చెకుముకి నేస్తాలూ! ఆమ్లాలు, క్షారాలు ఎలా ఉంటాయో ప్రయోగాలు చేసి నేర్చుకొందామా! ఈ ప్రయోగానికి ఎరుపు, నీలిరంగు లిట్మస్ పేపర్లు, pH సూచిక పేపర్లు, బత్తాయి, కమలా, నిమ్మకాయ, వినిగర్, డిటర్జెంట్, సబ్బు, బేకింగ్ సోడా, యాంటాసిడ్ టాబ్లెట్, ఆస్పిరిన్ టాబ్లెట్, నేస్తాలూ! చిన్న నీలిలిట్మస్ పేపర్ పై ఒక చుక్క నిమ్మరసం వేసి మార్పును పరిశీలించండి. ఎరుపుగా మారుతుంది. బత్తాయి, కమలా పండ్లరసాన్ని, వినగర్లు వేరువేరుగా నీలిలిట్మస్ పేపర్ పై వేసి పరిశీలించండి. ఎరుపుగా మారటం గమనిస్తారు. అంటే నీలి లిట్మస్ ను ఎరుపుగా మార్చే గుణం వీటికున్నదని గ్రహించారు కదూ! నిమ్మరసం రుచి ఎలా ఉంటుంది? బత్తాయి, కమలాపండ్ల రసాలు, వినగర్ కూడ నిమ్మరసం లాగ పుల్లగా ఉంటాయి కదూ! రుచికి పుల్లగా ఉండేవి ఆమ్లాలన్నమాట. ప్రయోగశాలలో ఉండే ఆమ్లాలను మాత్రం రుచి చూడటానికి ప్రయత్నించవద్దు. చాలా ప్రమాదం సుమా! ఆమాలతో పాటు మరో రకమైన దార్థాలుంటాయి. సబ్బు, డిటర్జెంట్ మీరు ఉపయోగిస్తారు కదూ! ఎరుపు లిట్మస్ పై వీటి ద్రావణాన్ని వేసి పరిశీలించండి. నీలంగా మారటం గమనిస్తారు. సబ్బు, డిటర్జెంట్ చేతిలో పట్టుకొంటే జారిపోతుంది కదూ! అంటే ఎరుపు లిట్మస్ ను నీలంగా మార్చి జారిపోయే భౌతిక గుణం కల పదార్థాలన్నీ క్షారాలన్నమాట. మీరు ఇప్పటివరకు గమనించిన పదార్థాలన్ని సాధారణంగా మనం ఉపయోగించేవే. నిమ్మజాతికి చెందిన బత్తాయిలు, కమలాలు, నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. వినగర్ కూడ ఆమ్లమే. అంటే ఆమ్లాలన్ని తినే పదార్థాలేనా? కాదు. ఆస్పిరిన్ టాబ్లెట్ ఎసిటైల్ శాలిసిలిక్ ఆమ్లం, తలనొప్పికి మాత్రమే వాడతాం. నేస్తాలూ! మనం ఇంట్లో వాడే క్షారాలు రెండు రకాలు. సబ్బు, డిటర్జెంట్ లాంటి క్షార పదార్థాలు మొదటిరకం అయితే యాంటాసిడ్, బేకింగ్ సోడా రెండవరకం. యాంటాసిడ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? అజీర్తి చేసినప్పుడు వాడతాం. అజీర్తి సాధారణంగా కడుపులో ఆమ్లం అధికంగా తయారవటం వలన కలుగుతుంది. యాంటాసిడ్ లోని క్షారం ఆమ్లాన్ని తటస్థీకరించటం వలన అజీర్తి తగ్గుతుంది. అమ్లం క్షారాల మధ్య చర్య జరిగి నీరు లవణం ఏర్పడతాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ క్షారంతో చర్య జరిపి నీరు, సోడియం క్లోరైడ్ లవణం ఏర్పడతాయి. దీనిని ద్వంద్వ స్థానభ్రంశ చర్య లేదా ద్వంద్వ వియోగ చర్య అని కూడా అంటారు. HCl + NaOH → H2O + NaCl నేస్తాలూ! లిట్మస్ పేపర్ లాగానే మిథైల్ ఆరంజ్, ఫినాఫ్తలీన్లు కూడ ఆమ్ల లేక క్షారాలను సూచించటానికి ఉపయోగిస్తారు. అందుకే వీటిని సూచికలంటారు. వినగర్, నిమ్మరసం లాంటి ఆమ్లాలను తినుబండారాలలో ఉపయోగిస్తారు. కారు బ్యాటరీలలో వాడే ఆమ్లం చాలా ప్రమాదకరమైంది. వినగర్, నిమ్మరసం లాంటివి బలహీనమైన ఆమ్లాలు, కారులో వాడే ఆమ్లలాంటివి బలమైన ఆమ్లాలు. ప్రతిరోజు మనము సబ్బు వాడతాం. కాని సోడియం హైడ్రాక్సైడ్ గాఢ ద్రావణం చర్మంపై పడితే కాలుతుంది. బేకింగ్ సోడా, సబ్బులాంటివి బలహీన క్షారాలు. సోడియం హైడ్రాక్సైడ్ లాంటివి బలమైన క్షారాలు. నేస్తాలూ! బలమైన ఆమ్లాలు, క్షారాలు, బలహీనమైన ఆమ్లాలు, బలహీనమైన క్షారాలు ఎలా తెలుసుకోవచ్చో చేసి చూద్దామా! లిట్మస్ పేపర్లాగానే pH పేపరు లభిస్తుంది. pH మాపకం అవధి 0 నుండి 14 ఉంటుంది. తటస్థ ద్రావణాల pH విలువ 7.0 ఉంటుంది. అంటే అది ఆమ్లం కాదు. క్షారం కూడా కాదు. ఆమ్లాల pH విలువ 7.0 నుండి 0 (సున్న) వరకు ఉంటుంది. pH విలువ తక్కువగానీ, సున్నకు దగ్గరగా గానీ, అంతకంటే తక్కువ ఉంటే అవి బలమైన ఆమ్లాలు. క్షారాల pH విలువ 7.0 నుండి 14 వరకు ఉంటుంది. pH విలువ 14కు దగ్గరగా గానీ, అంతకంటే ఎక్కువగా వుంటే అవి బలమైన క్షారాలు. నీలి లిట్మస్ ఎరుపుగా మారితే ఆమ్లమని, ఎరుపు లిట్మస్ నీలంగా మారితే క్షారమని తెలుసుకొన్నాం కదా! ఆమ్లాల, క్షారాల pH విలువలను అవి తెలుపవు. ఆమ్లాల, క్షారాల pH విలువలు తెలవాలంటే pH పేపరు కావాలి. pH పేపరుతో పాటు ఒక సూచిక పటం వస్తుంది. ఆ పటంలోని రంగును బట్టి ఆమ్లాలు, క్షారాలు ఇచ్చే రంగును సరిచూసుకొంటే pH విలువ తెలుస్తుంది. కారు బ్యాటరీలో వున్న ఆమ్లం pH విలువ సున్నకంటే తక్కువ వుంటుంది. నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం pH విలువ షుమారు 2.0 ఉంటుంది. వినిగర్ pH విలువ షుమారు 3.0 ఉంటుంది. స్వేదజలం pH విలువ 7.0. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా బలహీనమైన కారం. దీని pH విలువ 9.0 ఉంటుంది. ప్రతిరోజు మనం ఉపయోగించే వినగర్, ఆస్పిరిన్ లాంటి ఆమ్లాలే కాక హైడ్రోక్లోరికామ్లము మన కడుపులో ఆహారం జీర్ణం కావడానికి బాహ్యంగా లోహాలను శుద్ధి చేయటానికి, కృత్రిమ పట్టును తయారుచేయటానికి ఉపయోగిస్తారు. రసాయన పదార్థాలు తయారుచేసే పరిశ్రమలలో సల్ఫ్యూరికామ్లాన్ని వాడతారు. మనము ఉపయోగించే సబ్బులు, డిటర్జెంటులలోనే కాక నీటి శుద్ధి కర్మాగారాలలో వెంట్రుకలకు వేసే రంజనాలలో కూడ క్షారాలు వాడతారు. ఆల్కలీ బ్యాటరీలలో కూడ క్షారం వాడతారు. నేస్తాలూ! కోకోకోలా, తమ్సప్ లలో ఫాస్ఫారికామ్లంతో పాటు పురుగుల మందు కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ఆధారం: ప్రొ. ఆదినారాయణ