బాలలు! మీ స్నేహితుల ముందు గాలి ఒత్తిడి ఎంత బలంగా వుంటుందో తెలియజేయాలనుకుంటున్నారా? అయితే దీనికి ఒక సులభమైన పద్ధతి వుంది. చేసి చూడండి. బాగా ఉడకబెట్టిన గుడ్డును, శుభ్రపరచిన పాల సీసాను తీసుకోండి. గుడ్డుపై పెంకును ఒలిచి సీసామూతి పై గుడ్డును ఉంచండి. గుడ్డును సీసాలోకి నెట్టమని మీ మిత్రులను అడగండి. మొదట్లో అది చాలా సులభం అని వాళ్లు అనుకుంటారు. కాని ఎన్ని సార్లు ప్రయత్నించినా అలా చెయ్యలేరు. సీసాలోని గాలి బయటకు రాలేదు. కనుక గుడ్డు లోపలికి పోలేదు. సీసాలోని గాలి ఒత్తిడి గుడ్డును లోనికి పోనివ్వదు. అప్పుడు మీరు ఆ పని ఎలా చెయ్యగలరో వాళ్ళకు చూపండి. ఒక అగ్గిపుల్లను గీసి సీసాలో పడవేసి దాని మూతిపై గుడ్డును ఉంచండి. మంట సీసాలోని ప్రాణవాయువును హరిస్తుంది. అప్పుడు బయట ఉండే ఒత్తిడి గుడ్డును సీసాలోకి నెడుతుంది. గుడ్డును మళ్ళీ బయటికి ఎలా తీస్తారు ? మీ మిత్రులు ఎన్నిసార్లు ప్రయత్నించినా వారికి అది సాధ్యం కాదు. మీరు సీసాను తిరగవేసి మూతి వద్దకు గుడ్డు జారేలా చెయ్యండి. తదుపరి సీసాను తలక్రిందులు చేసి సీసాలోకి మీరు ఎంత గట్టిగా ఊదగలిగితే అంత గట్టిగా ఊదండి. మీ నోటిని వెనక్కు తీసినప్పుడు గుడ్డు ఎంత తటాలున బైటకు వస్తుందంటే దాని వేరొక చేతిలోకి తీసుకొనేందుకు మీరు సిద్దంగా ఉండాలి. సీసాలో గాలి ఒత్తిడి బయట ఉండే గాలి ఒత్తిడి కన్నా ఎక్కువ అయినందువల్ల ఇలా జరుగుతుంది.. నిర్వహణ : టి.వి.యం..యస్. ప్రకాష్ రావు, కావలి, నెల్లూరు జిల్లా