తకతై, తకతై తోలుబొమ్మ, దాని తమాషా చూడరా తోలుబొమ్మ... ఎప్పుడైనా మీరు తోలుబొమ్మలాట చూశారా? తెర వెనుక దీపాల వెలుగులో పారదర్శకమైన (Transparent) రంగులు అద్దిన తోలుబొమ్మలాట చూడడానికి చాలా బాగుంటుంది. అందులో కేతిగాడి పాత్ర చేసే వీరంగం చూసి తీరవలసిందే. కోతి చేష్టలతో, కుప్పిగంతులతో బహురంజుగా వుంటుంది. మరి మనము అలాంటి కేతిగాళ్ళను తయారుచేసి గంతులేయిద్దామా. ఎలాగంటారా? రండి చేసి చూద్దాం. ఒక రేకు పైన లేక Steel plate పైన పటములో చూపిన విధంగా రెండు లావాటి పుస్తకాలు అమర్చి వాటిపైన ఒక గాజు పలకను అమర్చాలి. పలుచని కాగితం Tissue paper తో ఒక అంగుళం సైజులో 4 లేక 5 బొమ్మలను కత్తిరించండి. ఈ కత్తిరించిన బొమ్మలను రేకు (plate) పై గాజుపలక క్రింద ఉంచండి. ఇప్పుడు గాజుపలకను ఉన్నిగుడ్డ (woolen cloth)తో రుద్దినట్లయితే క్రిందవున్న పేపరు బొమ్మలు చక్కగా గంతులేస్తాయి. కేతిగాడిలాగా. ఇది ఎలా సాధ్యం? గాజు పలకను ఉన్నిగుడ్డతో రుద్దినప్పుడు అది ఎలక్ట్రాన్ ను కోల్పోయి (loose electrons) ధనవిద్యుదావేశాన్ని పొందుతుంది. ఈ ఆవేశం క్రిందవున్న కాగితపు బొమ్మలను ఆకర్షిస్తుంది. బొమ్మలు పైకి లేచి తమలోని ఎలక్ట్రాన్ ను గాజుపలకకు ఇచ్చి ధనావేశం పొందుతాము. అప్పుడు గాజి పలక, కాగితపు బొమ్మలు సజాతి ఆవేశాలై పరస్పరం వికర్షించుకుని బొమ్మలు క్రింద లోహపు ప్లేటుపై పడతాయి. అవి లోహపు పలకలోని ఎలక్ట్రాన్ ను తీసుకొని (gain electrons)తటస్థపడి మరలా గాజుపలక వైపు ఆకర్షించబడి పైకిలేస్తాయి. ఇలా వెనువెంటనే జరుగడం వలన మనకు కాగితపు బొమ్మలు గంతులేస్తూ కనిపిస్తాయి. అదన్నమాట, ఉంటామరి... ఆధారం: యం.ఎస్. యుగంధర్