చెకుముకి నేస్తాలూ! మీరు వడగండ్ల వాన పడటం చూసి ఉంటారు కదూ! ఇది అరుదుగా పడుతుంది. వడగండ్లను పట్టుకొని ఆడి వుంటారు. అవి ఘనరూపంలో వున్న నీరు. చినుకులు ద్రవరూపంలో వున్న నీరు. వడగండ్లను గానీ లేక ఐస్ ముక్కలను గానీ గ్లాసులో వేసి గదిలో వుంచితే గ్లాసు పైభాగంలో నీటి బిందువులు ఏర్పడుతాయి. ఆ బిందువులు ఎలా ఏర్పడ్డాయి? గాలిలోని నీటి ఆవిరి ద్రవీకరణం జరిగి నీటిబిందువులు ఏర్పడ్డాయన్నమాట. అంటే, నీరు ఘన, ద్రవ, వాయువు స్థితులలో వుంటుంది కదూ! ఘనస్థితిలోని ఐస్ లేక మంచు నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణంలో ఉంటాయి. ద్రవస్థితిలోని నీటికి నిర్దిష్టమైన ఘనపరిమాణమున్నా ఏ పాత్రలో పోస్తే - ఆ పాత్ర ఆకారం సంతరించుకుంటుంది. నీటిని ఒక పాత్రలో పోసి పొయ్యి మీద వేడి చేస్తే నీరు ఆవిరి రూపంలోకి రావడాన్ని మీరు గమనించే ఉంటారు. ఆవిరి రూపంలోని నీటికి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా? ఉండదు. నిర్దిష్టమైన ఘనపరిమాణం కూడా వుండదు. దొరికిన ప్రదేశాన్నంతా ఆక్రమిస్తుంది. నీరు రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సీజన్ పరమాణువుతో బంధాల ద్వారా ఏర్పడిన (సమ్మేళనం) అణునిర్మితం. అలా ఏర్పడిన అణువులు ఘన, ద్రవ, వాయుస్థితులలో ఉండటానికి అణువు చలనమే ముఖ్య కారణం. ఉదాహరణకు ఘరూపంలో ఐన్ తక్కువ ఉష్ణోగ్రతలో ద్రవ నీరు, వాయు రూపంలో నీరు కంటే తక్కువ శక్తిలో ఉంటుంది. అంత తక్కువ శక్తిలో వున్న నీటి అణువులు ఐస్ లో అటు ఇటు తిరుగలేవు. అణువులు ఒక స్థిరమైన స్థావరంలోనే వుంటాయి. ఆ స్థిర ఆకృతిని ఐస్ స్పటికం అంటారు. వాయువు లేదా ద్రవం కంటే ఘనపదార్థంపై పీడన ప్రభావం చాల తక్కువ. ద్రవస్థితిలోని నీటి అణువులకు శక్తి ఎక్కువ వుంటుంది. ఐస్ లో కంటే ద్రవంలో నీటి అణువులు అటు యిటు తేలికగా కదులుతూ ఒకదానిపై నుంచి మరొకటి జారిపోతూ వుంటాయి. అందుకే ద్రవాలు ప్రవాహంగా కదులుతుంటాయి. ఒక పాత్రలో నుంచి మరొక పాత్రలోకి పోయవచ్చు కదూ! ద్రవాలు పాత్ర ఆకారంలో ఉంటాయి. కాని పాత్రంతా నింపవు. ద్రవాలపై కూడ పీడన ప్రభావం తక్కువ. ద్రవాలలాగానే నీటి ఆవిరి ఒక చోటి నుంచి మరోచోటికి ప్రవహిస్తుంది కదూ! పాత్ర మొత్తం కూడ ఆక్రమించుకొంటుంది. నీటి ఆవిరి రూపంలోనే అణువులకు అధిక శక్తి ఉండటం వలన అన్ని దిశలకు వ్యాపిస్తాయి. అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉండటం వలన పీడన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నీటిచక్రంలో నీటి ఆవిరిది ప్రధాన భూమిక. చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాల నుంచి నీరు ఆవిరై మేఘాలు ఏర్పడి వర్షం రూపంలో తిరిగి భూమిని చేరుతుంది. నీరులాగానే అన్ని మూలకాల పరమాణువులు, అణువులు, సమ్మేళనాలు కూడ మూడు స్థితులలో వుంటాయి. పదార్థాలను బట్టి వాటి స్థితి మారే ఉష్ణోగ్రతలు మారతాయి. ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారే ఉష్ణోగ్రతను ఆ పదార్థ ద్రవీభవన స్థానం అంటారు. ఐస్ ద్రవీభవన స్థానం 0°C, బంగారం ద్రవీభవన స్థానం 1064°C. బంగారం కరగటానికి ఐస్ . కంటే అధిక ఉష్ణశక్తి కావాలి. నేస్తాలూ! అన్ని పదార్దాలు ద్రవం నుండి వాయువుగా మారతాయి. ద్రవం వాయుపుగా మారే ఉష్ణోగ్రతను బాష్పీభవన స్థానం అంటారు. నీటి బాష్పీభవన స్థానం 100°C, ద్రవ బంగారం బాష్పీభవన స్థానం 2856°C, బంగారం వాయువుగా మారాలంటే అధిక ఉష్ణశక్తి కావాలి. సరిపోయినంత ఉష్ణశక్తిని ఇవ్వటం లేక రెఫ్రిజరేటర్ లో పెట్టి ఉష్ణశక్తిని తొలగించటం వలన పదార్ధపు భౌతిక స్థితి మారుతుంది. ఉష్ణశక్తి యివ్వటం అంటే పదార్థాన్ని వేడిచేయటం, దాని వలన పదార్థంలోని పరమాణువులు లేక అణువుల వేగం పెరుగుతుంది. రెఫ్రిజరేటర్ లో పెట్టి ఉష్ణశక్తి తీసి వేయటం వలన పదార్థంలోని పరమాణువుల లేక అణువుల కదలికలో వేగం తగ్గుతుంది. వాయువులను బాష్పీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువకు చల్లబరచటం వలన ద్రవం ఏర్పడుతుంది. ద్రవాన్ని ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే తక్కువకు చల్లబరిస్తే ఘనపదార్థం ఏర్పడుతుంది. ఉష్ణశక్తిని ఇవ్వటం, తొలగించటం వలననే పదార్థస్థితిలో మార్పు చెందటమేగాక పీడనం ద్వారా కూడా పదార్థపు స్థితిని మార్చవచ్చు. అధికపీడనంతో వాయువులు ద్రవాలుగా మారతాయి. ఎందుకంటే పీడనం పదార్థంలోని పరమాణువులను లేక అణువులను దగ్గరగా చేర్చుతుంది. స్వల్ప పీడనంలో పరమాణువుల దూరంగా జరిగి ద్రవాలు బాష్పఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా వాయువుగా మారతాయి. పదార్థానికి నాలుగోస్థితి కూడా వుంది నేస్తాలూ! వాయువులు అధికంగా వేడెక్కినప్పుడు వాటిలోని వరమాణువులు లేదా అణువులు ఎంతశక్తిని పొందుతాయంటే అవి ఎలక్ట్రాన్లను పోగొట్టుకునేటంత. దీనితో ధనావాశం గల పరమాణువులు, ఋణావేశం గల స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి. వాయువులో అన్ని అణువులు లేదా పరమాణువుల ఆవేశాన్ని పొందక కొన్ని తటస్థంగా కూడ వుంటాయి. నేస్తాలూ! స్వేచ్చా ఎలక్ట్రాన్లు, ఆవేశం పొందిన పరమాణువులు, తటస్థ పరమాణువుల మిశ్రమాన్ని ప్లాస్మా అంటారు. ప్లాస్నా అనే పదార్థం నాలుగోస్థితి. భూమి మీద యిది అరుదుగా ఏర్పడుతుంది. విశ్వంలో 99% పదార్ధం ప్లాస్మా రూపంలోనే ఉంటుంది. నక్షత్రాలు, కామెట్లు అత్యధికంగా ప్లాస్మానే. మెరుపు మెరిసినప్పుడు గాలిలో ఆక్సీజన్, నైట్రోజన్ ఎలక్ట్రాన్లను పోగొట్టుకొని ప్లాస్మా ఏర్పడుతుంది. నేస్తాలూ! ప్లాస్మాతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతిదీప్తి బల్బులోని విద్యుత్ ప్రసరింప చేసినప్పుడు నియాన్ ల్యాంప్, మెర్క్యురి ల్యాంప్ సోని వాయువులలో ప్లాస్మా ఏర్పడుతుంది. కంప్యూటర్ చిప్స్ ను తయారు చేయటంలో, స్టీలని వెల్డింగ్ చేయడంలో ప్లాస్మా వాడతారు. సూర్యుడి లోని ప్లాస్మాలోని పరమాణు కేంద్రకాలు కలవటంగాని, సంలీనం గాని చెంది అత్యధికమైన శక్తి వెలువడుతుంది. ఆధారం: ప్రొ. ఎం. ఆదినారాయణ