పాత పేకముక్కల్లో నుంచి ఒక జోకరుని తీసుకోండి. లేదా ఒక పోస్టుకార్డు మీదకాని, దళసరి అట్టమీదగాని ఓ జోకరు బొమ్మనుదించుకోండి. జోకరుకి బదులుగా మీ కిష్టమైన ఏదైనా జంతువు లేదా పక్షిని గాని లేదా సీతాకోక చిలుకను గాని కూడా దించుకోవచ్చు. ఖాళీ పెన్ను రీఫిళ్ళను గాని, కూల్ డ్రింకులు తాగేందుకు వాడే పుల్ల (స్ట్రా) నుంచి గాని సుమారు 6 సెంటీ మీటర్ల పొడవుండే ఓ రెండు ముక్కల్ని తీసుకొండి. ఈ రెండు ముక్కల్ని ఒక దానికొకటి కొంచెం ఎడంగా ప్రతీదీ సుమారు 20 డిగ్రీల వాలుతో వుండేలా, జోకరు బొమ్మ వెనుకవైపున గమ్ టేపుతో అతికించండి. వాటిని ఎలా అతికించాలో పైన ఇచ్చిన బొమ్మను చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఓ రెండు -మూడు మీటర్ల పొడవుండే దారాన్ని గాని, సన్నని తాడునిగాని తీసుకొని దానిని రెండు గొట్టాల నుంచి దూర్చండి. జోకర్ తలపైన ఉన్న దారపు భాగాన్ని కొంచెం ఎత్తుగా ఉండే మేకు లాంటి దానికి వేలాడదీయండి. ఇక ఇప్పుడు గొట్టాలకు రెండో వైపున ఉండే రెండు దారపు కొనలనూ మీ రెండు చేతులతో పట్టుకుని, ఒకదాని తరువాత మరోదాన్ని లాగుతూ ఉండండి. అంతే. మీ జోకరు బొమ్మ పైకి ఎగబాకుతుంది. దారాన్ని కొంచెం వదులుగా వేస్తే చాలు మళ్ళీ జోకరు బొమ్మ కిందికి వచ్చేస్తుంది. భలేగా ఉంది కదా. ఇంకేం. వెంటనే చేసి చూడండి. (మీకు దగ్గరి దారం పైకీ కిందకీ కదలకుండా,అక్కడ కొంత భాగాన్ని క్యాలండర్ వేలాడదీసే దారంలా ముడివేసి, ఆ వేగాన్ని మేకుకి వేలాడదీయండి...