ఆ రోజు మేజిక్ షోకు రంగం సిద్ధమైంది. మెజీషియన్ సుబ్బు చేతిలో ఒక ఆపిల్ ఉంది. వేదికమీదున్న టేబుల్ పైన కొన్ని ప్లాస్టిక్ స్టాలు, మరికొన్ని ఆపిల్స్ ఉన్నాయి. మెజీషియన్ తన చేతిని పైకెత్తి ఆపిల్ ను అందరికీ చూపించాడు. మరోచేత్తో టేబిల్ మీద వున్న ఒక ప్లాస్టిక్ స్ట్రా ను పైకి తీశాడు. “ఇదిగో చూడండి. ఈ స్ట్రా ను ఈ ఆపిల్ లోకి గుచ్చాలి. ఈ వైపు గుచ్చితే అవలివైపును పొడుచుకుని రావాలి. మీలో ఇద్దరు లేదా ముగ్గురు వేదిక మీదికి రండి" అని పిలిచాడు. ముందు వరుసలోనే కూర్చున్న ఆశ్రీత, సాకేత్, కార్తీక్ వేదిక మీదికి వెళ్ళారు. మెజీషియన్ ఒక్కొక్కరికి ఒక ఆపిల్, ఒక స్ట్రా ఇచ్చాడు. “మీకిచ్చిన స్ట్రా ను ఆపిల్ లో గుచ్చగలరేమో ప్రయత్నించండి." అన్నాడు. విద్యార్థులు ఎంత ప్రయత్నించినా స్ట్రా వంగిపోయిందే తప్ప ఆవీల్ కు గుచ్చుకోనేలేదు. "అదేమి మేకు కాదు కదా! ఆపిల్ లోకి ఎలా వెళుతుంది? మాకు సాధ్యం కాదు.", అన్నారు విద్యార్థులంతా, “సరే. మీకు చేతకానీ పని నేను చేసి చూపిస్తా. అదే ఈ రోజు మేజిక్ అందరూ చూడండి." అన్నాడు మెజీషియన్. విద్యార్థుల్లో ఆసక్తి ఎక్కువైంది. అంతా మెజీషియన్ వైపే చూస్తున్నారు. అలా చూస్తుండగానే మెజీషియన్ ఆపిల్ ను పట్టుకుని రెండో చేతిలోని ప్లాస్టిక్ స్టాను ఆపిల్ కి గుచ్చాడు. అదేదో మెజీషియన్ చెప్పినమాట విన్నట్లుగా ఆపిల్ లోకి చొచ్చుకుపోయి మరోవైపు నుంచి బయటకు వచ్చింది. “చూశారుగా? ప్లాస్టిక్ స్ట్రా ఒక ఉక్కు మేకు లాగా మారిపోయిందన్నమాట!" అన్నాడు మెజీషియన్. విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. “ఈ మేజిక్ ఏమిటో మాకూ చెప్పండి." అని విద్యార్థులంతా అడిగారు. “ఇది నిజానికి మేజిక్ కాదు మాయా కాదు. దీంట్లో ఉన్నది సైన్స్ మాత్రమే. ఇది చేయడం చాలా సులభం. నేనెలా చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. మీకే అర్ధమౌతుంది." అంటూ చేసి చూపించాడు మెజీషియన్, ముందుగా ఆపిల్ ను టేబుల్ మీద కదలకుండా ఉంచాలి. లేదా ఒక చేత్తో గట్టిగా పట్టుకోవాలి. రెండో చేతిలోకి ఏ వంకరలు లేని ప్లాస్టిక్ స్ట్రాను తీసికొని ఒకవైపు రంధ్రాన్ని బొటనవ్రేలితో గట్టిగా మూసివేయాలి. ఇలా చేయడం వల్ల స్ట్రాలోని గాలికి రెండోవైపు నుంచి బయటికి పోయే మార్గం లేదు. ఇప్పుడు స్ట్రాను ఆపిల్ కు గుచ్చితే స్ట్రాలో బంధించబడిన గాలి స్ట్రా ను గట్టిగా అంటే ఒక ఉక్కు మేకులాగా చేస్తుంది. అందుచేతనే స్ట్రా ను ఆపిల్ మీద గుచ్చి లోపలికి తోస్తే ఒక మేకును దించినట్లుగా లోపలికి దిగి రెండోవైపు నుంచి బయటికి వస్తుంది.'' అని వివరించాడు మెజీషియన్. కాని ఈ మేజిక్ చేసేటప్పుడు స్ట్రా చేతిలో గుచ్చుకోకుండా జాగ్రత్త పడాలి. ఆపిల్ ను టేబిల్ మీద ఉంచి స్ట్రాకు గుచ్చడమే మంచిది. ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం