'అన్నం' అంటే గౌరవిస్తారు. ఇలాగే తెలుగు మాటలు వాడిన వాడిని తక్కువగా చూడడం, సంస్కృత పదాలు వాడిన వాడిని ఎక్కువ చూడడం మీద విమర్శ వేమన పద్యం. ఇవాళ ఆంగ్ల పదాలు వాడడం ఒక ఆధిపత్యగా ఉందికదా! ‘ప్రేక్షకులకు నమస్కారం' అంటే చాదస్తం. 'హాయ్ వ్యూయర్స్’ అంటే ఆధునికం. 'చూస్తూనే ఉండండి' అంటే చాదస్తం. ‘కీప్ వాఛింగ్’ అంటే ఆధునికం. ‘ఇప్పుడు కాసేపు విరామం' అంటే చాదస్తం, 'ఎ షార్ట్ బ్రేక్’ అంటే ఆధునికం. ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు. ఏ భాష అయినా, భాష ప్రయోజనం అభిప్రాయ ప్రకటన. ఎవరి భాషలో వాళ్లు తమ అభిప్రాయాలను సహజమైన పద్దతిలో వ్యక్తం చేయవచ్చు. ప్రతి భాషలోను తనదైన సొగసు ఉంది. ఏ భాషా ఇంకో భాషకన్నా తక్కువది కాదు. ఎక్కువది కాదు. భాషలలో ఎక్కువ తక్కువలు చూడడం కేవలం అజ్ఞానం. ‘పర్వతారోహణం' అనే మాట ఏ అర్థాన్ని చెబుతున్నదో ‘కొండెక్కడం' అనే మాట కూడా అదే అర్థాన్ని చెబుతున్నది. తెలుగులో ఉప్పు అనే దానిని ప్రపంచ భాషలలో ఎన్నో పేర్లుంటాయి. అవన్నీ ఒకటే. 'లవణం' అనేది గొప్పదైపోదు. అందువల్ల భాషల మధ్య మనం హెచ్చుతగ్గులు చూడడం మానుకోవాలి. వేమన సాంస్కృతికమైన ముందు చూపునకు ఈ పద్యం నిదర్శనం. ఆధారం: ప్రొ. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి