మెజీషియన్ చేతిలో ఒక తెల్లని కార్డు ఉంది. ఒక స్కెచ్ పెన్ తో కార్డు మీద ఒక బాణం గుర్తు గీసి అందరికీ చూపించాడు. వేదిక మీద ఒక టేబుల్ ఉంది. దాని మీద ఒక గాజు గ్లాసు ఉంచాడు. గ్లాసు నిండా నీరు పోశాడు. “ఇప్పుడు మీరంతా ఈ కార్డు మీద వున్న బాణం గుర్తును చూడండి. ఈ కార్డును నీటితో నిండిన ఈ గాజు గ్లాసు వెనక ఉంచి కదుపుతాను. గాజుగ్లాసు గుండా చూస్తూనే ఉండండి ఏమవుతుందో గమనించండి.” అన్నాడు మెజీషియన్. విద్యార్థులంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మెజీషియన్ కార్డును కొంచెం కొంచెంగా గాజు గ్లాసుకు దూరంగా కదుపుతున్నాడు. ఒక దశలో కార్డు మీద బాణం గుర్తు దిశను మార్చుకుని వెనక్కి తిరిగింది. అందరూ ఆశ్చర్యంలో చప్పట్లు కొట్టారు. ఈ మేజిక్ మనం చేయగలం. చాలా తేలిక. ఇందుకు కావలసినవి ఒక గాజుగ్లాసు, నీరు, తెల్లనికార్డు, బాల్ పెన్ లేదా స్కెచ్ పెన్. ముందుగా తెల్లని కార్డు మీద సుమారు 2 సెం.మీ. పొడవున ఒక బాణం గుర్తు గీయాలి. గాజుగ్లాసును టేబుల్ మీద పెట్టి నీటితో నింపాలి. కార్డును గాజుగ్లాసు వెనుకన ఉంచి కొంచెం కొంచెంగా గ్లాసు నుంచి దూరం పెంచాలి. గ్లాసు ముందు వైపు నుంచి కార్డును గమనిస్తూ ఉండాలి. కార్డు గాజు గ్లాసు నుంచి నిర్ధిష్టమైన దూరంలో ఉన్నప్పుడు బాణం గుర్తు వెనక్కు మళ్లుతుంది. ఇదే మెజీషియన్ చూపించిన మేజిక్. ఇలా ఎందుకు జరుగుతుంది? కాంతి వక్రీభవనము (Refraction) ఇందుకు కారణం. కాంతి ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు వంగుతుంది. దీన్నే వక్రీభవనం అంటాం. ఈ ప్రయోగంలో కాంతి గాలి ద్వారా, గాజులోకి తర్వాత నీటి ద్వారా గాజు గ్లాసు వెనుక వైపుకు అక్కడి నుంచి తిరిగి గాలి ద్వారా ప్రయాణించి బాణం గుర్తును తాకుతుంది. కాంతి ఒక యానకం లేదా పదార్ధం నుంచి వేరొక యానకం అని పదార్థం గుండా ప్రయాణించినప్పుడు అది వంగుతుంది. ఇది నిజమే అయినా బాణం గుర్తు వెనక్కు తిరుగుతుంది. ఇందుకు మరికొంత వివరణ అవసరం. నీటితో నిండిన గాజుగ్లాసు ఒక భూతద్దం (magnifying glass) అనుకోవాలి. భూతద్దం గుండా కాంతి ప్రయాణించినప్పుడు కాంతి కేంద్రం వైపుకు వంగుతుంది. ఇలా వంగిన కాంతి కిరణాలు కలిసే బిందువును ప్రధాన నాభి (focal point) అంటారు. ఈ బిందువుకు ఆవల ప్రతిబింబం తిరగబడినట్లు కన్పిస్తుంది. ఇందుకు కారణం ఉంది. వంగిన కాంతి కిరణాలు ప్రధాన నాభి దగ్గర ఒకదానినొకటి దాటుకుంటూ పోతాయి. అంటే కుడి ఎడమ అయినట్లు, ఎడమ కుడి అయినట్లు మనకు అగుపిస్తుంది. అందుచేతనే ప్రతిబింబం తిరగబడుతుంది. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం