మీరెప్పుడైనా వేడివేడి పెనం మీద పడిన నీటి బిందువులను గమనించారా ? అందులో చూడ్డానికి ఏముందని. అవి చిటపటమంటూ ఆవిరై పోతాయి. అంతే కదా… అంటారా ? అవి ఆవిరైపోయే మాట నిజమే. కాని అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. వేడివేడి పెనం మీద పడిన నీటి బిందువులు ఆ పెనాన్ని తాకకుండా దానిపైన గాలిలో అటూఇటూ తిరిగుతూ, కొంత సేపటికి ఆవిరైపోతాయి. తమ వేళ్ళతో పెనంపైన నీళ్ళు చిలకరించే చాలా మందికి ఈ విషయం తెలియనే తెలీదు. వేడివేడి పెనం మీద మీ చేతివేళ్ళలో నీళ్ళు చిలకరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ...... నీటి బిందువులు పెనాన్ని చేరీ చేరగానే పెనం వేడికి వాటి క్రింది భాగం తక్షణం ఆవిరిగా మారిపోతుంది. ఈ ఆవిరి ఎంత ఒత్తిడితో వుంటుందంటే అది తనపైనే వుండే నీటి బిందువును కూడా మోస్తుంది. నీటి బిందువుల కింది వేడి గాలి అటూఇటూ కదులుతుంటే, దానితో పాటు నీటి బిందువులూ పెనం పైన తిరుగుతుంటాయి. కొద్ది సేపటికి పెనం తాలుకూ వేడికి నీరంతా పెనం ఆవిరై గాల్లో కలిసిపోతుంది. ..... అదీ సంగతి !