ఒకానొక రాజుగారికి చదరంగం అంటే చెప్పలేనంత ఇష్టంగా ఉండేది. ఎవరితో పడితే వారితో చదరంగం ఆడేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండేవారు. అయితే ఎన్నెళ్ళు గడిచినప్పటికీ చదరంగంలో ఏ ఒక్కరు అతనిని ఓడించలేకపోయారు. ఎలాగైతే చివరకు ఒక ముసలి ఫకీరు రాజుగారిని ఆ ఆటలో ఓడించాడు. ఎన్నో సంవత్సరాలుగా ఓటమి అనేది తెలియని రాజుగారికి దాని వలన బాధ కలిగినప్పటికి, అదే సమయంలో ఆ ఫకీరు పట్ల చెప్పలేనంత గౌరవము కలిగింది. “చదరంగంలో నన్ను ఓడించినందుకు నీకో మంచి బహుమతిని ఇవ్వదలిచాను చెప్పు నీకేం కావాలో కోరుకో....” అన్నాడు రాజు. “నేనో ముసలి ఫకీరుని. నాకేం కోరికలుంటాయని మీరా మాట అన్నారు చాలు. అదే పదివేలు”, అన్నాడు ఫకీరు.“అలా అంటే ఎలా కుదురుతుంది. నువ్వు ఏదో ఒకటి కోరు కోవలసిందే. నేను నీ కోరిక తీర్చ వలసిందే”, అన్నాడు రాజు దాదాపు ఆజ్ఞాపించినట్లుగా. రాజు గారి గొంతులో విన్పించిన పొగరుని ముసలి ఫకీరు గుర్తించాడు. ఒక క్షణం ఆలోచించి ఇలా అన్నాడు. “సరే మీరు అంతగా చెబుతుంటే నేనెందుకు కాదనాలి. ఈ చదరంగం ఆటను చూశారుగా ఇందులో మొత్తం 64 గళ్ళున్నాయి. ఒక్కొ గడికి కొన్ని బియ్యపు గింజల చొప్పున నాకు దానంగా ఇప్పించండి. మొదటి గడికి ఒక బియ్యపు గింజ, రెండో గడికి రెండు బియ్యపు గింజలు, మూడో గడికి నాలుగు, నాలుగో గడికి ఎనిమిది, ఐదో గడికి పదహారు, ఇలా ఒక్కో గడికి బియ్యపు గింజల్ని రెట్టింపు చేస్తూ లెక్క కట్టి నాకు కానుకగా ఇవ్వండి”, అన్నాడు ఫకీరు. ‘ఓస్ అంతేనా. ఇదేం కోరికయ్యా? సరేలే రేపు పొద్దున్నే వచ్చి నువ్వు అడిగిన బియ్యపు గింజలు తీసుకెళ్లు. కాని ఒక మాట. ఒక మహారాజుని అడాగాల్సినంత విలువైన కోరికేది నువ్వు అడగలేదు. ఒక విధంగా అది నాకు చాలా అవమానంగా వుంది. ఇంకొంచెం మంచిదేదైనా అడిగివుంటే నేను చాలా సంతోషించేవాడిని”, అన్నాడు రాజు కొంచెం అసంతృప్తిగా, అతని మాటలకు ఫకీరు అదోలా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహారాజు వెంటనే లెక్కల పండితున్ని పిలిపించి లెక్క తేల్చి చెప్పమన్నాడు. లెక్కల పండితుడు వెంటనే ఆ పనిలో మునిగిపోయాడు. గంటయింది..... రెండు గంటలయింది........ అర్ధరాత్రి దాటిపోయింది. అయినా లెక్కల పండితుడు ఇంకా లెక్కలు వేస్తూనే ఉన్నాడు. పాపం ఆ రాత్రంతా అతను నిద్ర పోలేకపోయాడు. తెల్లారగానే లెక్కల పండితుణ్ణి పిలిచి, “ఏం ఫకీరుకి ఎన్ని గింజలివ్వాలి లెక్క తేలిందా?”, అని అడిగాడు మహారాజు. “తేలింది గానీ, అవి చాలా ఎక్కువ మహారాజా”, అన్నాడు పండితుడు. “ఎంత ఎక్కవైనా సరే మన రాజ్యంలో బియ్యానికేమీ కొదువలేదుగా, కాబట్టి అతనడిగింది ఇచ్చేయండి.”, అన్నాడు రాజు. “చిత్తం కాని అసాధ్యం మహారాజా, మన కోటలోని బియ్యం మూటలన్నింటిని కుప్పపోసినా అన్ని గింజలు రావు. కోటలోనివే ఏం కర్మ మన రాజ్యంలోని బియ్యపు మూటల్ని, ఆ మాటకొస్తే అసలు మొత్తం ఈ భూమ్మీద ఉన్న బియ్యం మూటలన్నింటినీ కుప్ప పోసినా అన్నిగింజలు రావు. అంతేకాదు, ఈ నేల మొత్తం సాగు చేసినా అన్ని బియ్యపు గింజలు రావు’, అన్నాడు పండితుడు. “రాజు గారికి నమ్మశక్యం కాలేదు. అసలింతకీ ఆ ఫకీరు ఎన్ని గింజలడిగాడేమిటి?”, అన్నాడు. “చిత్తం ఒక గింజతో మొదలు పెట్టి, బియ్యపు గింజల్ని ఒకో గడికి రెట్టింపు చేస్తూపోతే అరవై నాల్గవ గడిని చేరేసరికి మొత్తం 18,44,744,073,709,551,615 గింజలవుతున్నాయి. అంటే సుమారు ఒక లక్ష కోట్ల టన్నుల బియ్యమన్నమాట”, అని వివరించాడు. లెక్కల పండితుడు. రాజుకి తల గిరగిరా తిరిగినట్లయింది. ఫకీరు ముందు మరోసారి తన ఓటమి ఒప్పుకొని అతనికి క్షమాపణలు చెప్పి పంపించాడు.