మెజీషియన్ సుబ్బు చాలా ఉత్సాహంగా మేజిక్ షో నిర్వహిస్తున్నాడు. విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా లభించడంతో చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మెజీషియన్ వేదిక మీద ఉన్న టేబుల్ మీద ఆరు గాజు గ్లాసులు ఉంచాడు. ఒక గాజు సీసాని ఒక చేతిలో పట్టుకొని పైకెత్తి అందరికి చూపించాడు. ఆ సీసాని అందంగా అలంకరించడం వల్ల చాలా ఆకర్షణీయంగా కన్పించింది. ఆ సీసాలో ఏదో ద్రవం ఉంది. ఆ ద్రవాన్ని టేబుల్ మీద ఉన్న గ్లాసుల్లో పోశాడు. గ్లాసుల వెనుక ప్రకాశవంతమైన విద్యుద్దీపాన్ని వెలిగించాడు. దీపం కాంతిలో గ్లాసుల్లోని ద్రావణాలు వరుసగా ఎరుపు, తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ పొగాకు రంగుల్లో ఆకర్షణీయంగా కన్పించాయి. అంతా చప్పట్లు కొట్టారు. ఈ మేజిక్ ను మనం కూడా చేయవచ్చు. ఇందుకు కావల్సిన రసాయనాలు 5గ్రా ఫెర్రాక్ అమ్మోనియం సల్ఫేట్, పొటాషియం థయోసయనేట్, బేరియం క్లోరైడ్, పొటాషియం ఫెర్రోసయనైడ్, టానిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, సోడియం హైడ్రోజన్ సల్ఫైట్. ముందుగా ఆరు గాజు గ్లాసుల్ని టేబుల్ మీద ఉంచి వాటికి వరుసగా 1 నుంచి 6 దాకా అంకెలున్న స్టిక్కర్లను గుర్తు కోసం అంటించి వాటిని ఆ వరుసలో ఉంచాలి. ఆ గ్లాసుల్లో వరుసగా (1) పొటాషియం ధయోసయినేట్ (2) బేరియం క్లోరైడ్ (3) పొటాషియం ఫెర్రోసయనైడ్ (4) టానిక్ ఆమ్లం (5) టార్టారిక్ ఆమ్లం (6) సోడియం హైడ్రోజన్ సల్ఫైడ్ లను 500 మి.గ్రా. చొప్పున తీసుకొని కొన్ని మిల్లీమీటర్ల నీటిలో కరిగించాలి. గాజు సీసాలో 5 గ్రా. ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ ను 500 మి.లీ. నీటిలో కరిగించాలి. ఆ ద్రావణాన్ని వరుసగా ఆరు గ్లాసుల్లోను పోయాలి. వరుసగా ఎరుపు, తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ, పొగాకు రంగు ద్రావణాలు ఏర్పడతాయి. ఈ రంగు ద్రావణాలు ఏర్పడ్డానికి కారణం ఏమిటి? ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ ద్రావణాన్ని గ్లాసుల్లోని ఆయా ద్రావణాలకు కలిసినప్పుడు, వేర్వేరు అయాన్ల మధ్య చర్యల కారణంగా వేర్వేరు రంగులు ఏర్పడతాయి.