ఇంధ్రధనుస్సులో కన్పించే ఏడు రంగులనూ ఓ గుండ్రని అట్టమీద వేసి, ఆ అట్టను గిరగిరా త్రిప్పితే అది తెల్లగా కన్పిస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అలాంటిదే మరో గమ్మత్తైన ప్రయోగాన్ని చేసి చూడండి. ఏదైనా ఒక వస్తువుపై వుండే తెలుపు, నలుపు రంగులను మీరు వేగంగా మార్చిమార్చి చూసినట్లయితే అప్పుడు ఆ రెండు రంగులకు బదులుగా మరేదో రంగు మీకు కన్పించడం మొదలుపెడుతుంది. శాస్త్రజ్ఞులు దీనినే (సబ్జెక్టివ్ కలప్) అని పేర్కొంటున్నారు. విచిత్రంగా అన్పించే ఆ అంశం గురించి అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే ఇలా చేసి చూడండి.... ముందుగా ఈ పేజీలో ఇచ్చిన తెలపు-నలుపు రంగుల వృత్తాన్ని ఓ దళసరి కాగితంపై దించుకోండి. లేదా దీనినే జాగ్రత్తగా కత్తిరించే ఓ దళసరి కాగితంపై అతికించుకోండి. సరిగ్గా దీని కేంద్రభాగంలో ఓ సన్నని గుండుసూదిని గుచ్చి, దాని కొసని ఓ సన్నని వెదురు కర్రలోకి జరపండి. ఈ రంగుల వృత్తాన్ని మీరు అమర్చే పద్ధతి ఎలా ఉండాలంటే, దానిని మీరు గిరిగిరా తిప్పగలగాలి. తెలుపు - నలుపు రంగుల ఈ వృత్తాకారాన్ని మీరు గిరగిరా తిప్పినప్పుడు మీకు ఏ కన్పిస్తుందో తెలుసా? వేరువేరు రంగులకు చెందిన అనేక గోళాలు ఒక దానిలో ఒకటి ఉన్నట్లుగా మీకు కన్పిస్తోంది. ఒకవేళ అట్టముక్కను తిప్పేదిశను మార్చినట్లయితే ఇవన్నీ వ్యతిరేక క్రమంలో మీకు కన్పిస్తాయి. 19వ శతాబ్ధంలో గుస్తాన్ ఫెక్ నర్ అనే ఓ జర్మన్ వైజ్ఞానికుడు ఇలాంటి చక్రాన్ని రూపొందించాడు. అయితే ఇందులో కన్పించే రంగుల విషయంలో మాత్రం ఆ తరువాత కాలంలోని వైజ్ఞానికులు రకరకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ రంగులు కన్పించడానికి కారణం ఇదంటే కాదు ఇదని వారు ఒకరితో ఒకరు విభేదించారు. ఇప్పటికి కొన్నేళ్ళు కిందట మరొక చిత్రమైన సంఘటన కూడా జరిగింది. అమెరికాకు చెందిన షికాగోలోని టీ.వీ స్టూడియోలో ఒకతను ఇలాంటి ఓ పెద్ద చక్రాన్ని తిప్పినప్పుడు ఆ విచిత్రం చోటు చేసుకుంది. అదేమిటంటే ఆ సమయంలో ఆ టీవి ప్రోగ్రాంని చూస్తున్న వారికి వారి తెలుపు - నలుపు ( బ్లాక్ అంట్ వైట్ ) టీవీల్లో రంగురంగుల వలయాలు కన్పించాయి... ఇందుకు గల పూర్తి కారణాలని ఇంకా విశ్లేషించవలసి వుంది. ఏమైతేనేం ఒక తమాషా ప్రయోగం గురించి మీరు తెలుసుకున్నారుగా. ఇక దీన్ని చూసి అసలు మజా ఏమిటో చవిచూడండి. చూస్తారుగా.