చూసేదంతా నిజం కాదు. విన్నదంతా నిజం కాదు. చూసి, విని, నిజానిజాలు బేరీజు వేసుకొని సత్యాన్ని గ్రహించాలి అని పెద్దలు చెబుతారు. 'రజ్జు సర్ప భ్రాంతి' అనే ఓ భ్రమను పెద్దవాళ్ళు చెబుతుంటారు. అంటే ఒకాయన చీకటిలో పొలంగట్టుపై వెడుతూ చీకటిలో తాడు(రజ్జు)ను తొక్కి పాము(సర్పం) అని భ్రమ(భ్రాంతి)పడి భయపడిపోయినాడట, అదే “రజ్జు సర్ప భ్రాంతి”. మంత్రగాడిగా చెప్పుకునే ఓ అతను మీ కళ్ళముందే ఓ నాణెమును మాయం చేసాడు అనుకోండి. అపుడు మంత్రాలు వున్నాయని మీరు నమ్ముతారా? నేనయితే నమ్మను. ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రాలవని మీకూ తెలుసుకదా, మంత్రాలకు, మొక్కులకు చింతకాయలూ రాలవు. పరీక్షలలో మార్కులు కూడా రాలవు. మరి మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఇష్టపడి చదివి, బాగా పరీక్షలు రాస్తే మార్కులు వస్తాయి. మీ మిత్రులకు ఓ పరీక్ష పెట్టండి. టేబిల్ పై ఓ రూపాయి నాణెమును ఉంచి, అందరూ చూస్తుండగానే దానిని మాయం చేయాలని ఓ వందెం కాయండి. ఎవరూ ముందుకు రారు కదా. అపుడు మీరు, “నేను మాయం చేస్తా చూడండి” అని చెప్పి పందెం గెలవండి. ఎలాగా అంటారా? రండి! చేసి చూద్దాం. కావలసినవి: రూపాయి/రెండు రూపాయల బిళ్ళ, ఓ మూతగల ఖాళీ బాటిల్, నీరు. చేయు విధానం: టేబిల్ పై రూపాయి నాణెం ఉంచండి, దానిపై ఖాళీ బాటిల్ వుంచండి. (పటము 1 లో మాదిరి) ఇపుడు బాటిల్ వైపు చూస్తే నాణెం బాటిల్ లోపల వున్నట్లు కనిపిస్తుంది. ఇక మీరు, “హ... హ... హ..." అని నవ్వి, 'అబ్రకదబ్ర' అబ్రకదబ్ర' అని చెబుతూ బాటిల్ నిండుగా నీరు పోయండి. బాటిల్ నిండిన తరువాత బాటిల్‌కు మూత పెట్టండి. బాటిల్లో నీటిమట్టం పెరుగుతూ వుంటే నాణెం నీటిలో కరుగుతున్నట్టుగా మాయమైపోతుంది. మూత పెట్టేసి (పటము 2 లో మాదిరి) బాటిల్ వైపు చూస్తే నాణెం కనిపించదు. మాయమై ఉంటుంది. అంతే, మీరు పందెం గెలిచేశారోచ్! ఇది ఎలా సాధ్యం? తెలుసుకుందామా! వివరణ: నాణెంపై వున్న బాటిల్లో నీరు లేనప్పుడు, నాణెంపై పడిన కాంతి పరావర్తనం (Reflection) చేందీ... బాటిల్ అడుగుభాగం గుండా ప్రయాణించీ... మన కంటిని చేరటం వలన, నాణెం మనకు కనబడుతుందన్న మాట. అదే బాటిల్లో నీరు పోశాక, నాణెం నుండి బయలుదేరిన కాంతి కిరణాలు... నీరుగల బాటిల్ క్రింది భాగాన్ని కొంత కోణంలో తాకుతుంది. యానక భేదం వల్ల (బాటిల్ క్రింద గాలి యానకం, బాటిల్ లోపల నీటి యానకం) కాంతి వంగి ప్రయాణిస్తుంది. అందువల్ల కాంతి బాటిల్ క్రింద కాకి పూర్తిగా వెనుకకు మరలుతుంది. దీనినే సంపూర్ణాంతర పరావర్తనం (Total Internal Reflection) అంటారు, అందువల్ల నాణెం పై బడిన కాంతి మన కంటిని చేరదు. కాబట్టి నాణెం కనిపించదు. (బాటిల్‌కు మూత పెట్టడం మరచిపోకండి. మూతలేకుండా బాటిల్ కంఠంలో నుండి, నేరుగా చూస్తే నాణెం కనిపించవచ్చు సుమా) అదన్నమాట సంగతి, ఆధారం: యం.ఎస్. సుగంధర్ బాబు