ఒక కొవ్వొత్తిని వెలిగించండి. ఇప్పుడు ఓ ఇనుప జల్లెడనుగాని, లేదా ఇంకేదైనా లోహపు జల్లెడనుగాని తీసుకుని, పటంలో చూపిన విధంగా దాన్ని కొవ్వొత్తి జ్వాలపై వుంచండి. విచిత్రం ! దాని జ్వాల జల్లెడను తాకుతూనే వుంటుంది. అయినా జల్లెడ రంధ్రాల్లోంటి దూరి మాత్రం బయుటకు రాదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా ? ఇది అర్థం కావాలంటే ముందుగా కొవ్వొత్తి ఎలా మండుతుందో మీరు ఒకసారి మననం చేసుకోవలసి వుంటుంది. కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు.... ముందుగా మైనం కరిగి ద్రవ రూపంలోకి మారి మండుతుంది. దాన్నే మనం కొవ్వొత్తి జ్వాలగా పేర్కొంటాము. మరి ఈ జ్వాలపైన లోహపు జల్లెడను ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే.... లోహపు జల్లెడ అనేది ఒక మంచి ఉష్ణవాహకం అయినందువల్ల అది చాలా వేడిమిని గ్రహించగల్లుతుంది. దాంతో జల్లెడ క్రింది భాగంలో మండగలిగే మైనపు గ్యాస్ అప్పుటికే చాలా వేడిమిని కోల్పోయినందువల్ల అది మండలేకపోతుందన్న మాట. అదీ అసలు విషయం .... ఒకవేళ లోహపు జల్లెడ బాగా వేడెక్కి అంటే అది ఎర్రగా మారేంత వేడిగా అయినప్పుడు మాత్రం----- దాని రంధ్రాల గుండా బయటకు వచ్చే మైనపువాయుపు కూడా మండగల్గుతుంది..... ఒకప్పుడు, భూమి లోపల గనుల్లో పనిచేసే వారికి ఉద్ధేశించిన దీపాల్లో ఈ సూత్రాన్ని బాగా ఉపయోగించేవారు. ఆ దీపాల్లో వెలిగే జ్యోతి తాలుకూ మంట వెలుపలికి రాకుండా దాని చుట్టు లోహపు జల్లెడను ఏర్పాటు చేసేవారు. ఇలా చేయడం వలన, ఒకవేళ గనుల్లో ఎక్కడైనా తేలిగ్గా మండే స్వభావం గల వాయువులు ఉన్నప్పుటికి వీటికి వెంటనే మంటలంటుకోకుండా చేయడానికి సాధ్యమయ్యేది.