నేడు కాఫీ త్రాగడం మన నిత్య జీవితంలో ఓ భాగంగా మారింది. చాలా మంది ఓ కప్పు కాఫీ త్రాగడంతోనే తమ దిన చర్య మొదలెడతారు. కాఫీ చెట్ల గింజలను బాగా వేయించి మర ఆడిస్తే కాఫీ పొడి తయారువుతుందని మనందరికీ తెలుసు. కాపీ చెట్టు శాస్త్రీయనామం కఫియా అరాబికా. మన దేశంలో కాఫీ గింజల ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో వుంది. కాఫీ గింజల్లో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. కాఫీ తాగినప్పుడు ఈ కెఫిన్ మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి, కాస్త హుషారు కలిగిస్తుంది. కొంత మంది ఈ కెఫిన్ కు బానిసగా మారి పొద్దస్తమానం కాఫీ తాగుతూనే వుంటారు. పిల్లలు, గర్భవతులు ఈ కాఫీకి దూరంగా వుండాలని, నిపుణులు హెచ్చరికలు చేస్తున్నా పిల్లల కోసం కాఫీ బైట్స్ (చాక్లెట్) మార్కెట్ లోకి వచ్చేశాయ్. ఇటీవల సినిమాలను కూడా కమ్మని కాఫీలాంటి సినిమా అని పొగడటం మనం వింటున్నాం. ఇంతగా ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ గురించి ప్రచారంలో వున్న ఓ కథను మనం తెలుసుకుందాం. మొట్టమొదట కాఫీ రుచిని తెలుసుకున్నది అరబ్ దేశానికి చెందిన ఒక మేక అంటే ఆశ్చర్యంగా లేదూ... సౌదీ అరేబియా కు చెందిన హాల్దీ అనే యువకుడు తన మేకలమందను తోలుకొని అడవికి వెళ్ళాడు. తన మేకలు పేరు తెలియని చెట్టుకు కాసిన చెర్రీలాంటి ఎర్రటి పండ్లను తిని విచిత్రంగా ప్రవర్తించడం గమనించాడు. హల్దీ స్వయంగా ఆ పండ్లను రుచి చూశాడు. బాగున్నాయనిపించింది. ఇంటికి తీసుకెళ్ళి వాటితో కషాయం తయారు చేసుకొని తాగారు. ఆ రాత్రి చాలా పొద్దు పోయే వరకు హల్దీకి నిద్ర రాలేదు. హల్దీ తన అనుభవాలను ఒక ముస్లిం భక్తునికి ముడిపెట్టాడు. ఆ ముస్లిం ఒకనాడు ప్రార్థనలు చేస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త అతనికి కలలో కనిపించి హల్దీ దగ్గర చెర్రీలున్నాయి. వాటిని నీటిలో మరిగించి ఆ ద్రవాన్ని తాగితే ప్రార్థనలు జరిపే వారు మెలుకువగా వుంటారనీ చెప్పాడు. ప్రవక్త చెప్పినట్లు ఆ భక్తుడు ఆచరించాడు. దీంతో ఆ కషాయం పేరు ఇస్లాం ప్రపంచంలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. అరబ్ లు ఈ కషాయాన్ని ‘వైన్ ఆఫ్ అరబ్బీ’గా పిలిచేవారు. అరబ్బీలో వైన్ ను ‘కఫే’ అనేవారు. అదే ఇంగ్లీషు భాషలో క్రమంగా ‘కాఫీ’గా మారింది. రెడ్ చెర్రీల్లో ఆకుపచ్చని గింజలుంటాయనీ వాటిని ఎండబెట్టి వేయించి పొడిచేసి నీటిలో కలిపి వేడి చేసి తాగవచ్చని 16వ శతాబ్దం నాటికి అరబ్బులు కనుగొన్నారు. వీరు ఆ కషాయాన్ని మట్టి కుండలలో నిల్వ వుంచి తాగేవారు. ప్రముఖ మత నాయకులు కాఫీ మీద నిషేధం విధించినప్పుటికీ మహమ్మద్ అనుచరుడైన ఖలీఫ్ ఆప్ కారియో ఆ నిషేదాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే ఆయనకు కాఫీ అంటే చాలా ఇష్టం. 17వ శతాబ్దంలో ఐరోపా వర్తకులు ఈ పానీయాన్ని ప్రపంచమంతా విస్తరింపజేసారు.