చిట్టిపల్లె గ్రామంలోని శరత్, శ్రావణ్ లు ఇద్దరూ ఇరుగు పొరుగు పిల్లలు. ఇద్దరూ మంచి మిత్రులు. ఈ గ్రామానికి 4 కి.మీ.ల దూరంలో వున్న సింగంపల్లి ఊరులోని ఉన్నత పాఠశాలలో శరత్ 9వ తరగతి, శ్రావణ 7వ తరగతి చదువుతున్నారు. ఆ ఊరికి వెళ్లడానికి ఎటువంటి వాహనాలు లేవు. కనుక ప్రతిరోజూ ఇద్దరూ బడికి నడిచి వెళ్లి వస్తూ ఉంటారు. ఏ పని చేసినా, ఎక్కడికెళ్లినా దాదాపు కలిసే వుంటుంటారు. వాళ్లిద్దరిలో శ్రావణ్ చాలా తెలివైన వాడూ, చురుకైన వాడు. కానీ, కాస్త దుడుకు స్వభావం కలవాడు. శరత్ మాత్రం చాలా నెమ్మదస్తుడు. తెలివితో పాటు ఏదైనా నిదానంగా ఆలోచించే గుణం కలవాడు. పైగా, ఏ విషయాన్నైనా నిదానంగా, తార్కికంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవాడు. ధైర్యం కూడా కాస్త ఎక్కువే. ఒక రోజు వాళ్ల పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి నాగార్జునసాగర్ విహారయాత్రకు వెళ్లారు. వారిలో వీళ్ళిద్దరు కూడా వున్నారు. సాగర్ నుంచి సాయంత్రం వచ్చేసరికి సూర్యాస్తమయం అవుతున్నది. కాస్త వెలుతురు వుండడంతో చీకటి పడేలోపు పిల్లలను త్వరగా ఇళ్లకు చేరమని చెప్పి ఉపాధ్యాయులంతా వెళ్లిపోయారు. కానీ, శరత్, శ్రావణ్ లు ఇద్దరూ సాగర్ విషయాల గురించి చర్చించుకుంటూ నిదానంగా నడవసాగారు. ఇంతలో చీకటిపడ్డ విషయాన్ని గమనించిన శ్రావణ్, "అన్నా, చీకటి పడుతోంది. త్వరగా ఇంటికి వెళదాం పద.", అన్నాడు. "ఆ... అలాగే... " అంటూ, ఇద్దరూ వెన్నెల వెలుతురు లో వడివడిగా నడవసాగారు. వాళ్ల ఊరుకి నాలుగు ఫర్లాంగుల దూరంలో వుండగా శ్రావణ్ కు అనుకోకుండా దారి ప్రక్క చింతచెట్టు వైపు చూపు మళ్లింది. వెంటనే “అమ్మో! దెయ్యం! దెయ్యం!" అంటూ, శరత్ ను గట్టిగా పట్టుకున్నాడు. “ఎక్కడరా?" అన్నాడు శరత్. “అదిగో! అ...అ.... అక్కడ చూడు అన్నయ్యా!" అంటూ భయంభయంగా దారి ప్రక్కనున్న చెట్టుపైకి చూపించాడు. శరత్ వాడిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, “భయపడకు నేనున్నానుగా, అటు చూడకుండా పద.", అంటూ ధైర్యం చెప్పాడు. శ్రావణ్ మాత్రం శరత్ ను గట్టిగా వాటేసుకుని అటు చూడకుండా నడవసాగాడు. శరత్ మాత్రం ఆ చెట్టువైపు చూసుకుంటూ నడిచాడు. అక్కడ రెండు చేతులతో కొమ్మలు పట్టుకొని వ్రేలాడుతూ ఒక నల్లని ఆకారం ఒకటి ఊగుతూ కనపడింది.. అయినా, శరత్ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి ఆ ఆకారాన్ని క్రిందకు, పైకీ పరికించి చూశాడు. క్రింది వైపు ఒక తోకలాగా కూడా వుంది. ఆ ఆకారం చూస్తున్న శరత్ కు ఇంతకుముందు ఒకసారి బడిలో సైన్సు మాష్టారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. 'చీకటిలో దేనినైనా చూసినప్పుడు మన మనసులో ఏదైనా ఆకారాన్ని ఊహించుకున్నామనుకోండి. ఆ ఆకారమే మనకు కనపడుతుంది. అంతే తప్ప, ఈ దెయ్యాలూ, భూతాలూ వుంటాయని చెప్పేదంతా నమ్మరాదు." అని. అలా ఆలోచించుకుంటూ ఇంటికి చేరారు. ఇంటికి చేరిన వెంటనే శ్రావణ్ వాళ్ల అమ్మకు విషయం చెప్పి, భయంతో "నేను ఈరోజు నీ దగ్గరే పడుకుంటానమ్మా!" అన్నాడు. “సరే, అలాగే, పడుకో" అన్న వాళ్లమ్మ మాటలతో గట్టిగా కళ్లు మూసుకొని నిద్ర పోయాడు. శరత్ మాత్రం "ఆ ఆకారం ఏమైయుంటుందా?" అని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఇద్దరూ బడికి బయలుదేరారు. శరత్ బడికి వెళ్తూ వెళ్తూ దారిలో రాత్రి చూసిన ఆ చెట్టు పైకి చూసి, ఒక్కసారిగా విరగబడి నవ్వసాగాడు. శ్రావణ్ కు అర్ధం కాక , “ఏంటన్నయ్యా! అలా నవ్వుతున్నావు. ఉన్నట్టుండి?" అన్నాడు. శరత్ నవ్వుతూనే ఉన్నాడు. “ఏంటో చెప్పన్నయ్యా." అడిగాడు శ్రావణ్, శరత్ పొట్టపై చెయ్యి వేసుకుని “హమ్మ హమ్మ." అని నవ్వుతూనే “అక్కడా..హ..హ. అక్క.. అక్కడ.. ఆ చెట్టు.. చెట్టుపై చూడు." అంటూ రాత్రి తాను దెయ్యం అంటూ చూపిన చెట్టు వైపు చూపాడు. అటు చూసిన శ్రావణ్ కు కూడా నవ్వాగలేదు. విషయం ఏంటంటే, ఏ గాలికో చిరిగిపోయిన ఒక పాతగుడ్డ వచ్చి కొమ్మకు తగులుకుని వుంది. పైకి రెండు పీలికలు, క్రిందికి ఒకటి, మధ్యలో రెండు రంధ్రాలు, అందులో నుండి బహుశా రాత్రి వెన్నెల మెరుస్తూ కనబడి వుంటుంది. చూడ్డానికి అచ్చం మనిషి వ్రేలాడబడి ఊగుతున్నట్లే వున్నది. అప్పటి నుండి ఇక జీవితంలో ఎక్కడైనా 'దెయ్యం' వుందన్న మాట వినబడితే చాలు, పొట్టచెక్కలయ్యేలా విరగబడి నవ్వడమే వీరి పని. ఆధారం: మద్దిరాల శ్రీనివాసులు