మెజీషియన్ వేదిక మీదికి వచ్చాడు. ఇప్పుడేం మేజిక్ చేస్తాడోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. విద్యార్ధుల్లో కాస్త ధైర్యం ఉన్న వారిలో ఒకరు వేదిక మీదికి వస్తే అరచేతిలో చల్లని మంట సృష్టిస్తాను అన్నాడు మెజీషియన్. విద్యార్ధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరేం భయం లేదు నేనున్నానుగా ఎవరో ఒకరు రండి అని మళ్ళి పిలిచాడు. రాముకు మేజిక్ లంటే ఇష్టం. వేదిక మీదికి వెళ్ళాడు. ఏది, నీ అరచేయి చాపు అన్నాడు. ఒక బీకరులో రంగులేని ద్రవం ఉంది. ఏదో మంత్రం వేస్తున్నట్లు అందరికి వినపడేలా కొన్ని మాటలు చెప్పి, ఒక చెంచాతో కొన్ని మిల్లీలిటర్ల ద్రవాన్ని రాము అరచేతిలో పోశాడు. ఒక కాగితాన్ని సారాదీపం మీద మండించి రాము అరచేతిలోని ద్రవానికి తాగించాడు. అరచేతిలో పసుపురంగు మంట వచ్చింది. మెజీషియన్ వేదికమిద లైట్ అర్పివేశాడు. మంట మరింత అద్బుతంగా కన్పించింది. అందరికి చూపించమన్నాడు. చెయ్యి ఏమీ కాలలేదు. కాలినా గాయమేమి లేదు. తన అరచేతిలో మంట వచ్చినా చల్లగానే ఉందన్నాడు. ఈ మేజిక్ ను మనం అర్ధం చేసుకోవచ్చు. నిజానికి మెజీషియన్ ఏ మంత్రమూ వెయ్యలేదు. అరచేతిలో ఏర్పడింది చల్లనిమంట కాబట్టి కాలిన గాయం ఏర్పడదు. అరచేతిలోని ద్రవాన్ని మండించినప్పుడు, ఆ ద్రవం వేగంగా భాష్ప్పీకరణం చెందడం వల్ల చల్లదనం వస్తుంది. అంటే చల్లని మంట ఏర్పడిందన్నమాట. ఈ మేజిక్ మనం చేయవచ్చు ఇందుకు కావల్సినవి: 60 మి.లీ కార్బన్ డై సల్ఫైడ్, 40 మి.లీ కార్బన్ టెట్రా క్లోరైడ్, 250 మి.లీ బీకర్. 250 మి.లీ బీకర్ లో కార్బన్ డై సల్ఫైడ్, కార్బన్ టెట్రా క్లోరైడ్ ద్రవాలను కలిపి మిశ్రమం తయారు చేయాలి. నాలుగు లేదా ఐదు మి.లీ ద్రవాన్ని అరచేతిలోకి తీసుకోని మండించాలి. పసుపురంగులో చల్లని మంట వస్తుంది ఎంతైనా మంటతో చేస్తున్న ప్రయోగం కదా. కాస్త జాగ్రత్తగానే ఉండాలి. చేయి వెనకవైపుకు జారుతుంది. ద్రవ మిశ్రమాన్ని తయారు చేసిన వెంటనే వాడుకోవాలి. నిలవ ఉంచితే ఎక్కువ భాష్పశీలత ఉండే కార్బన్ టెట్రా క్లోరైడ్ ఇగిరిపోవచ్చు. మిగిలిన ద్రవంతో ప్రయోగం చేస్తే చేయి కాలుతుంది. ఆధారం: డా. ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం.