“ఫలానా క్రీము మీ ముఖానికి పూయండి. మీ నల్లని రంగు తెల్లగా మారిపోతుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా మీ ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే ఫలానా క్రీము/ లోషన్/ పౌడర్ వాడండి.” అని టి.వి.లో ప్రకటనల హెూరు మీరు చూసే వుంటారు. ఈ క్రీములు వాడినవారు ఎవ్వరుకూడా నలుపు నుండి తెల్లగా మారిన దాఖలా లేదు. అసలు ఏ రంగులో వుంటే ఏముంది. ఓ సముద్రపు ఒడ్డున ఒకతను తేలికైన గ్యాస్ (హైడ్రోజన్) నింపిన బెలూన్లు (బుడగలు) అమ్ముతూ వున్నాడు. డబ్బులిచ్చి బెలూన్ కొన్నవారు బెలూన్లు వదిలిపెడితే అది అలా పైకి తేలిపోతూవున్నవి. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులు గల బెలూన్లు అలా పైకి తేలిపోతూ వుండగా అక్కడ ఆడుకుంటున్న ఓ అబ్బాయికి అనుమానం వచ్చి బెలూన్లు అమ్మే అతన్ని అడిగాడు. “నలుపు... బెలూన్ పైకి పోతుందా?“ అని. అమ్మే అతను “నీకెందుకు అనుమానం?“ అడిగాడు. దానికి ఆ కుర్రవాడు "నేను నల్లగా వుంటాను. అందరూ ఎగతాళి చేస్తారు. నేను ఎందుకూ పనికిరానేమోనని నాకు అనుమానం అందుకే నలుపు రంగు వుండే బెలూన్ పైకి పోతుందా?“ అని అడిగాడు. దానికి బెలూన్ అమ్మేవాడు ఇలా అన్నాడు, “బాబు బెలూన్ పైకి పోయేది రంగువల్ల కాదు. లోపల వున్న హైడ్రోజన్ గ్యాస్ వలన. నలుపు, తెలుపు, లావు, సన్నం, ఎత్తు, పొట్టి ఇలాంటివి ఏవీ మనిషికి అడ్డు కాదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం కావాలి“. బాగుంది కదా, మీరు కూడా ఇలాంటి రంగుల తేడాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. సరేనా. ఇక అసలు విషయానికి వస్తా, రంగుమార్చే గులాబి పూవు. గులాబి పూవు రంగు ఎలా మారుస్తుంది. అది మార్చదు. మనమే మార్చుదాం. కావాలంటే ఓ పందెం కాయండి. “ఎర్రని గులాబిను తెల్లగా మార్చగలరా? “ అని. ఎవ్వరూ మార్చలేరు. సరే ఇక మనమే మారుస్తాం. రండి చేసి చూద్దాం. ఓ గాజు సీసా తీసుకొని దానిలో గంధకం (సల్బర్) ముక్కనుంచి అగ్గిపుల్లతో అంటించండి. దట్టమైన పసుపు రంగు పొగ ఆవిరిలాగ వెలువడుతుంది. ఆ పొగలో ఎర్రగులాబి పూవును పటములో లాగ వుంచి పట్టుకోండి. అంతే గులాబి పూవు రాను రాను రంగు కోల్పోతూ కాసేపటికి తెల్లగులాబీ గా మారిపోతుంది. అంతే పందెం గెలిచాం. (గంధకం పొగ ఘాటుగా వుంటుంది. కాబట్టి ఈ ప్రయోగం ఆరుబయట చేయడం మంచిది). అసలు ఎర్రగులాబి తెల్లగా ఎలా మారింది? అసలేం జరిగింది? గాలిలో సల్ఫర్ (గంధకం) మండినపుడు సల్సర్ డై ఆక్సైడ్ SO2 ఏర్పడుతుంది. ఈ సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు మంచి వివర్ణకారి (అంటే రంగును తొలగించేది, బ్లీచింగ్ చేసేది) మరియు సూక్ష్మక్రిములను నాశనం చేసేది. (జర్మిసైడల్), ఈ వివర్ణకారి వాయువు సల్ఫర్ డై ఆక్సైడ్ ఎర్రపూవు గుండా ప్రయాణిస్తూ ఎర్రరంగు (పిగ్మెంట్)ను తనతో తీసుకుపోతుంది. దానితో ఎర్రపూవు తెల్లగా మారింది. అంతే కాదు ఈ సల్ఫర్ డై ఆక్సైడ్ చెట్ల ఆకులలోని క్లోరోఫిల్ (పత్రహరితాన్ని)ను నాశనం చేస్తుంది. అందుకే ఫాక్టరీల వద్ద చెట్లు సరిగా పెరగవు. ఈ వాయువు గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడి చెట్లు సరిగా పెరగవు. అందుకే మనం చెట్లు బాగా పెంచి కాలుష్యాన్ని అరికట్టాలి. తెలిసిందా. ఆధారం: పలమనేరు యుగంధర్ బాబు