“మేజిక్ షోలో తదుపరి అంశం కేరట్ పంపు” మైక్ లో సైన్స్ టీచర్ లక్ష్మీ ఎనౌన్స్ మెంట్ విన్న విద్యార్థుల్లో ఆసక్తి ఎక్కువైంది. కేరట్ తో పంపు అంటున్నారు. ఇదెలా సాధ్యం? గుసగుసలు ప్రారంభమయ్యాయి. మెజీషియన్ వేదిక మీదికి వస్తూనే చేతిలో ఉన్న కేరట్ ను అందరికీ చూపించాడు. కేరట్ కు ఒక గాజు గొట్టం గుచ్చి ఉన్నట్లు కన్పిస్తోంది. “పిల్లలూ, ఈ కేరట్ ను చూడండి. దీనికి గుచ్చిన గాజుగొట్టం ద్వారా నీటిని పంపింగ్ చేస్తా. ఇదే ఈ రోజు మేజిక్” అన్నాడు మెజీషియన్ సుబ్బు.. మెజీషియన్ తన చేతిలోని కేరట్ ను ఒక గాజు గ్లానులో నిటారుగా, గాజు గొట్టం పైకి ఉండేట్లు అమర్చాడు. గ్లాసులో సగానికి పైగా నీరు పోశాడు. వేరే ఒక గ్లాసులో ఉన్న రంగులేని ద్రావణాన్ని గాజు గొట్టంలో సగానికి పైగా పోశాడు. ఇప్పుడు మీరంతా ఈ గాజుగొట్టం కేసి జాగ్రత్తగా చూడండి. ఏం జరుగుతుందో గమనించండి అన్నాడు. అంతా ఆసక్తిగా గాజుగొట్టం వైపు చూస్తున్నారు. కొంత సేపటికి గాజు గొట్టంలో నీటిమట్టం పెరగడం మొదలైంది. అలా అలా పెరుగుతూ గాజుగొట్టం పూర్తిగా నీటితో నిండిపోవడమే కాకుండా, గొట్టం నుంచి నీరు బయటికి ప్రవహించడం ప్రారంభించింది. “చూసారా... కేరట్, గ్లాసులో నీటిని బయటికి పంపుచేస్తోంది' మెజిషియన్ మాటలకు విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. ఈ మేజిక్ ను చేయడం చాలా సులభం. ఇందుకు కావలసినది ఒక కేరట్ దుంప. ఒక చిన్న గాజు గొట్టం. గాజుగ్లాసు, నీరు, సంతృప్త ఉప్పు ద్రావణం. ఒక కేరట్ ను తీసుకొని తలభాగం కత్తిరించాలి. అందులో ఒక చిన్న గొయ్యిలా చేసి ఒక చిన్న గాజుగొట్టం తీసుకుని కొంత భాగం పైకి కనిపించేలా కేరట్లోకి గుచ్చాలి. గాజుగ్లాస్ లో కొంత నీరు పోసి కేరట్ ను నిటారుగా ఉండేలా ఒక రంధ్రం వున్న అట్టసాయంతో అమర్చాలి. ఇప్పుడు గాజుగొట్టంలో సగం దాకా ఉప్పుద్రావణం పోసి కొంచెం సేపు నిరీక్షించాలి. మెజీషియన్ చేసిన మేజిక్ లో జరిగినట్లు గాజు గొట్టంలో నీటిస్థాయి పెరిగి కొంత సేపటికి నీరు గొట్టం నుంచి పైకి ప్రవహిస్తుంది ఇదే కేరట్ పంపు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇందుకు ద్రవాభిసరణం (Osmosis) కారణం. కేరట్ జ్యూస్ లో ఉండే లవణాల గాఢత గ్లాసులోని నీటిలో లవణాల గాఢత కంటే ఎక్కువ. ద్రవాభిసరణం వల్ల విలీన ద్రావణం నుంచి గాఢ ద్రావణంలోకి అర్ధ ప్రవేశ్యపొర ద్వారా ద్రావణి ప్రవహిస్తుంది. గ్లాసులో పోసిన నీరు విలీన ద్రావణం (దానిలో కరిగియున్న లవణాల గాఢత తక్కువ), కేరట్ జ్యూస్ గాఢత ఎక్కువ. జీవ కణాల గోడలు అర్ధ ప్రవేశ్యపొరల్లా ప్రవర్తిస్తాయి. కేరట్ విషయంలో అదే జరిగింది. ద్రావచీకరణ మొక్కలకు ఒక రకం పంపులాగా పనిచేసి కణాల గోడల గుండా నీరు కదిలేందుకు సాయపడుతుంది. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం