కెమిస్ట్రీ మేజిక్ చూస్తున్న విద్యార్థుల్లో అంతకంతకూ ఆసక్తి పెరుగుతోంది. ప్రతి మేజిక్ చేసి చూపించడమేకాకుండా, దానిలో ఇమిడి ఉన్న రసాయన సూత్రాలను కూడా మెజీషియన్ సుబ్బువివరిస్తూ, కొంత మంది మోసగాళ్ళు చేసే మాయలు మంత్రాల్లోని గుట్టును బట్టబయలు చేస్తుండడంతో సైస్స్ పట్ల కుతూహలం అందరిలో ఎక్కువైంది. ఎప్పటిలాగే మెజీషియన్ సుబ్బు టివిగా తనదైన ప్రత్యేకమైన దుస్తులు చేతిలో మంత్రదండం అనిపించే కర్రతో వేదిక మీదికి వచ్చాడు. వేదిక మీద ఒక టేబుల్ ఉంది. దాని మీద మెజీషియన్ ఒక అస్బేస్టాస్ పలకను ఉంచాడు. అందరూ చూస్తుండగానే రెండు బీకరుల నుంచి రెండు వేర్వేరు చూర్ణాలను అస్బేస్టాన్ పలక మీద ఒక కుప్పలా పోశాడు. వేరే ఒక పొట్లం విప్పి అందులోంచి ఇంకేదో చూర్ణాన్ని ఆ కుప్ప మీద చల్లాడు. మెజీషియన్ మేజిక్ షోకి వచ్చిన అందరికేసి చూసి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నీరు మంటను అర్పుతుందా లేని మంటను సృష్టిస్తుందా ? అందరిదీ ఒకటే సమాధానం. నీరు మంటను అర్పుతుంది. అగ్నిమాపక యంత్రంలో కూడా అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలనార్పడానికి నీరు చిమ్ముతారు కదా అన్నారు. అలా కాదు. నేను ఈ ఆస్బేస్టాస్ పలక మీద ఉన్నచూర్ణం మీద నీరు పోస్తాను. పోనీ మీలో ఒకరు వేదిక పైకి రండి. నేనిచ్చే నీటిని ఈ చూర్ణం మీద మీరే పోయండి. ఏమవుతుందో చూద్దాం అన్నాడు మెజీషియన్. విద్యార్దుల్లోంచి అనీష్ చాలా ఉత్సాహంగా వెళ్ళాడు. మేజిషియన్ ఇచ్చిన ఇంక్ పిల్లర్ తో టేబిల్ మీద బీకర్ లో ఉన్న నీటిని తీసుకుని, కొన్ని చుక్కలు ఆ చూర్ణం మీద పోశాడు. వెంటనే నీలం రంగు మంట , మంటతోపాటు పొగ వచ్చాయి. అంతా చప్పట్లు కొట్టారు. చూశారా విచిత్రం. మంటనార్పే నీరు మంటను సృష్టించింది. ఈ మేజిక్ మనమూ చెయ్యచ్చు: ఇందుకు కావలసిన రసాయనాలు. 4గ్రా. అమ్మోనియం నైట్రేట్, 1 గ్రా. అమ్మోనియం క్లోరైడ్, 4 గ్రా. జింక్ చూర్ణం. అమ్మోనియం నైట్రేట్ ను , అమ్మోనియం క్లోరైడ్ ను కలిపి అస్బేస్టాస్ పలక మీద ఒక కుప్పలా పోయాలి. వెంటనే నీలం రంగు మంట ఏర్పడుతుంది. ఈ ప్రయోగంలో ఇతర రసాయనాలతో పాటు 0.5గ్రా. బేరియం నైట్రేట్ ను కూడా కలిపి, ఆ తర్వాత నీటి చుక్కలను ఆ చూర్ణం మీద పోస్తే ఆకుపచ్చరంగు మంట వస్తుంది. చేతి వేళ్ళను నీటిలోముంచి, వేళ్ళకు అంటుకున్న నీటిని అస్బేస్టాస్ పలక మీద హాంఫట్ అంటూ చల్లితే మేజిక్ ఇంకా రక్తికడుతుంది. నీటిని చల్లితే మంట ఎందుకువస్తుంది ? ఇందుకు రసాయన చర్యేకారణం. ఆక్సీకరణ, క్షయకరణ పదార్ధాల మిశ్రమం మీద నీటి ఉత్ర్పేరక చర్యే ఇందుకు కారణం. అమ్మోనియం నైట్రేట్ బలమైన ఆక్సికరణి. జింక్ అక్సికరణం చెంది జింక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. నీటి ఆవిరి కూడా ఏర్పడుతుంది. ఈ చర్యలో ఎక్కువ వేడిపుడుతుంది. కాబట్టి కళ్ళజోడు పెట్టుకుని ఇంకా ప్రయోగ సమయంలో తగు రక్షణ కవచం లాంటిది ధరించి జాగ్రత్తగా చేయాలి సుమా ! ఆధారం: డా ఇ.ఆర్. సుబ్రమణ్యం.