మనం మన చేతులలో ఒక సీమ బాదం కాయను పగలగొట్టడం కష్టమా లేక ఒక కోడిగుడ్డును పగలగొట్టడం కష్టమా ? అని ఎవరినైనా అడిగితే వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా సీమ బాదం కాయని పగలగొట్టడమే కష్టం. అని అంటారు అవునా ? కాని మీ మిత్రులతో పందెం కాసి సీమ బాదం కాయ కన్నా ఒక కోడిగుడ్డును పగలగొట్టడమే కష్టం అని మీరు నిరూపించవచ్చు. అదెలా అంటారా ? ఇదిగో ఇలా... ఒక కోడిగుడ్డును తీసుకొని దానిపై భాగంలో కొద్దిగా కొబ్బరి నూనెలాంటి తేలికపాటి నూనెను రాయండి. ఆ తరువాత దానిని మీ అరచేతిలో పెట్టుకుని, ఆ చెయ్యిని ఒక ప్లాస్టిక్ కవర్ లో దూర్చండి. (ఒకవేళ ఏ కారణం వల్లనయినా గుడ్డు పగిలితే దాని సొన మీ ఒళ్ళంతా తుళ్లకుండా వుండేందుకే ఈ ఏర్పాటు) ఇక ఇప్పుడు మీరు మీ చేతిలోని గుడ్డుని ఎంత గట్టిగా నొక్కగల్గుతారో అంత గట్టిగా నొక్కండి . ఊహూ. అది అంత తేలిగగా పగలదు. ఈ పద్ధతిలో మీరు గుడ్డును పగలగొట్టడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటారా? మన వేళ్ళ ద్వారా గుడ్డుపైన ప్రయోగించబడే బలం గుడ్డు అన్ని దిశల్లోనూ సమానంగా వ్యాపిస్తుంది. అందువల్ల మరి గుడ్డును పగులగొట్టలేరు. కేవలం గుడ్డు మాత్రమే కాదు. గుండ్రంగాను, గుమ్మటాల్లానూ వుండే ఆకారాలన్నీ చాలా ధృడంగా వుంటాయి. ఈ సూత్రాన్ని మన నిత్యజీవితానికి సంబంధించిన అనేక వస్తువులలో ఉపయోగించుకోవటాన్ని మీరు గమనించే ఉంటారు. ఉదాహరణకు ఓ కారుని తీసుకుంటే .... దానికి సంబంధించిన ఏ అంశం కూడా పూర్తి సమతలంగా ఉండదు. ప్రతి అంశం ఎంతో కొంతమేరకు వంపుతో తయారు చేయబడుతుంది. ఇక సీమ బాదం కాయల విషయానికి వస్తే మీ అరచేతిలో ఒకటిగాక రెండు బాదంకాయలను పట్టుకోండి. ఇప్పుడీ రెండూ ఒక దానిపై ఒకటి ఒత్తిడి కలిగించేలా మీ అరచేతులను అదమండి. మీరు మీ చేతుల ద్వారా ప్రయోగించే బలం కోడిగుడ్డుకులాగా బాదంకాయల ఉపరితలమంతటా వ్యాపించదు. దానికి బదులుగా, మీ చేతిలోని రెండు బాదంకాయలు ఏయే బిందువుల వద్ద కలుసుకుంటున్నాయో, ఆయా బిందువులు వద్ద మాత్రమే బలం కేంద్రీకరించబడుతుంది. దాంతో ఇంకేముంది. మీ చేతిలోని బాదంకాయలు అతి సులభంగా పగిలిపోతాయి విషయం అర్థమయ్యిందిగా.....